-కొండపై వీణాపాణియై శ్రీ సరస్వతీ దేవిగా చదువుల తల్లి అలంకారం – ప్రదోషవేళ కనులపండువగా ఆదిదంపతుల పల్లకీయాత్ర
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త:
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అత్యంత వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో ఆరవ రోజు, అమ్మవారి జన్మనక్షత్రమైన పరమ పవిత్ర మూలా నక్షత్రం పర్వదినాన శుక్రవారం సాయంత్రం ఆదిదంపతులైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దివ్య నగరోత్సవం భక్తుల జయజయధ్వానాల నడుమ ఆధ్యాత్మిక శోభతో అత్యంత వైభవోపేతంగా జరిగింది.
ఇంద్రకీలాద్రి శిఖరాన జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్వేతాంబరియై, వీణాపాణిగా సాక్షాత్తు జ్ఞానప్రదాయిని శ్రీ సరస్వతీ దేవి దివ్యాలంకారంలో భక్తులకు కరుణామృత దృష్టితో దర్శనమిస్తుండగా, పరమ పవిత్రమైన ప్రదోషకాల సమయంలో కొండపై కొలువుదీరిన శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉత్సవ మూర్తులకు ప్రధాన అర్చకులు శాస్త్రోక్తంగా విశేష పూజలు, దివ్య మంగళ హారతులు నిర్వహించారు. అనంతరం మంగళవాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ నగరోత్సవం అత్యంత కోలాహలంగా ప్రారంభమైంది.
నగరోత్సవ రథం ముందుకు కదులుతుండగా సుమధుర శాక్సోఫోన్ వాయిద్యాలు, సంప్రదాయ కేరళ పంచవాద్యాల దరువులు, గుస్సాడీ కళావిన్యాసాలు మరియు మహిళా భక్తుల లయాన్విత కోలాటాలు వీధుల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని ప్రతిధ్వనింపజేశాయి.
శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రారంభమైన ఊరేగింపు రథం సెంటర్, వన్ టౌన్ వినాయక గుడి, కెనాల్ రోడ్డు, పవిత్ర కృష్ణా నదీ తీరాన ఉన్న దుర్గా ఘాట్ మీదుగా ఘాట్ రోడ్డు ద్వారా సాగింది. వేలాది మంది భక్తులు పాదయాత్రగా నగరోత్సవం వెంట నడుస్తూ “జై భవానీ.. జై జై భవానీ”, “ఓం శ్రీ మాత్రే నమః” అంటూ చేసిన జయజయధ్వానాలతో ఇంద్రకీలాద్రి పరిసరాలు మార్మోగాయి.
సర్వాంగసుందరంగా విద్యుద్దీపాలు, సుగంధ పుష్పాలతో ముస్తాబు చేసిన రథంపై కొలువుదీరిన ఆదిదంపతులను దర్శించుకునేందుకు పురవీధుల్లో భక్తజనం బారులు తీరారు. మార్గమధ్యంలో భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ, కొబ్బరికాయలు కొడుతూ స్వామి, అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో ఘన నీరాజనాలు పలికారు.
నగరోత్సవం ఘనంగా కొండపైకి చేరుకున్న అనంతరం ఆలయ మహారాజగోపురం ఎదుట సంప్రదాయబద్ధంగా “ఆస్థాన కార్యక్రమం” నిర్వహించారు. ఆలయ స్థానాచార్యుల ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చక బృందం ఉత్సవ మూర్తులకు వేదోక్తంగా శాస్త్రోక్త పూజలు, పంచహారతులు సమర్పించారు.
చదువుల తల్లి, జ్ఞానస్వరూపిణి అయిన సరస్వతీ దేవి అలంకారంలో కొలువుదీరిన మూలా నక్షత్ర పర్వదినాన ఆదిదంపతులను రథారూఢులుగా దర్శించుకోవడం వల్ల అజ్ఞానం, జడత్వం తొలగి జ్ఞానసంపద, విద్యాబుద్ధులు, కుటుంబ క్షేమం చేకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఈ మహోత్సవంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, స్థానాచార్యులు, ప్రధాన అర్చకులు, సహాయ కార్యనిర్వహణాధికారి,ఆలయ ఉద్యోగులు, అశేష భక్తజనం పాల్గొని ఆదిదంపతుల కృపాకటాక్షాలను పొందారు.
Prajavartha Online Telugu News