Breaking News

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ!

-క్లాస్ రూం నుంచే సమాజంలో మార్పు సాధ్యం…అందుకే విద్యాశాఖ ఎంచుకున్నా
-సాంకేతికతకు భారతీయ విలువలు జోడించి ప్రపంచ విజేతలుగా ఎదుగుదాం
-దేశభక్తి, నైతిక విలువలే మన కుటుంబ వ్యవస్థకు పునాది
-త్యాగధనులే మన మార్గదర్శకులు.. వారి బాటలో పయనిద్దాం
-విలువలతో ఎదగండి.. తల్లిదండ్రులకు, దేశానికి గర్వకారణంగా నిలవండి
-చిన్నచిన్న సమస్యలకే కుంగిపోవద్దు… ఎదురొడ్డి పోరాడాలి
-భారతీయం కార్యక్రమంలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్

కాకినాడ రూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశ చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ర్యాంక్స్ తెచ్చుకున్న పిల్లల ఫోటోలతో పత్రికలు, టీవీల్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం. ఈ ఏడాది 1.10 లక్షల మంది స్టూడెంట్స్ ప్రైవేట్ నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఇంటర్ లో కూడా 10 వేల అడ్మిషన్స్ పెరిగాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల సహకారంతోనే ఈ ఫలితాలు సాధించాం. దీనికి నైతిక విలువలు కూడా తోడైతే మన ఎపి మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దేశంలోనే నెం.1గా మారుతుందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ తిమ్మాపురం ఆకుండి లక్ష్మీ స్మారక గోశాల ప్రాంగణంలో భారతీయం పేరుతో పాఠశాల విద్యాశాఖ, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యాన భారతీయం పేరుతో నిర్వహించిన దేశభక్తి కార్యక్రమానికి లోకేష్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… చాగంటి గారి ప్రవచనం వినపడని ఇల్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండదు. చాగంటి గారిని ఎప్పుడు కలిసినా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ‘భారతీయం’ అనే గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గురువు గారికి ధన్యవాదాలు. నాది భారతదేశం…నేను భారతీయుడిని. మన భారతదేశం… మన గౌరవం, మన సనాతన ధర్మం మన బలం. నైతిక విలువలకు పుట్టినిల్లు మన దేశం. మానవత్వం మన వారసత్వం. నైతిక విలువలే కుటుంబ వ్యవస్థ మన పునాది. వైద్యంలో చరకుడు, రాజనీతిలో చాణుక్యుడు, గణితంలో ఆర్యభట్ట, యోగాలో పతంజలి, ఆయుర్వేదంలో ధన్వంతరి పురాతన కాలంలోనే భారతీయుల సత్తా ప్రపంచానికి చూపించారని అన్నారు.

నైతిక విలువలవల్లే భారతీయులంటే గౌరవం

“ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులు అంటే గౌరవంగా చూస్తారు. అదే పెద్దవాళ్లు మనకు ఇచ్చిన ఆస్తి. విలువలతో కూడిన సమాజం, కుటుంబ వ్యవస్థ. యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ ద స్ట్రెంత్ ఆఫ్ అవర్ నేషన్. ఇంత గొప్ప ఆస్తిని కాపాడుకోవడమే కాదు భావి తరాలకు అందించాలి. అందుకే నైతిక విలువలతో కూడిన విద్య అందిస్తున్నాం. నైతిక విలువలు అనగానే గుర్తొచ్చే మొదటి పేరు చాగంటి కోటేశ్వరరావు గారు. అందుకే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆయనను నైతిక విలువల సలహాదారుగా నియమించారు. ఆయన రూపొందించిన పుస్తకాలు విద్యార్థులకు అందిస్తున్నాం. చిన్నతనం నుండే పెద్దలను, మహిళలను గౌరవించడం నేర్పిస్తున్నాం. గెలుపు – ఓటమి రెండింటినీ సమానంగా తీసుకునేలా తయారుచేయడమే లక్ష్యం. 6 ఏళ్ల లోపే పిల్లల్లో 90% బ్రెయిన్ డెవలప్ అవుతుంది. ఆ స్టేజ్ లోనే పిల్లలకు చదువు, గేమ్స్ తో పాటు నైతిక విలువలు కూడా నేర్పించాలి. అప్పుడే మనం దేశానికి బెస్ట్ సిటిజన్స్ ని అందించగలం” అని అన్నారు.

