-430 మంది పేదలకు ఉచిత రిజిస్ట్రేషన్.. పొజిషన్ ధ్రువపత్రాలు అందజేత
-పేదలకు చట్టబద్ధమైన హక్కు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సుభాష్
-పేదల కళ్లలో కనిపించిన ఆనందం ఎప్పటికీ మరువలేనిది: సుభాష్
-గత ఎన్నికల్లో వైసీపీ నేతలకు ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారు: మంత్రి సుభాష్
-కొడాలి నాని, వల్లభనేని వంశీ తీరుపై మంత్రి సుభాష్ తీవ్ర విమర్శలు
-అహంకారపూరిత వ్యాఖ్యలకు ఎన్నికల్లో ప్రజలే సమాధానం చెప్పారు: సుభాష్
-ఇది రాజకీయ సభ కాదు.. పేదలకు హక్కు కల్పించే కార్యక్రమం: యార్లగడ్డ
-నకిలీ పట్టాలపై కేసు నమోదు కాలేదని చెప్పేవారు ప్రమాణం చేసి చెప్పగలరా?: యార్లగడ్డ
-కొడాలి నాని గుడివాడలో బహిరంగ చర్చకు సిద్ధమా : యార్లగడ్డ
-గన్నవరం అభివృద్ధిపై దృష్టి.. ప్రధాన రహదారుల విస్తరణతో మారుతున్న పట్టణ రూపురేఖలు: యార్లగడ్డ
-యార్లగడ్డ వంటి ఎమ్మెల్యే దొరకడం గన్నవరం ప్రజల అదృష్టం: కాగిత కృష్ణప్రసాద్
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలకు చట్టబద్ధమైన హక్కు కల్పించినప్పుడు వారి కళ్లలో కనపడిన ఆనందం ఎప్పటికీ మరువలేనిదని మంత్రి వాసంశెట్టి సుభాష్, ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. బాపులపాడు మండలం హనుమాన్‌జంక్షన్‌లోని ఎస్.ఆర్. కన్వెన్షన్ (రాయల్ హంపి కళ్యాణమండపం)లో మంగళవారం 430 మంది లబ్ధిదారులకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి పొజిషన్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కృష్ణా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి తదితరులు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో వైసీపీ నేతలకు ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారని అన్నారు. మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీరుపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అధికారంలో ఉన్న సమయంలో నోటికి వచ్చినట్లు మాట్లాడిన నేతలు, ప్రజల తీర్పుతో రాజకీయంగా చతికిలపడ్డారని వ్యాఖ్యానించారు. కుప్పంలో చంద్రబాబునాయుడు ఓడిపోకపోతే ఆయన బూట్లు తుడుస్తానంటూ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. అహంకారపూరిత వ్యాఖ్యలకు ప్రజలే ఎన్నికల్లో సమాధానం చెప్పారని అన్నారు. వైసీపీ నేతలు ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని మంత్రి సూచించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోకుండా, ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు, అసభ్య వ్యాఖ్యలకే ప్రాధాన్యమిచ్చారని విమర్శించారు. ప్రజలు తిరస్కరించిన తర్వాత కూడా అదే ధోరణిని కొనసాగిస్తూ మళ్లీ అధికారంలోకి వస్తామంటూ ప్రకటనలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలపై పోరాడటం, అభివృద్ధి కోసం ప్రత్యామ్నాయ ప్రణాళికలు చెప్పడం మానేసి.. అధికారంలోకి వస్తే అధికారుల బట్టలు ఊడదీస్తాం, నరికేస్తామంటూ బెదిరింపు వ్యాఖ్యలు చేయడం వారి రాజకీయ సంస్కృతికి నిదర్శనమని అన్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారశైలిని కూడా మంత్రి తప్పుబట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన