-కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద ప్రత్యేక పూజలు
-బీరగానిపల్లె రిజర్వాయర్ శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కుప్పం నియోజకకర్గంలోని చివరి ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు తరలి వచ్చిన హంద్రీనీవా జలాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జలహారతి ఇచ్చారు. కుప్పంలోని శాంతిపురం మండలంలోని హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టులోని కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద ఈ జలాలకు ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేసి పసుపు కుంకుమలు సమర్పించారు. అనంతరం స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలతో కలిసి హంద్రీనీవా జలాలకు పుష్పాలు సమర్పించి హారతి ఇచ్చారు. కుప్పం బ్రాంచ్ కు ఇరువైపులా నిలబడి రైతులు మహిళలు హర్షాతి రేకాలు వ్యక్తం చేశారు. నీవా జలాలకు నీరాజనాలు పలికారు. హంద్రీనీవా జలం కుప్పానికి వరం అంటూ నినాదాలు చేశారు. కుప్పం అభివృద్ధికి నీటి భద్రత కీలకమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అందుకే శ్రీశైలం మల్లన్న పాదాల చెంత నుంచి హంద్రీనీవా పథకం ద్వారా కుప్పానికి తీసుకువచ్చామని అన్నారు. హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా 133 చిన్న నీటి చెరువులు నింపి తాగునీటి కొరత లేకుండా చేశామని స్పష్టం చేశారు. గత ఏడాది 2.4 టీఎంసీల నీటిని విడుదల చేశామని దీని ప్రభావంతో భూగర్భ జలాలు 3 మీటర్ల మేర పెరిగాయని.. ఎండిపోయిన బోర్లు జీవం పోసుకున్నాయని అన్నారు.
నూతన రిజర్వాయర్ల నిర్మాణం
అంతకుముందు బీరగానిపల్లె వద్ద రిజర్వాయర్ నిర్మాణం కోసం చేపట్టాల్సిన పనులకు సంబంధించి సీఎం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ రిజర్వాయర్ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు సీఎం స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలో యామిగానిపల్లి, మదనపల్లి ప్రాంతాల్లో రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కుప్పంలో 550కి పైగా మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు లిఫ్ట్ ఇరిగేషన్ , పైపులైన్లు, గ్రావిటీ కాలువలతో అనుసంధానం చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News