విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రసూతి మరియు చిన్న పిల్లల వార్డులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పాత ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారులను సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్. ప్రవీణ్ చంద్ ఆదేశించారు. స్థానిక పాత ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రసూతి, చిన్నపిల్లల వార్డు, అత్యవసర వైద్య సేవల విభాగాలను ఆదివారం సబ్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, అక్కడ రోగులను వారికి అందుతున్న వైద్య సేవలను గురించి సబ్ కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదప్రజల ఆరోగ్య భద్రతకు ఇస్తున్న ప్రాధాన్యం, కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్న కృషికి ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలు తీసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకి . పెరుగుతున్నదన్నారు. అంతేకాక ప్రభుత్వ ఆసుపత్రులలో సూపర్ స్పెషలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని, ఇటీవల హృద్రోగ శస్త్ర చికిత్సలు కూడా ఆసుపత్రి వైద్యులు దిగ్విజయంగా నిర్వహించారన్నారు. దీని కారణంగా ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం చేయించుకునేందుకు మొగ్గు చూపుతున్నారన్నారు. రోగుల సంఖ్యకు అనుగుణంగా మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందన్నారు. ఇటీవల రాష్ట్రంలో ప్రసూతి, చిన్న పిల్లల వార్డుల్లో చంటిపిల్లల దొంగతనాలు జరుగుతున్న దృష్ట్యా సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయా వార్డులో భద్రతకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని వైద్యాధికారులను సబ్ కలెక్టర్ ఆదేశించారు. అధికారులతో కలిసి సబ్ కలెక్టర్ పరిశీలించారు. జీజీహెచ్ లో అందుబాటులో ఉన్న ఔషదాలు, సర్జికల్స్, మెడికల్ ఎక్విప్మెంట్ గురించి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు.
సబ్ కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News