పట్టాల విషయంలో వివాదాలు సృష్టించి ప్రజలను అయోమయానికి గురిచేశారని విమర్శించారు. రైతులకు సుమారు రూ.2 కోట్ల విలువైన మోటార్లు అందించిన తర్వాత వాటిని తిరిగి ఇవ్వాలని కోరడం చిన్నపిల్లలు ఆటలో ఓడిపోయిన తర్వాత తమ బ్యాట్లు, వికెట్లు తిరిగి అడిగినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. అయితే ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు రైతులకు తన సొంత ఖర్చులతో మోటార్లు అందించడం ద్వారా తన చిత్తశుద్ధిని చాటుకున్నారని చెప్పారు. మాట ఇస్తే మడమ తిప్పనని చెప్పుకునే వైసీపీ నాయకులు ఎన్నిసార్లు మాట మార్చారో ప్రజలకు తెలుసని మంత్రి అన్నారు. దీనికి భిన్నంగా యార్లగడ్డ వెంకట్రావు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఎంతటి కష్టమైనా వెనుకాడకుండా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు విశ్రమించని ముక్కుసూటి నాయకుడిగా ప్రజల మధ్య ఉంటున్నారని చెప్పారు. రెండు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ధైర్యంగా ప్రజల ముందుకు వస్తున్నారని, గత ప్రభుత్వ నేతలు మాత్రం ప్రజల్లోకి వచ్చి తమ పాలన గురించి చెప్పే పరిస్థితిలో లేరని విమర్శించారు. వైసీపీకి ప్రజలు ఇప్పటికే చరమగీతం పాడారని, ఇకనైనా మేకపోతు గంభీరాన్ని విడిచి ప్రజా సమస్యలు, అభివృద్ధి, సంక్షేమంపై మాట్లాడాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. ప్రజలకు ఏం చేస్తామో చెప్పకుండా కేవలం బెదిరింపులు, వ్యక్తిగత దూషణలతో రాజకీయాలు చేయడం వల్ల ప్రజల విశ్వాసం తిరిగి రాదని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. కార్యక్రమానికి హాజరైన 430 మంది ఏదో ఒక పార్టీకి మాత్రమే చెందినవారు కాదని, తనకు ఓటు వేసిన వేసిన వారు వేయని వారు కూడా ఉన్నారని అన్నారు. ఇది రాజకీయ సభ కాదని, పేదలకు హక్కు కల్పించే కార్యక్రమమన్నారు. గతంలో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఘటనపై 2019 ఎన్నికలకు ముందు ఫిర్యాదుతో కేసు నమోదైన విషయాన్ని గుర్తు చేశారు. నకిలీ పట్టాలపై కేసు నమోదు కాలేదని చెప్పేవారు దుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేసి చెప్పగలరా అంటూ మాజీ మంత్రి కొడాలి నానికి సవాల్ విసిరారు. అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడటం కాదని, ఇప్పుడు కూడా అదే ధైర్యంతో మాట్లాడాలని అన్నారు. అక్రమ కేసులు, అక్రమ మైనింగ్ అంశాలపైనా మాజీ మంత్రులు సమాధానం చెప్పాలని యార్లగడ్డ డిమాండ్ చేశారు. నారా లోకేశ్ పాదయాత్ర సమయంలో తనపై ఒకేరోజు ఏడు కేసులు నమోదు చేశారని, తాను మాత్రం వైసీపీ కార్యకర్తలపై ఒక్క తప్పుడు కేసు కూడా పెట్టలేదన్నారు. కొండపావులూరు ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరగలేదని దేవుడి సాక్షిగా ప్రమాణం చేసి చెప్పగలరా అంటూ మాజీ మంత్రులను ప్రశ్నించారు. గన్నవరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, గాంధీబొమ్మ సెంటర్‌తో పాటు ప్రధాన రహదారుల విస్తరణతో పట్టణ రూపురేఖలు మారుతున్నాయని తెలిపారు. తాము అభివృద్ధిపై దృష్టి సారిస్తుంటే ప్రతిపక్షం రాజకీయాలకే పరిమితమవుతోందని విమర్శించారు.
గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ.. 430 మందికి పైగా పేదలకు ఇళ్ల స్థలాలకు సంబంధించిన హక్కు పత్రాలు అందించడం అభినందనీయమన్నారు. తాను గుడివాడలో పుట్టి పెరిగినా గన్నవరం, హనుమాన్జంక్షన్కు తరచూ వచ్చేవాడినని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ఫలితాల సమయంలో గుడివాడ, గన్నవరం ఎవరు గెలుస్తారో అని చూసిన పరిస్థితి ఉందన్నారు.
పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. గన్నవరం నియోజకవర్గ ప్రజలకు యార్లగడ్డ వెంకట్రావు వంటి ఎమ్మెల్యే దొరకడం అదృష్టమన్నారు. ఏదైనా సమస్యను పట్టుకుంటే పరిష్కారం లభించే వరకు వదిలిపెట్టరని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమ కేసులు, అసమర్థ పాలన సాగిందని విమర్శించారు. మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో గత పాలనను, ప్రస్తుత పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలని సూచించారు. ప్రజలను పక్కదారి పట్టించేలా వైసీపీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి మాట్లాడుతూ.. చిత్తశుద్ధితో యార్లగడ్డ వెంకట్రావు పనిచేస్తున్నారని అభినందించారు. పేదల కోసం చేపడుతున్న ఇలాంటి కార్యక్రమాలు అభినందనీయమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు జరుగుతున్న మంచి ఏమిటో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి పనులు, రహదారుల నిర్మాణం పెద్దగా కనిపించలేదని విమర్శించారు.
గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు, గన్నవరం నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు ఆకుల జయసత్య, గన్నవరం నియోజకవర్గ వ్యవసాయ మార్కెటింగ్ యార్డ్ కమిటీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు, బాపులపాడు మండల టీడీపీ అధ్యక్షులు, ఏపీ రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ దయాల రాజేశ్వరరావు, గన్నవరం మండల టీడీపీ అధ్యక్షులు గూడపాటి తులసి మోహన్, ఉంగుటూరు మండల టీడీపీ అధ్యక్షులు కొలుసు రవీంద్ర బాబు, విజయవాడ రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు గొడ్డల్ల చిన్న రామారావు, నాగార్జునసాగర్ ఎడమ కాలువ ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి మల్ఫురి సాయి కళ్యాణి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి కానూరు శేషుమాధవి, టీడీపీ సీనియర్ నాయకులు దొంతు చిన్న, వేములపల్లి శ్రీనివాసరావు, బొప్పన హరికృష్ణ, జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు మొవ్వ వెంకటేశ్వరరావు, గన్నవరం నియోజకవర్గ తెలుగుమహిళా అధ్యక్షురాలు మేడేపల్లి రమ, బాపులపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి పుట్టా సురేష్, డీసీ-2 చైర్మన్ కొమ్మారెడ్డి రాజేష్, మాణిక్యాలరావు, వడ్డీ శివ నాగేశ్వరరావు, చిన్నాల లక్ష్మీనారాయణ, కలపాల కుమార్, నీలం అశోక్ కుమార్, అట్లూరి శ్రీనివాసరావు, జొన్నలగడ్డ సుధాకర్, బోడపాటి రవికుమార్, మువ్వా వేణుగోపాల్, చలసాని శ్రీనివాసరావు, గండేపూడి నితీష్, మాతంగి వెంకటేశ్వరరావు, సింగవరపు చంద్రమౌళి, తులిమెల్లి ఝాన్సీ, బేతాళ ప్రమీల రాణి, బడుగు ఝాన్సీ, బేతా శేషు కుమార్, దన్నే మల్లికార్జున రావు, వేగే కృష్ణారావు, కొల్లి లక్ష్మీనారాయణ, వల్లూరిపల్లి నాని, ఆలూరి రామకృష్ణ ప్రసాద్, అక్కినేని ధర్మరాజు, ఆర్నేపల్లి సూరిబాబు గరికిపాటి వెంకటేశ్వరరావు, వేగిరెడ్డి పాపారావు, అక్కినేని చైతన్య, కొండేటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News