-ఆందోళనకారులపైనే కేసులా? దాడులకు పాల్పడిన వారిపై చర్యలు లేవీ?
-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఖండన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విజయవాడ శాప్ కార్యాలయం ఎదుట వైసీపీ చేపట్టిన నిరసనపై భౌతిక దాడులు చేయించడం, లాఠీచార్జ్‌కు పాల్పడటం వంటి చర్యలు గర్హనీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్రంగా ఖండించారు. ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన తప్పుపట్టారు.
ఈ మేరకు మంగళవారం ఈశ్వరయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో అన్యాయాలు, అక్రమాలపై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడం, ఆందోళనలు చేపట్టడం ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. ప్రజలు లేవనెత్తే ఆరోపణలు, సందేహాలపై ప్రభుత్వం పారదర్శకంగా స్పందించి వాస్తవాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉందన్నారు.
అందుకు భిన్నంగా ప్రజా ఉద్యమాలను అణచివేసేందుకు బలప్రయోగానికి పాల్పడటం, ఇతర శక్తులను ప్రోత్సహించి ఆందోళనకారులపై భౌతిక దాడులు చేయించడం, అనంతరం లాఠీచార్జ్ చేయడం వంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని తెలిపారు.
శాప్ కార్యాలయం వద్ద పోలీసుల సమక్షంలోనే కొందరు వ్యక్తులు పోలీసుల చేతుల్లోని కర్రలను తీసుకుని ఆందోళనకారులపై దాడులకు పాల్పడటం, రాళ్లు విసరడం వంటి ఘటనలు ప్రత్యక్షంగా కనిపించినప్పటికీ, వారిపై చర్యలు తీసుకోకుండా నిరసనలో పాల్గొన్న వైసీపీ నాయకులపైనే వివిధ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేయడం తగదన్నారు.
ఈ పరిణామాలు కక్షసాధింపు ధోరణిని ప్రతిబింబిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వచ్చిన ఆరోపణలను పక్కనపెట్టి, వాటిపై ప్రశ్నిస్తున్న వారిపైనే నిర్బంధ చర్యలకు దిగడం సమస్యకు పరిష్కారం కాదన్నారు. ఇప్పటికైనా ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను ప్రజల ముందుంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రజా ఉద్యమాలపై నిర్బంధాలు, దాడులు కొనసాగితే రాష్ట్రంలో ప్రజల్లో ఆందోళన, అనిశ్చితి పెరిగి, శాంతిభద్రతల పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరిని పునఃపరిశీలించి, ప్రజాస్వామ్య హక్కులను గౌరవించాలని కోరారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై దాడులకు పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవడంతో పాటు, లాఠీచార్జ్‌కు దారితీసిన పరిస్థితులపై సమగ్రంగా విచారించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Prajavartha Online Telugu News