Breaking News

స్త్రీశక్తి పథకం విజయవంతం కావాలంటే 4 వేల కొత్త బస్సులు కొనాలి…

-ఆర్టీసీలో 15 వేల పోస్టులు భర్తీ చేయాలి.. ప్రైవేటు విద్యుత్ బస్సులపై వెనక్కి తగ్గకపోతే ఉద్యమం
-ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకంతో మహిళల్లో ప్రభుత్వానికి మంచి ఆదరణ లభించిందని ఏపీ పీటీడీ (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు అన్నారు. అయితే పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు, సిబ్బందిని పెంచకపోతే ఇదే పథకం ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే 4 వేల కొత్త బస్సులను కొనుగోలు చేయడంతో పాటు ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 15 వేల పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
శుక్రవారం తిరుపతిలోని సీపీఐ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జి.ఆర్. చంద్ర అధ్యక్షతన, జిల్లా కార్యదర్శి వి. మస్తాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా విస్తృతస్థాయి కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ప్రైవేటు విద్యుత్ బస్సులను అంగీకరించం
ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టి ఆర్టీసీని పరోక్షంగా ప్రైవేటీకరించే ప్రయత్నాలను సహించబోమని దామోదరరావు స్పష్టం చేశారు. విద్యుత్ బస్సులను ఆర్టీసీ సంస్థే కొనుగోలు చేసి, సొంత సిబ్బందితో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు ఆపరేటర్ల విధానాన్ని కొనసాగిస్తే ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
గతంలో మూసివేసిన విద్యాధరపురం, గుంటూరు-2, నెల్లూరు-2, మంగళం డిపోలను ఇచ్చిన హామీ మేరకు వెంటనే పునఃప్రారంభించాలని కోరారు. ఉద్యోగ భద్రతకు సంబంధించిన సర్క్యులర్ నంబర్ 01/2019ను కచ్చితంగా అమలు చేయాలని, దాన్ని ఉల్లంఘించే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలం చెల్లిన టిమ్ యంత్రాల స్థానంలో కొత్త యంత్రాలను సరఫరా చేయాలని కోరారు.
ఆర్టీసీ ఉద్యోగులపై దాడులను అరికట్టాలి
రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఆవుల ప్రభాకర్ మాట్లాడుతూ, విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడేవారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర కార్యదర్శి ఏ. మురుగమ్మ మాట్లాడుతూ, స్త్రీశక్తి పథకం అమలుతో డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్ సిబ్బందిపై పని భారం గణనీయంగా పెరిగిందన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు, సిబ్బందిని పెంచి ఉద్యోగులపై పని ఒత్తిడిని తగ్గించాలని కోరారు.
కడప జోన్ అధ్యక్షుడు పి.ఎస్. ఖాన్, కార్యదర్శి ఎన్. రాజశేఖర్ మాట్లాడుతూ, డిసెంబర్‌లో జరగనున్న సీసీఎస్ ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర సహాయ కార్యదర్శి పి.ఎస్. కుమార్ మాట్లాడుతూ, ఏపీజేఏసీ అమరావతి పోరాటాల ఫలితంగా ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారంలో పురోగతి సాధ్యమైందన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు 500 మంది ఉద్యోగుల పదోన్నతులు పెండింగ్‌లో ఉన్నాయని, ఫ్రీజింగ్ సడలించే వరకు అర్హులకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించాలని కోరారు.
ఆర్టీసీ ఈయూ తిరుపతి జిల్లా గౌరవాధ్యక్షుడిగా శంకర్ రెడ్డి
ఎంప్లాయీస్ యూనియన్ తిరుపతి జిల్లా కౌన్సిల్ సమావేశంలో సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కూరపాటి శంకర్ రెడ్డిని యూనియన్ తిరుపతి జిల్లా గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు, ఉప ప్రధాన కార్యదర్శి ఆవుల ప్రభాకర్ సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది.
ఈ సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. రవికుమార్, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సి. మధు, జోనల్ కమిటీ సభ్యులు బి. మల్లికార్జున, పి. మనోహర్, కె. సుజాత, జి. రమేష్, తిరుపతి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డి.ఎన్. వర్మ, జిల్లా నాయకులు ఎన్. సుబ్రమణ్యం, జె. సతీష్‌తో పాటు పది డిపోల అధ్యక్ష, కార్యదర్శులు, గ్యారేజ్ నాయకులు, ఏపీజేఏసీ అమరావతి ప్రతినిధులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

హజ్–2027 యాత్రికుల ఎంబార్కేషన్ పాయింట్ల మార్పు కోసం వినతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: హజ్–2027 యాత్రకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 11 మంది యాత్రికులు తమ ప్రయాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *