-డిస్పెన్సరీలు, సమీకృత ఆయుష్ ఆసుపత్రులు, ప్రత్యేక చికిత్సా కేంద్రాలకు భారీగా నిధులు
-మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
-రేపు జాతీయ ఆయుర్వేద దినోత్సవం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రులు, డిస్పెన్సరీల మౌలిక వసతులు, వైద్య సదుపాయాలను మెరుగుపరుస్తూ ఆయుర్వేద వైద్య సేవలను బలోపేతం చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు ఆయుర్వేద వైద్యం మరింత చేరువయ్యేలా ఆసుపత్రుల నిర్మాణం, డిస్పెన్సరీల ఆధునికీకరణ, ఉచిత మందులు, ప్రత్యేక చికిత్సలు, వైద్య పరికరాలకు నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. “ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం” అనే ఇతివృత్తంతో జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఆయుర్వేద వైద్య సేవలకు సంబంధించిన కార్యక్రమాలను మంత్రి వివరించారు.
ఆరు జిల్లాల్లో 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రులు
శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రుల నిర్మాణం, పరికరాల కొనుగోలుకు రూ.27 కోట్లు ఆమోదించినట్లు మంత్రి తెలిపారు. విశాఖపట్నం సమీకృత ఆయుష్ ఆసుపత్రి మౌలిక వసతులకు రూ.2.61 కోట్లు, నిర్వహణకు రూ.1.50 కోట్లు, కాకినాడ సమీకృత ఆయుష్ ఆసుపత్రి నిర్వహణకు రూ.1.50 కోట్లు మంజూరైనట్లు చెప్పారు.
334 డిస్పెన్సరీలు.. 40 ఆయుర్వేద కేంద్రాలు
రాష్ట్రంలోని 334 ప్రాథమిక ఆయుర్వేద డిస్పెన్సరీలు, 40 ఎన్ఆర్హెచ్ఎం ఆయుర్వేద కేంద్రాలు, రెండు ప్రత్యేక ఆయుర్వేద ఆసుపత్రులు, విజయవాడలోని ఆయుర్వేద బోధనా ఆసుపత్రికి వార్షిక ఉచిత మందుల సరఫరా కోసం నిధులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు.
డిస్పెన్సరీల ఆధునికీకరణకు రూ.46.23 కోట్లు
ఇప్పటికే ఆమోదించిన 150 ఆయుర్వేద డిస్పెన్సరీల్లో మిగిలిన నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు రూ.28.41 కోట్లు, ఆధునిక పరికరాలు, ఫర్నిచర్ సమకూర్చేందుకు రూ.5.02 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని మరో 64 ప్రభుత్వ, పంచాయతీ, ఎయిడెడ్ ఆయుర్వేద డిస్పెన్సరీల ఆధునికీకరణ, భవనాల పునర్నిర్మాణం, పరికరాలు, ఫర్నిచర్, డిజిటల్ నెట్వర్కింగ్ కోసం రూ.12.80 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.
ప్రత్యేక ఆయుర్వేద చికిత్సలకు ప్రాధాన్యం
విజయవాడలోని ఆయుర్వేద బోధనా ఆసుపత్రిలోని శాలాక్య తంత్ర విభాగంలో కంటి వ్యాధుల చికిత్సకు ‘అక్షి తర్పణ’ పైలట్ కార్యక్రమానికి రూ.13.20 లక్షలు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. డాక్టర్ ఎన్ఆర్ఎస్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో మూలికా కషాయ చికిత్స కేంద్రం ఏర్పాటుకు రూ.10.73 లక్షలు కేటాయించినట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పంచకర్మ, కాయచికిత్స సేవలు అందించే ఆయుర్వేద క్లినిక్ నిర్వహణకు రూ.15.79 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 55 ఆయుర్వేద పంచకర్మ ప్రత్యేక ఆరోగ్య కేంద్రాల్లో పంచకర్మ చికిత్సా సిబ్బంది వేతనాలు, యోగా శిక్షకులు, చికిత్సా నూనెల కొనుగోలుకు నిధులు అందుతున్నాయని వివరించారు.
వృద్ధులు, విద్యార్థులు, తల్లీబిడ్డలకు ప్రత్యేక సేవలు
నాడీ, కీళ్ల సంబంధిత వ్యాధులు, వృద్ధాప్య సమస్యల నివారణకు 26 కేంద్రాల్లో ఆయుర్వేద వైద్యులు, సహాయక సిబ్బంది, ప్రచార కార్యక్రమాల కోసం రూ.2.05 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. గిరిజన, ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లోని వృద్ధులకు వైద్య సేవలు అందించే ‘వయో మిత్ర’ కార్యక్రమానికి రూ.62.40 లక్షలు కేటాయించినట్లు చెప్పారు.
పాఠశాల విద్యార్థుల్లో ఆయుర్వేద జీవన విధానం, ఆహార నియమాలపై అవగాహన కల్పించే ‘ఆయుర్ విద్య’ కార్యక్రమం కింద 26 యూనిట్ల పరిధిలోని 8,400 పాఠశాలలకు రూ.6.50 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. గర్భిణులు, నవజాత శిశువుల సంరక్షణకు ‘సుప్రజ’ కార్యక్రమం కింద రూ.8.50 లక్షలు కేటాయించినట్లు వివరించారు.
ఆయుర్వేద విద్యా సంస్థల ఆధునికీకరణ
కాకినాడ ఆయుర్వేద కళాశాల భవన నిర్మాణం, ల్యాండ్‌స్కేపింగ్, ఆపరేషన్ థియేటర్, గ్రంథాలయం, నిపుణుల పరికరాల కోసం రూ.4.10 కోట్లు మంజూరైనట్లు మంత్రి తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని నూతన ఆయుర్వేద కళాశాల భవనాలు, క్లినికల్ విభాగాల నిర్మాణానికి రూ.3.71 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.
విజయవాడలోని డాక్టర్ ఎన్ఆర్ఎస్ ప్రభుత్వ ఆయుర్వేద యూజీ, పీజీ కళాశాల ఆధునికీకరణకు రూ.3 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. నాలుగు ప్రధాన ఆయుర్వేద బోధనా ఆసుపత్రుల్లో మద్యపాన విముక్తి కేంద్రాల నిర్వహణకు రూ.41.47 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు.
క్రీడాకారులకు ఆయుర్వేద వైద్యం
వైఎస్సార్ కడప జిల్లాలోని ఆయుష్ క్రీడా వైద్య నైపుణ్య కేంద్రానికి రూ.70.12 లక్షలు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ఆయుర్వేద పీజీ వైద్యులు, పంచకర్మ చికిత్సా సిబ్బంది, భౌతిక చికిత్స నిపుణుల వేతనాలు, మందులు, ఆధునిక పరికరాల కొనుగోలుకు ఈ నిధులు వినియోగిస్తున్నట్లు వివరించారు.
ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో మౌలిక వసతులు, మందులు, పరికరాలు, ప్రత్యేక చికిత్సా సేవలతో పాటు ఆయుర్వేద వైద్య విద్యకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. “ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం” అనే ఇతివృత్తానికి అనుగుణంగా ఆరోగ్యకరమైన జీవన విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News