బంగాళాఖాతంలో వాయుగుండం: విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోంమంత్రి అనిత సమీక్ష

-భారీ -అతి భారీ వర్షసూచన – ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
-ప్రభావిత జిల్లాల్లో SDRF బృందాలు సిద్ధం
-అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070, 1800 425 0101

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమమధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలోని వాయుగుండం నేపధ్యంలో రాష్ట్ర హోం,విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బంగాళాఖాతంలో నెలకొన్న పరిస్థితులను, వాయుగుండం కదలికలను ఆమె ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. మత్స్యకారులు ఎట్టిపరిస్థితుల్లోనూ వేటకు వెళ్లరాదని, తమ బోట్లు, వలలను సురక్షిత ప్రాంతాల్లో జాగ్రత్త పరుచుకోవాలని కోరారు.

విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వాయుగుండం తీవ్రతను హోంమంత్రికి వివరిస్తూ, ఇది ప్రస్తుతం గోపాల్‌పూర్ (ఒడిశా)కు 180 కిమీ, కళింగపట్నానికి 180 కిమీ, విశాఖపట్నానికి 270 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు. ఈ వాయుగుండం రేపు రాత్రి లేదా ఎల్లుండి తెల్లవారుజాము సమయంలో విశాఖపట్నం – గోపాల్‌పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు.

వాయుగుండం ప్రభావంతో రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి అనిత సూచించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, రానున్న మూడు రోజులు అత్యంత కీలకమైనందున ప్రభావిత జిల్లాల యంత్రాంగం హై అలెర్ట్‌లో ఉండాలని ఆదేశించారు.

ముందస్తు సహాయక చర్యల కోసం ప్రభావిత జిల్లాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్ (SDRF), ఎన్డీఆర్ఎఫ్(NDRF) బృందాలను సిద్ధంగా ఉంచాలని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.

వాయుగుండం తీవ్రతపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక సందేశాలు పంపించాలని, విపత్తుల నిర్వహణ సంస్థ మరియు ఆర్‌టీజీఎస్ (RTGS) అధికారులు నిరంతరం సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101 లను సంప్రదించాలని హోంమంత్రి అనిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

పొంగిపొర్లుతున్న వాగులు, కాజ్‌వేల వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రించాలని ఆదేశించారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు చెట్లు, హోర్డింగ్‌లు, పాతబడిన ఇళ్ల వద్ద ఉండకూడదని హెచ్చరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *