Breaking News

ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో రోగుల భద్రత కమిటీల ఏర్పాటు

-కేంద్ర మార్గదర్శకాల మేరకు 11 కీలక అంశాలపై క‌మిటీల‌ పర్యవేక్షణ
-చికిత్సలో పొరపాట్ల నివారణ, వైద్య సేవల నాణ్యత పెంపునకు చర్యలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో రోగుల భద్రతకు ప్రత్యేక కమిటీలు ఏర్ప‌డ్డాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శకాల మేరకు రోగుల భద్రతకు ప్రత్యేక అధికారులను నియమించడంతోపాటు, 11 కీలక అంశాలపై పర్యవేక్షణ కోసం కమిటీలను ఏర్పాటు చేశారు. డీఎంఈ డాక్ట‌ర్ విష్ణువ‌ర్ద‌న్ ఆదేశాల మేర‌కు వీటి ఏర్పాటు రాష్ట్రంలోని అన్ని బోధనాసుప‌త్రుల్లో జ‌రిగింది.

రోగుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం
ఆసుపత్రుల్లో చికిత్స పొందే రోగులకు సురక్షితమైన వైద్య సేవలు అందించడం, చికిత్స సమయంలో పొరపాట్లు, నివారించదగిన ప్రమాదాలను తగ్గించడం రోగుల భద్రతలో కీలకం. మందుల వినియోగం, శస్త్రచికిత్సలు, రక్త మార్పిడి, వైద్య పరికరాల వినియోగం, ప్రయోగశాల పరీక్షలు, ఆసుపత్రుల్లో ఇన్‌ఫెక్షన్ల నియంత్రణ వంటి అంశాల్లో భద్రతా ప్రమాణాలు పాటించేలా ప్రత్యేక పర్యవేక్షణ అవసరం. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, సంబంధిత విభాగాల మధ్య సమన్వయాన్ని పెంచి, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఈ కమిటీలు దోహదపడతాయి. మొత్తం 11 అంశాల‌ను క‌మిటీ ప‌ర్య‌వేక్షిస్తుంది. ప్రతి అంశానికి సంబంధిత వైద్య ప్రత్యేక విభాగం నుంచి ఒక అధ్యాపకుడిని ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించారు.

మార్గదర్శకాల అమలుకు ఆదేశాలు
కమిటీల ఏర్పాటు, వాటి పనితీరుపై సంబంధిత బోధనాసుపత్రుల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని వైద్య విద్యా సంచాలకులు డాక్ట‌ర్ విష్ణువ‌ర్ద‌న్ పేర్కొన్నారు. రోగుల భద్రతకు సంబంధించిన మార్గదర్శకాలను సమర్థంగా అమలు చేస్తూ, ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

క‌మిటీల స్వ‌రూపం

రాష్ట్రంలోని అన్ని బోధ‌నాసుప‌త్రుల్లో ఈ క‌మిటీలు ఏర్ప‌డ్డాయి. వీటిల్లో ముఖ్య‌మైన స్పెషాలిటీ వైద్యులంద‌రూ స‌భ్యులుగా ఉన్నారు. ఈ క్రమంలో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మందుల భద్రతకు డాక్టర్ శరణ్ సోనియా, శస్త్రచికిత్సల భద్రతకు డాక్టర్ ఏ. నవీన్ కుమార్, రక్త మార్పిడి భద్రతకు డాక్టర్ వి. శివశంకర్ నాయక్, వైద్య పరికరాల భద్రతకు డాక్టర్ పి. మధు, ప్రయోగశాలల భద్రతకు డాక్టర్ శాంతి రెడ్డిని నియమించారు. ఇన్‌ఫెక్షన్ల నియంత్రణకు డాక్టర్ రామస్వామి నాయక్, వైద్య పరిశోధనకు డాక్టర్ ఎస్. ఉమా మహేశ్వరరావు, రోగులు-కుటుంబ సభ్యుల భాగస్వామ్యానికి డాక్టర్ వి. కిషోర్ కుమార్, టీకాల భద్రతకు డాక్టర్ ఎం. రవి కుమార్, ఆసుపత్రి సౌకర్యాల భద్రతకు డాక్టర్ ఎల్. బ్రహ్మానందం, ఆయుష్ సేవలకు డాక్టర్ జి. నారాయణ స్వామిని ఎంపిక చేశారు.
ఇలాగే మిగిలిన ప్ర‌భుత్వ బోధ‌నాసుప‌త్రుల్లో క‌మిటీలు సీనియ‌ర్ వైద్యులు స‌భ్యులుగా ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

హజ్–2027 యాత్రికుల ఎంబార్కేషన్ పాయింట్ల మార్పు కోసం వినతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: హజ్–2027 యాత్రకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 11 మంది యాత్రికులు తమ ప్రయాణ …