అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమమధ్య ,దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 7 కి.మీ వేగంతో పశ్చిమ దిశగా కదులుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది ప్రస్తుతానికి గోపాల్‌పూర్‌కు 150 కి.మీ, కళింగపట్నానికి 140 కి.మీ, ఒడిశాలోని పూరీకి 210 కి.మీ, విశాఖపట్నానికి 220 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని వెల్లడించారు. ఇది రేపు రాత్రికు తీవ్రవాయుగుండంగా ఉత్తర కోస్తా – దక్షిణ ఒడిశా తీర ప్రాంతలైన విశాఖపట్నం-గోపాల్పూర్ మధ్య తీరాలను దాటే అవకాశం ఉందని తెలిపారు.
రేపు, ఎల్లుండి భారీ వర్షాల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్లు , హోర్డింగ్స్ వద్ద నిలబడరాదన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు.
దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి , ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు,బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
మంగళవారం రాత్రి 8 గంటల నాటికి శ్రీకాకుళం జిల్లా పలాసలో 100.7 మిమీ, తాళభద్రలో 98 మిమీ, రావివలసలో 93.6మిమీ, సంతబోమ్మాళిలో 88.1మిమీ, కోటబోమ్మాళిలో 87.5మిమీ, మదనపురంలో 83.6మిమీ, హరిపురంలో 74మిమీ, అల్లూరి జిల్లా గంపరైలో 71.5మిమీ, శ్రీకాకుళం జిల్లా విజయరామపురంలో 71మిమీ, జాలుమూరులో 70.5మిమీ, సైరిగాంలో 70.3మిమీ, నర్సన్నపేటలో 69.2మిమీ, విశాఖ జిల్లా మధురవాడలో 69 మిమీ, నంద్యాల జిల్లా కానాలలో 65.5మిమీ, విశాఖ జిల్లా ఆనందపురంలో65.5మిమీ చొప్పున భారీ వర్షాలు నమోదైనట్లు వివరించారు.
Prajavartha Online Telugu News