-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ
-ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు
-రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా రియల్ టైమ్‌లో అనుమతులు
-కుప్పం పౌల్ట్రీ రైతులతో ముఖాముఖీలో ముఖ్యమంత్రి చంద్రబాబు
కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త :
కుప్పం నియోజకవర్గంలోని పౌల్ట్రీ రైతులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో వాతావరణ అనుకూల (ఎన్విరానమెంటల్లీ కంట్రోల్డ్) పౌల్ట్రీ షెడ్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి కార్యాచరణ చేపట్టినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కుప్పంలోని పౌల్ట్రీ రైతులతో సీఎం చంద్రబాబు మంగళవారం ముఖాముఖీ అయ్యారు. పౌల్ట్రీ రంగ అభివృద్ధి, రైతులకు అందుతున్న అవకాశాలు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన చర్యలపై ఈ ముఖాముఖిలో చర్చించారు. కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ఎన్విరానమెంటల్లీ కంట్రోల్డ్ పౌల్ట్రీ షెడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. రైతులను కేవలం పౌల్ట్రీ సాగుదారులుగా కాకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా చేయాలన్న లక్ష్యంతో ఐబీ గ్రూప్‌తో కలిసి ఈసీ పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
పౌల్ట్రీ రంగానికి ప్రత్యేక పాలసీ
రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదగాలన్న ఉద్దేశంతో కుప్పంలో పెద్ద ఎత్తున ఈ తరహా పౌల్ట్రీ షెడ్లను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చెప్పారు. ఇందుకు అవసరమైన అన్ని అనుమతులను రియల్ టైమ్‌లో మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పౌల్ట్రీ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు ప్రత్యేకమైన పాలసీని తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. డైరీ, పౌల్ట్రీ, ఉద్యానవనం, సెరీకల్చర్ వంటి రంగాలను ప్రోత్సహిస్తూ రైతులకు మరిన్ని అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ప్రజల్లో ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రొటీన్ అధికంగా ఉండే కోడిమాంసం, గుడ్ల వినియోగం పెరుగుతోందని చంద్రబాబు తెలిపారు. దీంతో పౌల్ట్రీ రంగానికి భవిష్యత్‌లో మరింత డిమాండ్ ఉండే అవకాశం ఉందన్నారు. కుప్పంలో ఉత్పత్తి అయ్యే పౌల్ట్రీ ఉత్పత్తులను వేగంగా ఇతర ప్రాంతాలకు తరలించేలా రోడ్డు, రైలు కనెక్టివిటీని పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. పెరుగుతున్న కనెక్టివిటీతో కుప్పం బెంగళూరుకు శాటిలైట్ టౌన్‌షిప్‌గా మారిపోయిందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న చేయూతను సద్వినియోగం చేసుకుని కుప్పం నియోజకవర్గాన్ని వ్యాపార, పారిశ్రామికవేత్తలకు చిరునామాగా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. పౌల్ట్రీతో పాటు డైరీ, ఉద్యాన, సెరీకల్చర్ రంగాల్లోనూ అవకాశలను అందిపుచ్చుకుని రైతులు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని సూచించారు.
Prajavartha Online Telugu News