సమాజంలో మార్పు విద్య ద్వారానే సాధ్యం

సమాజంలో మార్పు విద్య ద్వారానే సాధ్యమని నమ్మి విద్యాశాఖ ఎంచుకున్నా. చాగంటి గారి ద్వారా విలువల విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం విద్యార్థి కేంద్రంగా ఉండాలి. బాపట్ల మొదటి పిటిఎంలో పిల్లలకు పెట్టే భోజనమే ముఖ్యమంత్రి తిన్నారు, క్వాలిటీ పెంచాలని చెప్పారు. సమాజంలో మార్పు క్లాస్ రూం నుంచే ప్రారంభం అవుతుంది. క్షణికావేశంతో తీసుకునే నిర్ణయాలు విధ్వంసానికి దారి తీస్తాయి. నేను అమెరికా స్టాన్ఫోర్డ్ లో చదివాను. రెండేళ్ల ఎంబీఏ పరీక్షల్లో ఎప్పుడూ ఇన్విజిలేటర్లను చూడలేదు. ఆ రకమైన క్రమశిక్షణ మనవద్ద కూడా రావాలి. ప్రపంచంలో ఎన్నో దేశాలు తమ దేశ అభ్యున్నతికి రెండుతరాలు కష్టపడ్డాయి. ఒకపుడు మత్స్యకార గ్రామం సింగపూర్ అలాగే అభివృద్ధి చెందింది. ప్రధాని మోదీ నేతృత్వంలో ఇప్పుడు భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. నమ్మిన సిద్ధాంతాలు సాధించే వరకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలి. మన రాష్ట్రం ఈ స్థాయికి రావడం వెనుక ఎంతో మంది కష్టం దాగి ఉంది. దేశ సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులు లేకపోతే ఇప్పుడు మనం ప్రశాంతంగా ఉండేవారం కాదు. సైనికులు కనపడితే విద్యార్థులు సెల్యూట్ కొట్టండి. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కో పరీక్ష పెడతాడు, ఎదుర్కొనే శక్తి కూడా ఇస్తాడు. మార్కులు తక్కువ వచ్చాయని, ఇప్పటికిపుడు సాధించ లేపోయామని ఆత్మహత్య వంటి తీవ్రమైన నిర్ణయం తీసుకోవద్దు. నేను ఈ స్థాయికి చేరడం వెనుక నా తల్లి కష్టం, త్యాగం ఉన్నాయి. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల త్యాగం వల్లే మనం ఉన్నత స్థానాలకు చేరుకుంటాం. నైతిక విలువలు, అమ్మప్రేమ ఉన్న పుణ్యభూమి మన భారత దేశం.

రాజకీయాలకు దూరంగా విద్యావ్యవస్థ

అందరూ వద్దన్నా విద్యా శాఖను ఛాలెంజ్ గా తీసుకున్నా. గడిచిన రెండేళ్లలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకురావడం టార్గెట్ గా పెట్టుకున్నాం. చిన్నపిల్లల మనసు చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే నేను మంత్రి అయిన వెంటనే తీసుకున్న మొదటి నిర్ణయం నో పాలిటిక్స్ ఇన్ స్కూల్స్. యూనిఫాం, బుక్స్, బ్యాగ్స్, బెల్ట్స్, షూస్ ఎక్కడా నో పొలిటికల్ పార్టీ కలర్స్. ఎక్కడా ముఖ్యమంత్రి, నా ఫోటో ముద్రించలేదు.

నైతిక విలువలతో ప్రపంచ విజేతలమవుతాం

అటమిక్ ఎనర్జీతో విద్యుత్ వెలుగులు ఇవ్వొచ్చు. అదే ఆటమ్ బాంబ్ విధ్వంసం కూడా చేస్తుంది. ఒక మొక్క నాటిన తర్వాత పెద్ద చెట్టు అవ్వాలంటే సంవత్సరాలు పడుతుంది. ఆ చెట్టు నీడ ఇస్తుంది, కాయలు ఇస్తుంది. అదే చెట్టుని 5 నిమిషాల్లో కొట్టేయొచ్చు. అదే నిర్మాణం – విధ్వంసం మధ్య తేడా. పిల్లల్లో ఆలోచనా శక్తి పెరిగేలా చేయడమే నైతిక విలువల లక్ష్యం. ఏది మంచి – ఏది చెడు తెలిసేలా చేయాలి. మనం AI, రోబోటిక్స్ గురించి మాట్లాడుతున్నాం. వాటికి భారతీయం నైతిక విలువలు తోడవ్వాలి. అప్పుడే మనం ప్రపంచ విజేతలం అవుతాం. గురువు గారు చాగంటి కోటేశ్వరరావు గారు పిల్లలకు చెప్పిన ఒక మాట నాకు బాగా గుర్తుండిపోయింది. అమ్మకు చెప్పలేని పని చేయొద్దు అని ఆయన అన్నారు. నేను ఎక్కడికి వెళ్లినా ఈ మాట చెబుతున్నాను. వినడానికి చాలా సింపుల్ గా ఉంది, కానీ అర్థం చేసుకుంటే చాలా పవర్ ఫుల్ మెసేజ్ ఉంది. ఇదే మన భారతీయం – అమ్మ గొప్పతనం. ఎప్పుడూ తప్పు చేయకూడదు అనే గొప్ప పాఠం.

