-61వ డివిజన్ లో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలందరికీ రూ. 2.15 లక్షలకే ఇల్లు నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 61 వ డివిజన్ – 256 వ వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శనివారం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి, పార్టీ శ్రేణులతో కలిసి దాదాపు 820 ఇళ్లను శాసనసభ్యులు సందర్శించారు. తొలుత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్వయంగా తమ ఇంటికి వచ్చి చిరునవ్వుతో పలకరిస్తుండటంతో ప్రజల నుంచి మంచి స్పందన వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా ప్రతీ గడపకు వెళ్లి రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న జనరంజక పాలన గురించి ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు. చేసిన వాగ్ధానాలలో 95 శాతానికిపైగా అమలు చేశామని.. కనుకనే నిజాయితీ, నిబద్ధతతో ప్రజల ముందుకు వస్తున్నామన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంతగా సహాయం అందించిన ప్రభుత్వం మరొకటి లేదన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. వారి నుండి సలహాలు, అర్జీలు స్వీకరించారు. ఇంకా ఎవరికైనా సంక్షేమ పథకాలు అందకపోతే అడిగి తెలుసుకుని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రతి ఒక్క పథకం చరిత్రలో నిలిచిపోయేలా పాలన
జగనన్న పాలనలో నియోజకవర్గంలోని 96 సచివాలయాల పరిధిలోని ప్రతిఒక్క లబ్ధిదారునికి అందించిన సంక్షేమంపై పూర్తి వివరాలు ప్రజల ముందు ఉంచుతున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 256 వ సచివాలయ పరిధిలో ఇప్పటివరకు రూ. 3.60 కోట్ల సంక్షేమాన్ని పేద ప్రజలకు అందించినట్లు వివరించారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా 327 మందికి ప్రతినెలా రూ. 9.74 లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడి ద్వారా 442 మందికి రూ. 66.30 లక్షలు., విద్యాదీవెన ద్వారా 74 మందికి రూ. 20 లక్షలు., చేయూత ద్వారా 138 మందికి రూ. 25.87 లక్షలు., వాహనమిత్ర ద్వారా 44 మందికి రూ. 2.60 లక్షలు., కాపు నేస్తం ద్వారా 25 మందికి రూ. 3.75 లక్షలు., ఈబీసీ నేస్తం ద్వారా 17 మందికి రూ.2.50 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు వివరించారు. ఈ మొత్తం సాయాన్ని నేరుగా నగదు బదిలీ ద్వారా లబ్ధిదారుల ఖాతాలలో జమ చేసినట్లు తెలియజేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా పేద ప్రజల నుంచి వస్తున్న అభ్యర్థనల మేరకు రూ. 2.15 లక్షలకే అన్ని వసతులతో ఇల్లు నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మల్లాది విష్ణు వెల్లడించారు. ఇందులో ప్రభుత్వం నుంచి రూ. 1.80 లక్షలను, మిగతా రూ. 35 వేలు బ్యాంకుల నుంచి రుణంగా మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగ పరచుకునేలా సచివాలయ సిబ్బంది, డ్వాక్రా ఆర్.పి.లు విస్తృత స్థాయి అవగాహన కల్పించాలని సూచించారు. తన పాలనలో ఏ ఒక్క పేదవాడు ఇంటి అద్దెలతో ఇబ్బందులు పడకూడదని.. కుల, మత, ప్రాంతాలకతీతంగా 30 లక్షల మంది పేదలకు పారదర్శకంగా ఇళ్లను మంజూరు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఒక్క సెంట్రల్ నియోజకవర్గంలోనే రూ. 300 కోట్ల నిధులతో 28 వేల మందికి ఒక్కొక్కరికి దాదాపు రూ. 6 లక్షల విలువ చేసే పట్టాను మంజూరు చేసినట్లు తెలిపారు. మరోవైపు మూడు సార్లు తన హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచిన చంద్రబాబు.. ఈ ప్రభుత్వంలో ఒక్క సారి స్వల్పంగా పెంచితే గగ్గోలు పెడుతున్నారని దుయ్యబట్టారు. 100 యూనిట్లు లోపు విద్యుత్ వినియోగదారులకు ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే అతి తక్కువ టారీఫ్ ఉన్నట్లు వెల్లడించారు. అధికారం కోల్పోయే సమయానికి కాంట్రాక్టర్లకు రూ. వేల కోట్ల బకాయిలు పెట్టిన చంద్రబాబు.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఒక్క విద్యుత్ వ్యవస్థలోనే చంద్రబాబు రూ. 22 వేల కోట్ల బకాయిలు పెట్టి వెళ్లారని గుర్తు చేశారు. కనుక విజ్ఞులైన ప్రజలు గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి మధ్య తేడాను గమనించాలన్నారు. అనంతరం వంగవీటి మోహనరంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో ఈఈ (ఇంజనీరింగ్) శ్రీనివాస్, జోనల్ కమిషనర్ రాజు, డీఈ(ఇంజనీరింగ్) గురునాథం, ఏఈ(ఇంజనీరింగ్) అరుణ్ కుమార్, ఏఈ (ఎలక్ట్రికల్) కృష్ణారెడ్డి, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, నాయకులు ఉమ్మడి వెంకట్రావు, బెవర నారాయణ, గుండె సుందర్ పాల్, మోదుగుల గణేష్, భోగాది మురళి, ఇసరపు రాజారమేష్, ఆర్.ఎస్.నాయుడు, నాళం బాబు, వియ్యపు రాజా, నాగరాజు, యక్కల మల్లిఖార్జునరావు, పార్టీ శ్రేణులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News