-40 మంది వ్యర్థాల సేకరణ, హెయిర్ పికింగ్ కార్మికులకు రూ.3.20 లక్షల విలువైన ఆస్తుల పంపిణీ
-పారిశుధ్య కార్మికుల ఆర్థిక సాధికారతకు డీబీఆర్‌సీ ప్రత్యేక కార్యక్రమం
-జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ
-“జీవనోపాధి సాధనాలను సద్వినియోగం చేసుకుని కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవాలి”
-స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కొమ్మారెడ్డి పట్టాభిరామ్
-స్వచ్ఛతకు సేవ చేస్తున్న చేతులకు ఆర్థిక భరోసా 40 మంది వ్యర్థాల సేకరణ, హెయిర్ పికింగ్ కార్మికులకు రూ.3.20 లక్షల విలువైన జీవనోపాధి ఆస్తుల పంపిణీ
-జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీశ, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో సోమవారం వ్యర్థాల సేకరణ (Waste Pickers), హెయిర్ పికింగ్ (Hair Pickers) వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల ఆదాయ అవకాశాలను మెరుగుపరచడంతో పాటు, వారి ఆర్థిక భద్రతను బలోపేతం చేయాలనే లక్ష్యంతో దళిత్ బహుజన్ రిసోర్స్ సెంటర్ (DBRC) ఆధ్వర్యంలో ప్రత్యేక జీవనోపాధి సహాయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా 40 మంది వ్యర్థాల సేకరణ, హెయిర్ పికింగ్ కార్మికులకు సుమారు రూ.3.20 లక్షల విలువైన జీవనోపాధి ఆస్తులను డీబీఆర్‌సీ పంపిణీ చేసింది. వీటిలో
నాలుగు చక్రాల పుష్ కార్టులు, అల్యూమినియం పాత్రలు, చీరల విక్రయానికి అవసరమైన సామగ్రి
మసాలా దినుసుల విక్రయ కార్టులు
వంటి జీవనోపాధి సాధనాలు ఉన్నాయి. ఈ ఆస్తులు లబ్ధిదారులకు అదనపు ఆదాయ అవకాశాలను కల్పించడంతో పాటు, స్థిరమైన జీవనోపాధిని అభివృద్ధి చేసుకునేందుకు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ మాట్లాడుతూ, పట్టణాలు, గ్రామాల్లో పరిశుభ్రతను కాపాడటంలో వ్యర్థాల సేకరణ, హెయిర్ పికింగ్ కార్మికులు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని అభినందించారు. పర్యావరణ పరిరక్షణలో వారు పోషిస్తున్న కీలక పాత్రను కలెక్టర్ ప్రశంసించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని తమ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అట్టడుగు, అణగారిన వర్గాలకు చెందిన కార్మికుల జీవనోపాధి, ఆర్థిక సాధికారత కోసం డీబీఆర్‌సీ చేస్తున్న కృషిని కలెక్టర్ అభినందించారు.
స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ, అందజేసిన జీవనోపాధి ఆస్తులు లబ్ధిదారులకు అదనపు ఆదాయ అవకాశాలను కల్పిస్తాయని తెలిపారు.
ప్రభుత్వం, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేస్తే వ్యర్థాల సేకరణ, హెయిర్ పికింగ్ కార్మికుల సంక్షేమం మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
లబ్ధిదారులు అందుకున్న జీవనోపాధి సాధనాలను సమర్థవంతంగా వినియోగించుకుని తమ కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి, వారి అనుభవాలు, ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల ద్వారా అందుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ జీవనోపాధిని మరింత బలోపేతం చేసుకోవాలని వారికి సూచించారు.
డీబీఆర్‌సీ డిప్యూటీ డైరెక్టర్–ప్రోగ్రామ్స్ శామ్యూల్ అనిల్ కుమార్ మాట్లాడుతూ, వ్యర్థాల సేకరణ, హెయిర్ పికింగ్ కార్మికులు, ఇతర అనధికారిక రంగ కార్మికుల సంక్షేమం, జీవనోపాధి అభివృద్ధి, సామాజిక భద్రత కోసం డీబీఆర్‌సీ అనేక సంవత్సరాలుగా పనిచేస్తోందని తెలిపారు. లబ్ధిదారులు అందుకున్న ఆస్తులను సమర్థవంతంగా వినియోగించుకుని తమ ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. జీవనోపాధి అభివృద్ధి, సామాజిక రక్షణ, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు చేరువ చేయడంలో డీబీఆర్‌సీ తన సహకారాన్ని కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ జె.రమాదేవి, సిటీ కోఆర్డినేటర్ రమేష్, ప్రవల్లిక, అనిత, డీబీఆర్‌సీ బృంద సభ్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News