త్యాగధనుల స్పూర్తే మనకు మార్గదర్శకం

కష్టపడి చదివారు. విలువలతో పెరిగారు. గొప్ప పదవులు పొందారు. దేశం కోసం అన్నీ త్యాగం చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు కూడా లెక్కచేయలేదు. అటువంటి వారి త్యాగాలు గుర్తు చేసుకోవడం మన బాధ్యత. దేశ భక్తికి, గుండె ధైర్యానికి మానవ రూపం టంగుటూరి ప్రకాశం పంతులు. 1928 లో సైమన్ గో బ్యాక్ అంటూ ఉద్యమం చేశారు. బ్రిటిష్ వాళ్లు కాల్చేస్తాం అని బెదిరించారు. ఆయన భయపడలేదు… గుండెను చూపించి దైర్యం ఉంటే కాల్చండి అని సింహంలా గర్జించారు. అందుకే ఆయనకు ఆంధ్రకేసరి అనే బిరుదు వచ్చింది. మద్రాస్ రాష్ట్రంలో తెలుగు వారికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించారు పొట్టి శ్రీరాములు గారు. 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేశారు. ఆయన త్యాగం వలనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.

దేశం కోసం పోరాడిన సైనికులే నిజమైన హీరోలు
మనం సినిమాలు చూస్తాం. అందులో ఫైట్స్, డాన్సులు చూసి హీరోలు అంటాం. కానీ నిజమైన హీరోలు మన సైనికులు. మన భారతీయం వేదిక పై అటువంటి హీరో ఉన్నారు. కార్గిల్ యుద్ధ వీరుడు డి. కిరణ్ కుమార్ గారు. బోర్డర్ లో శత్రువులతో పోరాడారు. బాడీలో బుల్లెట్స్ దిగాయి. కంటి చూపు పోయింది. అయినా వెనక్కి తగ్గకుండా పోరాడారు. ఇప్పటికీ ఆయన బాడీలో బుల్లెట్ ఉంది. ఆయన దేశ భక్తి గెలిచింది – బుల్లెట్ ఓడిపోయింది. మరో ఉదాహరణ ఆర్మీ జవాన్ మురళీ నాయక్. ఆపరేషన్ సిందూర్ టైం లో చనిపోయారు. నేను సత్యసాయి జిల్లాలో ఉన్న మురళీ నాయక్ ఇంటికి వెళ్లి, ఆయన తల్లిదండ్రులను కలిశాను. చిన్నప్పటి నుండి మురళీ నాయక్ కి ఆర్మీలో జాయిన్ కావాలని కోరిక. వాళ్ల ఇంట్లో ఒప్పుకోలేదు. వాళ్ల అమ్మ, నాన్న ఒక్కటే అన్నారు. నీకు ఏమైనా అయితే మేము ఏం కావాలని అడిగారు. నేను యుద్ధంలో చనిపోతే దేశం మొత్తం మీ కోసం నిలబడుతుంది అని మురళీ నాయక్ చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. మురళీ నాయక్ చెప్పినట్టే దేశం కోసం ఆయన ప్రాణ త్యాగం చేశాడు. దేశం మొత్తం ఆ కుటుంబానికి అండగా నిలిచింది. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన మురళీ నాయక్ లాంటి వారు మన హీరోలు. వారి త్యాగాలను గౌరవించడం, స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.

విజయానికి షార్ట్‌కట్ లేదు…

సక్సెస్ కి షార్ట్ కట్స్ ఉండవు. హార్డ్ వర్క్ తోనే మనం మంచి పొజిషన్ కి వెళ్లగలం. అందుకు నేనే ఒక ఉదాహరణ. కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాను. ప్రజలకు సేవ చేయాలి అనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చాను. 2019 లో పోటీ చేసి ఓడిపోయాను. తొలిసారి ఫెయిల్ అయ్యాను. డిసపాయింట్ అవ్వలేదు. FAIL అంటే First Attempt In Learning అనుకున్నాను. 5 ఏళ్లు కష్టపడి ప్రజలకు దగ్గరయ్యాను. కట్ చేస్తే 2024 లో స్టేట్ లోనే 3వ అతిపెద్ద మెజారిటీతో గెలిచాను. చాలా మంది మంగళగిరి టీడీపీ సీట్ కాదు. టీడీపీకి కంచుకోట లాంటి సీట్లకి వెళ్లండి అని సలహా ఇచ్చారు. నథింగ్ డూయింగ్ నేను పడిపోయిన చోటే నిలబడతా అని ఛాలెంజ్ చేశాను. చేసి చూపించాను. రోడ్ లెస్ ట్రావెల్ చేసినపుడే విజయం వరిస్తుంది.

సమస్యలకు ఎదురొడ్డి పోరాడండి…

ఈమధ్య జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే నాకు చాలా బాధ వస్తుంది. జులై 24 న మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించుకున్నాం. మన ముఖ్యమంత్రి గారు రంపచోడవరం లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఆ ప్రోగ్రాంలో శివాని అనే 10వ క్లాస్ స్టూడెంట్ మాట్లాడింది. చాలా అద్భుతంగా మాట్లాడింది.వేరే విద్యార్థి షైనింగ్ స్టార్ అవ్వడం చూసి తను కూడా షైనింగ్ స్టార్ అవ్వాలని కష్టపడి చదివింది. స్పీచ్ అయ్యాక నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లి ఫోటో కూడా తీయించాను. ఆ కార్యక్రమం తర్వాత రెండు రోజులకే శివాని ఆత్మహత్య చేసుకుంది. నేను చాలా బాధపడ్డాను.ఇంట్లో ఏదో సమస్య ఉందని శివాని ఆత్మహత్య చేసుకుంది. దేవుడు మనకి పరీక్ష పెడతాడు… ఆ పరీక్ష ఎదుర్కొనే శక్తి కూడా మనకి ఇస్తాడు. చిన్న చిన్న సమస్యల కోసం అటువంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు. ఇంట్లో చెప్పుకోలేని సమస్య ఏదైనా ఉంటే మీ టీచర్ కి చెప్పండి. వాళ్లు మీకు సహాయం చేస్తారు.

తల్లిదండ్రులను గర్వపడేలా ఎదగండి

తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి మిమ్మల్ని చదివిస్తున్నారు. వారు తలదించుకునేలా ఎప్పుడూ ప్రవర్తించవద్దు. వారు తల ఎత్తుకునేలా చేయండి. మీకు నచ్చిన రంగంలో ఎదగండి. ఆటలు, పాటలు, చదువు ఏదైనా పర్వాలేదు కానీ కష్టపడండి. ఊరికే గొప్ప వారు అవ్వరు. గురువర్యులు చాగంటి కోటేశ్వరరావు గారిని చూడండి. ఆయన నిత్య విద్యార్థి. ఎప్పుడూ ఖాళీగా ఉండరు. ఒక ఊరు నుండి ఇంకో ఊరు వెళ్లేటప్పుడు కూడా పుస్తకాలు చదువుతూ ఉంటారు. దేశ భక్తి – దైవ భక్తి – పెద్దలు అంటే గౌరవం – మహిళలను గౌరవించడం. సమాజం పట్ల బాధ్యత. ఇవన్నీ ఉంటే మీరు విజేతలు అవుతారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కోరుకున్నట్టు వికసిత్ భారత్, మన ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుకున్నట్టు స్వర్ణాంధ్ర మీతోనే సాధ్యం. ఫైనల్ గా ఒక్కటి చెబుతాను, తల్లిదండ్రులను ఎంత ప్రేమిస్తామో భారతదేశాన్ని అంత ప్రేమించాలి” అని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవంతంగా జరిగిన హెల్తీ విజయవాడ రెగ్యులర్ మెడికల్ క్యాంపు.

-200 మందికి పైగా రోగులకు వైద్య సేవలు -ప్రజా ఆరోగ్య వేదిక మరియు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *