డ్రగ్స్‌కు అడ్డుకట్ట.. మహిళలకు భద్రత.. రోడ్లపై ప్రాణాలకు రక్షణ – ఆపరేషన్ త్రిశూల్

-ప్రజల భద్రతే లక్ష్యం.. ప్రతి ప్రాణం రక్షణే ధ్యేయం
-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్.వి. రాజశేఖర్ బాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజల భద్రత, సంక్షేమాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా “ఆపరేషన్ త్రిశూల్” కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లాలో అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ తెలిపారు.

జిల్లా కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ అధ్యక్షతన, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్.వి.రాజశేఖర్ బాబుతో కలిసి ఆపరేషన్ త్రిశూల్ ప్రారంభోత్సవ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ట్లాడుతూ, ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా మూడు ప్రధాన అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్, మహిళలపై నేరాలు, రోడ్డు ప్రమాదాలు కుటుంబాలను, సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నందున పోలీస్, రవాణా, వైద్య ఆరోగ్య, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలతో పాటు సంబంధిత అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఆపరేషన్ త్రిశూల్‌ను మూడు వేర్వేరు కార్యక్రమాలుగా కాకుండా, సమగ్ర ప్రజా భద్రతా కార్యక్రమంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. డ్రగ్ వినియోగదారులను గుర్తించడం మాత్రమే కాదు.. వారు తిరిగి డ్రగ్స్ వైపు వెళ్లకుండా చూడటమే అసలు లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. మహిళలకు ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, అవసరమైన చోట విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ పెంపు, వేగవంతమైన స్పందన, రిపీట్ ఆఫెండర్లపై పర్యవేక్షణ వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యాసంస్థలు, కార్యాలయాలు, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖతో సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు 1,122 నుంచి 557కు తగ్గాయని, 50.4 శాతం తగ్గుదల నమోదైందని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా ప్రమాద మరణాలు 426 నుంచి 285కు తగ్గాయని, 33.1 శాతం తగ్గుదలతో 141 మంది ప్రాణాలను కాపాడగలిగామని పేర్కొన్నారు. అయితే 285 మంది మరణాలు అంటే 285 కుటుంబాలు తమ ఆత్మీయులను కోల్పోయిన విషాదమని, ఒక్క ప్రాణాన్ని కూడా కోల్పోకుండా చూడటమే తదుపరి లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి తీవ్రమైన రోడ్డు ప్రమాదాన్ని సమగ్రంగా సమీక్షించాలని ఆదేశించారు. ప్రమాద స్థలానికి పోలీసులు, అంబులెన్స్, రోడ్ సేఫ్టీ, ఎన్ హెచ్ రెస్పాన్స్ వాహనాలు చేరుకున్న సమయం, రహదారి ఇంజినీరింగ్ లోపాలు, లైటింగ్, అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్ వినియోగం వంటి అంశాలను పరిశీలించాలని సూచించారు. ఒక ప్రమాదానికి కారణమైన అంశం మళ్లీ అదే ప్రాంతంలో మరో ప్రమాదానికి కారణం కాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆపరేషన్ త్రిశూల్ సమన్వయ కమిటీ కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి, ప్రతి నెలా అమలును సమీక్షించాలని కలెక్టర్ సూచించారు. సమావేశాలు కేవలం నిర్వహించిన కార్యక్రమాల సంఖ్య ఆధారంగా కాకుండా సాధించిన ఫలితాల ఆధారంగా ఉండాలని తెలిపారు. డ్రగ్ పాజిటివిటీ తగ్గిందా? పునరావాసం పొందిన వారు డ్రగ్స్‌కు దూరంగా కొనసాగుతున్నారా? మహిళా భద్రతా ప్రాంతాల్లో నేరాలు తగ్గాయా? అత్యవసర స్పందన సమయం మెరుగుపడిందా? బ్లాక్ స్పాట్లలో ప్రమాదాలు, మరణాలు తగ్గాయా? అనే అంశాలపై నిరంతరం సమీక్ష జరగాలని సూచించారు. ఆపరేషన్ త్రిశూల్‌కు మూడు ప్రధాన సూత్రాలు మార్గదర్శకంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. ఆపరేషన్ త్రిశూల్ కేవలం ఒక కార్యక్రమంగా మిగలకుండా ప్రతి కుటుంబానికి ఇచ్చే భరోసాగా మారాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు.

కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్.వి.రాజశేఖర్ బాబు మాట్లాడుతూ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆగస్టు 2024–జూలై 2025 కాలంతో పోలిస్తే, ఆగస్టు 2025–జూలై 2026 కాలంలో మొత్తం నేరాలు 6,814 నుంచి 5,692కు తగ్గాయని, మొత్తం నేరాల్లో 16.5 శాతం తగ్గుదల నమోదైందని తెలిపారు. ఈ పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లేలా ఆపరేషన్ త్రిశూల్‌లోని మూడు ప్రధాన లక్ష్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల సరఫరా, విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగిస్తూనే, డ్రగ్స్‌కు అలవాటు పడిన వారిని గుర్తించి కౌన్సెలింగ్, పునరావాసం, తిరిగి పరీక్షలు, సమాజంలో పునఃసమీకరణకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో NDPS కేసులు 86 నుంచి 16కు తగ్గాయని, అంటే 81.4 శాతం తగ్గుదల నమోదైందని తెలిపారు. డ్రగ్స్ వినియోగదారుల పరీక్షలను 5,663 మందికి నిర్వహించడం జరిగిందని, వీరిలో 1,287 మందికి గంజాయి వినియోగంలో పాజిటివ్ గా తేలిందన్నారు. 907 మందికి కౌన్సెలింగ్, పునరావాసం కల్పించడం జరిగిందని తెలిపారు . అనంతరం 794 మంది తిరిగి పరీక్షల్లో నెగెటివ్ గా నమోదైనట్లు తెలిపారు. మహిళలపై నేరాలు 1,281 నుంచి 1,092కు తగ్గాయని, 14.8 శాతం తగ్గుదల నమోదైందని కమిషనర్ తెలిపారు. మహిళలు భయపడకుండా ప్రయాణించగలగడం, చదువుకోగలగడం, పనిచేయగలగడం, ప్రజా ప్రదేశాలను స్వేచ్ఛగా వినియోగించగలగడం ద్వారానే నిజమైన భద్రత సాధ్యమవుతుందని పేర్కొన్నారు. యువతను డ్రగ్స్ నుంచి కాపాడటం, మహిళలు గౌరవంతో మరియు భద్రతతో జీవించేలా చూడటం, రోడ్లపై సాధ్యమైన ప్రతి ప్రాణాన్ని కాపాడేందుకు కృషి చేయడమే ఆపరేషన్ త్రిశూల్ ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. “జీరో డ్రగ్స్.. మహిళలపై అఘాయిత్యాలకు జీరో టాలరెన్స్.. సురక్షితమైన రోడ్లు” అనే లక్ష్యాలతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

చివరిగా త్రిశూల్ ప్రచార గోడపత్రికను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, కమిషనర్ ఆఫ్ పోలీస్ తదితర అధికారులు త్రిశూల్ ప్రచార రథాన్ని ప్రారంభించారు. అనంతరం అధికారులు, పోలీసు సిబ్బందితో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో డీసీపీలు కేజీవి సరిత, జి.రామకృష్ణ, డీఎంహెచ్‌వో డాక్టర్ ఎ.శ్రవణ్ బాబు, ఐసీడీఎస్ పీడీ షేక్ రుక్సానా బేగం, పోలీస్, రవాణా, వైద్య శాఖల అధికారులు, ఈగల్ టీమ్స్, త్రిశూల్ టీమ్స్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *