డిసెంబర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నంది అవార్డుల ప్రదానోత్సవం:సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి లేదా విజయవాడ వేదికగా నంది ఫిల్మ్, నేషనల్ అవార్డులు.. తిరుపతిలో టీవీ అవార్డుల ప్రదానం..2025తో పాటు పెండింగ్ అవార్డులు అందించేందుకు ప్రభుత్వం అంగీకారం
-సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంలో తెలుగు సినిమాకు సముచిత గౌరవం..తెర వెనుక శ్రమకు, తెరపై నటనకు పట్టం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు సినీ రంగంలో ప్రత్యేక స్థానం పొందిన నంది అవార్డులను ఈ డిసెంబర్ లో ఇవ్వనున్నట్లు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా కళాకారులకు, సాంకేతిక నిపుణులకు పెద్దపీట వేస్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సముచిత గౌరవం కల్పిస్తూ..సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం మేరకు నంది అవార్డుల వేడుకలు వైభవంగా నిర్వహిస్తామని మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ మేరకు సెప్టెంబర్ లో కమిటీ ఏర్పాటు చేసి అక్టోబర్ లో ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామని, నవంబర్ లో అవార్డులను ప్రకటించి, డిసెంబర్ లో ప్రదానం చేస్తామని స్పష్టం చేశారు.

వివరాల్లోకి వెళ్తే….2025 సంవత్సరానికి అన్ని కేటగిరీల్లో నంది ఫిల్మ్, టీవీ అవార్డులను ఇవ్వాలని, దానితో పాటు 2012 నుండి 2016 వరకు ఇది వరకే ప్రకటించిన 288 ఫిల్మ్ అవార్డ్స్, 330 టీవీ అవార్డ్స్ ఇవ్వనున్నామన్నారు. అదే విధంగా 2017 నుండి 2024 వరకు సంవత్సరానికి 4 అవార్డుల చొప్పున (2 ప్రొడక్షన్, 2 స్పెషల్ జ్యూరీ) ఫిల్మ్ అండ్ టీవీ అవార్డులను ప్రదానం చేయడానికి ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. అమరావతి లేదా విజయవాడ వేదికగా నంది ఫిల్మ్, జాతీయ చలన చిత్ర (నేషనల్ ఫిల్మ్) అవార్డులను, తిరుపతి వేదికగా నంది టీవీ అవార్డులను ఇవ్వాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. ఈ అవార్డులన్నీ కూడా డిసెంబర్ – 2026 లోగా ఇవ్వనున్నామన్నారు.

తెర వెనుక శ్రమించిన ప్రతిభకు, తెరపై రక్తికట్టించిన నటనకు ప్రభుత్వం తరపున సత్కరించేందుకు సన్నద్ధమవుతున్నామన్నారు. ఈ నేపథ్యంలో చలనచిత్రాలు, జాతీయ సమైక్యతపై చలన చిత్రాలు, బాలల చిత్రాలు, డాక్యుమెంటరీ చిత్రాలు, విద్యా విషయక చిత్రాలు, తెలుగు సినిమాపై రచించిన ఉత్తమ రచనలు తదితర 46 అవార్డులను నంది ఫిల్మ్ అవార్డులుగా అందించనున్నామన్నారు. నంది ఫిల్మ్ అవార్డు గ్రహీతలకు బంగారు, వెండి, కాంస్య, తామ్ర నందులు, ప్రశంసాపత్రంతో పాటు నగదు పారితోషికం అందిస్తామన్నారు. అదే విధంగా వివిధ కేటగిరీల్లో 8 గోల్డ్ మెడల్స్ ఇస్తామన్నారు.

జాతీయ చలన చిత్ర అవార్డుల విభాగంలో భాగంగా ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డులు(5 లక్షలు),బి.ఎన్. రెడ్డి నేషనల్ ఫిల్మ్ అవార్డులు(2 లక్షలు),నాగిరెడ్డి అండ్ చక్రపాణి నేషనల్ ఫిల్మ్ అవార్డులు(2 లక్షలు), రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డులు(2 లక్షలు) అందించనున్నామన్నారు. ఈ కేటగిరీలో అవార్డు గ్రహీతలకు జ్ఞాపిక, సన్మాన పత్రంతో పాటు నగదు పారితోషికం అందించబడుతుందన్నారు.

నంది టీవీ అవార్డుల్లో భాగంగా టెలి చిత్రాలు, టి.వీ ఫీచర్స్, టి.వీ మెగా సీరియల్స్, టి.వీ డైలీ సీరియల్స్, టి.వీ బాలల చిత్రాలు, టి.వీ డాక్యుమెంటరీ చిత్రాలు, టి.వీ సామాజిక సంబంధిత చిత్రాలు, టి.వీ విద్యా విషయక చిత్రాలు తదితర విభాగాల్లో మొత్తం 48 అవార్డులను అందించనున్నామన్నారు. నంది టీవీ అవార్డు గ్రహీతలకు బంగారు, వెండి, కాంస్య, తామ్ర నందులు, ప్రశంసాపత్రంతో పాటు నగదు పారితోషికం అందిస్తామని వెల్లడించారు

కూటమి ప్రభుత్వం వచ్చాక సింగిల్ విండో విధానంలో షూటింగ్ కు అనుమతులు త్వరితగతిన మంజూరు చేస్తున్నామని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. త్వరలోనే ఫిల్మ్ పాలసీని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రకృతి సిద్ధమైన లొకేషన్లున్న ఏపీలో అధికంగా షూటింగ్ లు చేయాలని, డబ్బింగ్ థియేటర్లు, రికార్డింగ్ థియేటర్లు, రీరికార్డింగ్ థియేటర్లు తదితర మౌలిక వసతుల కల్పనకు ముందుకు వచ్చేవారికి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని వెల్లడించారు. తెలుగు చలనచిత్ర రంగం కేవలం వినోదాన్ని పంచే మాధ్యమం మాత్రమే కాదు… మన సంస్కృతికి, ఆత్మగౌరవానికి ప్రతిరూపం. కళను, కళాకారులను వెన్నుతట్టి ప్రోత్సహించడమే ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నాం..ఎన్నో అద్భుతమైన చిత్రాలు, దశాబ్దాల పాటు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే నటన, తెర వెనుక శ్రమించిన ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల సేవలను గుర్తించి సత్కరించే కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాం అని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *