-ప్రజలకు అందాల్సిన మౌలిక వసతులు, ప్రభుత్వ సేవల్లో జాప్యం ఉండరాదు
-రెండో రోజు పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
-గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై తనిఖీలు
-మురుగు కాల్వలు, రోడ్లు పరిశీలిస్తూ.. ప్రజలతో మమేకమైన ఉప ముఖ్యమంత్రి
-ఉదయం నుంచి నియోజకవర్గంలో క్షేత్ర స్థాయి పర్యటన
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామ గ్రామానా ఆగుతూ.. ప్రజలను పలకరిస్తూ.. వారి సమస్యలు వింటూ.. క్షేత్ర స్థాయిలో పారిశుధ్యాన్ని పరిశీలిస్తూ పిఠాపురం నియోజకవర్గంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటన సాగింది. ఉదయం 6 గంటల నుంచే పవన్ కళ్యాణ్ పర్యటన మొదలైంది. చేబ్రోలు రామాలయ దర్శనం అనంతరం, గొల్లప్రోలులో మురుగు కాల్వలు, పారిశుధ్యాన్ని పరిశీలించారు. ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అందజేసిన అర్జీలను స్వీకరించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి
అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
• సమయానికి సాగునీరు ఇచ్చినందుకు రైతుల కృతజ్ఞతలు
అనంతరం పిఠాపురం, వాకపల్లి మధ్య ఉప ముఖ్యమంత్రి పర్యటించారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో పారిశుధ్యాన్ని పరిశీలించారు. నవఖండ్రవాడ వద్ద పిఠాపురం నియోజకవర్గానికి చెందిన పలువురు రైతులు పవన్ కళ్యాణ్ ని కలిశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లోనూ ఏలేరు కాలువ ద్వారా సకాలంలో సాగునీరు అందించే ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. కృతజ్ఞతగా ధాన్యాన్ని నింపిన గాజు కుండీని ఉప ముఖ్యమంత్రికు బహూకరించారు.
• సమస్యలు చెప్పుకొన్న వలస కూలీలు
నవఖండ్రవాడ సమీపంలోని వాటర్ ట్యాంకు వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో తాత్కాలిక గుడారాల్లో నివాసం ఉంటున్న
చిలకలూరిపేటకు చెందిన వలస కూలీలను పవన్ కళ్యాణ్ పలకరించారు. ఏటా వ్యవసాయ పనులు సాగినన్నాళ్లు పిఠాపురం నియోజకవర్గంలోనే నివాసం ఉంటున్నామని, భారీ వర్షాలు కురిసిన సమయంలో తాత్కాలిక గుడారాల్లోకి నీరు వచ్చి, పిల్లలతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. నియోజకవర్గానికి వచ్చే వలస కూలీల తాత్కాలిక నివాసానికి కమ్యూనిటీ హాళ్లు లాంటివి ఏర్పాటు చేసే అవకాశాలు పరిశీలించాలని అధికారులకు సూచించారు.
నవఖండ్రవాడ, కొండెవరం, వాకపల్లి తదితర గ్రామాల్లో వాహనం నుంచి దిగి పారిశుధ్యం, మురుగునీటి పారుదల వ్యవస్థలను పరిశీలించారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, సాగునీరు తదితర అంశాలపై ప్రజల నుంచి వివరాలు తెలుసుకున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందాల్సిన మౌలిక వసతులు, ప్రభుత్వ సేవల్లో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని సూచించారు.
Prajavartha Online Telugu News