Breaking News

ప్రమాద బాధితులకు సత్వర చికిత్స.. ప్రాణరక్షణే లక్ష్యం

-గోల్డెన్‌ అవర్‌లో విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కొత్త విధానం
-ప్రభుత్వ ఆసుపత్రుల్లో ‘ప్రీ-హాస్పిటల్‌ నోటిఫికేషన్‌’ ప్రారంభం
-రాష్ట్ర ట్రామా రిజిస్ట్రీని అందుబాటులోకి తెచ్చిన వైద్య విద్యా సంచాలకుల కార్యాలయం
-బాధితుడు ఆసుపత్రికి చేరకముందే సిద్ధం కానున్న అత్యవసర వైద్య బృందాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రమాద బాధితులకు సత్వర వైద్య సేవలు అందించేందుకు వైద్య విద్యా సంచాలకుల కార్యాలయం (డీఎంఈ) రెండు కీలక కార్యక్రమాలను ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా ‘ప్రీ-హాస్పిటల్‌ నోటిఫికేషన్‌’ (పీహెచ్‌ఎన్‌) విధానంతో పాటు రాష్ట్ర ట్రామా రిజిస్ట్రీని అందుబాటులోకి తెస్తోంది. ఈ మేరకు అదనపు వైద్య విద్యా సంచాలకులు డాక్టర్‌ సత్యనారాయణ మూర్తి, ట్రామా, బర్న్స్‌ రాష్ట్ర నోడల్‌ అధికారి డాక్టర్‌ సుమితా శంకర్‌ శనివారం ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు.

ఆసుపత్రికి చేరకముందే వైద్య బృందాలకు సమాచారం

ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకువచ్చే సమయంలో విలువైన సమయం వృథా కాకుండా ముందస్తు సమాచార విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇకపై 108 అంబులెన్స్‌ సిబ్బంది బాధితుడు ఆసుపత్రికి చేరకముందే సంబంధిత ఆసుపత్రికి సమాచారం అందిస్తారు. దీంతో బాధితుడు అక్కడికి చేరుకునే సమయానికే అత్యవసర వైద్య బృందం, బ్లడ్, ఎక్స్‌రే, స్కానింగ్‌ సదుపాయాలు, శస్త్రచికిత్స గది సిద్ధంగా ఉండేందుకు వీలవుతుంది

గోల్డెన్‌ అవర్‌.. ప్రాణాలు కాపాడే కీలక సమయం

ప్రమాదం జరిగిన మొదటి గంటను ‘గోల్డెన్‌ అవర్‌’గా పరిగణిస్తారు. ఈ సమయంలో బాధితుడికి సకాలంలో చికిత్స అందించడం ప్రాణాలు కాపాడటంలో కీలకమని అధికారులు తెలిపారు. కొత్తగా ప్రవేశపెడుతున్న పీహెచ్‌ఎన్‌ విధానం ద్వారా ఆసుపత్రి సిబ్బంది ముందుగానే అప్రమత్తమై, అవసరమైన వైద్య ఏర్పాట్లు చేసుకునేందుకు అవకాశం కలుగుతుంది. తద్వారా బాధితుడు ఆసుపత్రికి చేరిన వెంటనే చికిత్స ప్రారంభించేందుకు వీలవుతుంది.

ప్రమాదాల నివారణకు రాష్ట్ర ట్రామా రిజిస్ట్రీ

సుప్రీంకోర్టు ఆదేశాలు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ట్రామా రిజిస్ట్రీని ప్రారంభించారు. ప్రభుత్వ వైద్య సంస్థలకు వచ్చే ప్రతి ప్రమాద బాధితుడి వివరాలను ఇందులో డిజిటల్‌ విధానంలో నమోదు చేస్తారు. ఈ సమాచారం ఆధారంగా రాష్ట్రంలో తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించేందుకు వీలవుతుంది.
గుర్తించిన ప్రాంతాల్లో రహదారి భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు, అవసరమైన చోట అత్యవసర వైద్య సదుపాయాలను సమకూర్చేందుకు ఈ వివరాలు ఉపయోగపడతాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో అత్యవసర, ప్రమాద, ట్రామా సేవలను మరింత క్రమబద్ధంగా నిర్వహించేందుకు ఈ రిజిస్ట్రీ దోహదపడుతుంది.

వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ

కొత్త విధానాలను సమర్థంగా అమలు చేసేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న 108 అత్యవసర వైద్య సాంకేతిక నిపుణులు (ఈఎంటీలు), ట్రయాజ్‌ నర్సులకు డీఎంఈ కార్యాలయం ప్రత్యేక శిక్షణ అందిస్తోంది. ప్రతి ఆసుపత్రిలో ట్రయాజ్‌ నర్సుతో పాటు ఒక నర్సు సమన్వయకర్తను గుర్తించి, ఆసుపత్రి నోడల్‌ అధికారి పర్యవేక్షణలో బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 45 నిమిషాల ప్రాథమిక శిక్షణ ప్రారంభించారు. రానున్న రోజుల్లో తదుపరి శిక్షణ కార్యక్రమాల ద్వారా సిబ్బందికి అవసరమైన అవగాహనను మరింత పెంచనున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే 108కు ఫోన్‌ చేయాలి

రహదారి లేదా ఇతర ప్రమాదాలు జరిగిన వెంటనే ఆలస్యం చేయకుండా 108 నంబరుకు ఫోన్‌ చేయాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంబులెన్స్‌, సహాయక బృందాలు వచ్చే వరకు బాధితుడి వద్దే ఉండి, అతడికి మానసిక ధైర్యాన్ని అందించాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

హజ్–2027 యాత్రికుల ఎంబార్కేషన్ పాయింట్ల మార్పు కోసం వినతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: హజ్–2027 యాత్రకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 11 మంది యాత్రికులు తమ ప్రయాణ …