న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 40 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న రూబీ ఇయర్ (40వ వార్షికోత్సవ) వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ను ఆహ్వానించారు. ఈ మేరకు విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. పి. చంద్రశేఖర్ మంగళవారం న్యూఢిల్లీలో భారత ఉపరాష్ట్రపతి వ్యక్తిగత కార్యదర్శి అమిత్ ఖరే, ఐఏఎస్ను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా డా. పి. చంద్రశేఖర్ మాట్లాడుతూ, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నాలుగు దశాబ్దాలుగా వైద్య విద్య, ఆరోగ్య సేవలు, పరిశోధన రంగాల్లో విశేష సేవలు అందిస్తూ రాష్ట్రంలో వైద్య విద్యాభివృద్ధికి కీలకంగా పనిచేస్తోందని వివరించారు.
విశ్వవిద్యాలయం 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 2026 అక్టోబర్ 1న విజయవాడలో రూబీ ఇయర్ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు గౌరవ ఉపరాష్ట్రపతిని ఆహ్వానిస్తూ రూపొందించిన ప్రత్యేక ఆహ్వాన పత్రాన్ని అమిత్ ఖరేకు అందజేశారు.
సుమారు నాలుగు దశాబ్దాలుగా విశ్వవిద్యాలయం సాధించిన ప్రగతి, వైద్య విద్యలో తీసుకొచ్చిన మార్పులు, విద్యార్థులు–అధ్యాపకులకు అందిస్తున్న అవకాశాలు, ఆరోగ్య రంగానికి అందిస్తున్న సేవలు, పరిశోధనలో చేపడుతున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా వీసీ వివరించారు.
రూబీ ఇయర్ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు కొనసాగుతున్నాయని డా. పి. చంద్రశేఖర్ తెలిపారు.
Prajavartha Online Telugu News