విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
హజ్–2027 యాత్రకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 11 మంది యాత్రికులు తమ ప్రయాణ సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఎంబార్కేషన్ పాయింట్ల మార్పు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ బాషా కి, అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎల్. అబ్దుల్ ఖాదిర్ కి వినతులు సమర్పించారు.
యాత్రికుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న హాజీ షేక్ హసన్ బాషా గారు స్వయంగా చొరవ తీసుకుని, హజ్ కమిటీ ఆఫ్ ఇండియా, ముంబై అధికారుల CEO షానవాస్ సి. (IAS) మరియు డిప్యూటీ CEO (ఆపరేషన్స్) మహమ్మద్ నియాజ్ అహ్మద్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి, ఎంబార్కేషన్ పాయింట్ల మార్పునకు తగిన అనుమతులు మంజూరు చేయాలని కోరారు.
యాత్రికుల అభ్యర్థన మేరకు, గతంలో హైదరాబాద్ను ఎంచుకున్న కొందరు యాత్రికులు విజయవాడకు, విజయవాడను ఎంచుకున్న మరికొందరు హైదరాబాద్కు తమ ఎంబార్కేషన్ పాయింట్లను మార్చుకోవాలని కోరారు. అదేవిధంగా, చెన్నై నుంచి విజయవాడకు, విజయవాడ నుంచి బెంగళూరుకు మార్పు కోరిన యాత్రికుల అభ్యర్థనలను కూడా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
యాత్రికుల ప్రయాణ సౌకర్యాలు, వ్యక్తిగత అవసరాలను దృష్టిలో ఉంచుకుని, వారి అభ్యర్థనలను పరిశీలించి తగిన అనుమతులు మంజూరు చేయాలని హజ్ కమిటీ ఆఫ్ ఇండియాను కోరారు.
అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హజ్–2027 యాత్రకు వెళ్లే యాత్రికులకు పవిత్ర నగరాలైన మక్కా, మదీనాలో మెరుగైన వసతి, భోజనం, రవాణా మరియు ఇతర అవసరమైన సౌకర్యాలు సముచితంగా కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ బాషా హజ్ కమిటీ ఆఫ్ ఇండియా అధికారులను కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హజ్ యాత్రికుల సౌకర్యాలు, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, యాత్రికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా, రాష్ట్ర హజ్ కమిటీ కార్యక్రమాలకు సహకారం అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ కి హాజీ షేక్ హసన్ బాషా కృతజ్ఞతలు తెలిపారు.
Prajavartha Online Telugu News