-24వ డివిజన్ 88 వ వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
-జోరువానలోనూ ప్రజా సమస్యల పరిష్కార దిశగా సాగిన పర్యటన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ పాత్ర అమోఘమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 24 వ డివిజన్ – 88 వ వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సోమవారం ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగింది. స్థానిక వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ కుక్కల అనిత, పార్టీ శ్రేణులతో కలిసి ఇస్మాయిల్ వీధి, ఢిల్లీ కోటమ్మవీధి, బొడ్డు సుందరమ్మ వీధి, కంభంపాటి మోజస్ వీధి, ఇందుపల్లి జయరాజ్ వీధి, కొడాలి ఇస్రాయిల్ వీధి, జిల్లా రాములు వీధి, చిలకా ప్రసాద్ వీధి, ముంగరాల మోషయ్య వీధులలో ఎమ్మెల్యే పర్యటించారు. దాదాపు 415 గడపలను సందర్శించారు. ప్రజలకు అందించిన సంక్షేమంపై ఆరా తీస్తున్నప్పుడు వారి నుంచి వస్తున్న అపూర్వ స్పందన వెలకట్టలేమన్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలు విషయంలో వాలంటీర్లు అండగా నిలుస్తున్నారని లబ్ధిదారులు చెప్పడం ఆనందంగా ఉందన్నారు. డివిజన్ లో గత ఏడాది కాలంలో రూ. కోటి 34 లక్షల 55 వేల సంక్షేమాన్ని అందించామంటే కేవలం వాలంటీర్ల వ్యవస్థ ద్వారానే సాధ్యపడిందన్నారు. మరోవైపు గిరిపురంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయవలసిందిగా ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అలాగే గిరిపురం, కస్తూరిభాయిపేటలలో పేదల ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
వార్డు సచివాలయం సందర్శన
సచివాలయ సిబ్బంది ఖచ్చితంగా టూర్ డైరీ ఫాలో అవ్వాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 88 వ వార్డు సచివాలయాన్ని స్థానిక కార్పొరేటర్ కుక్కల అనితతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సచివాలయ కార్యదర్శుల హాజరుపట్టి, రికార్డులు, ప్రజల అర్జీలను పరిశీలించారు. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఆరా తీశారు. సంక్షేమ క్యాలెండర్ పై లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ వారిని చైతన్యపరచడమే సచివాలయ సిబ్బంది ప్రథమ కర్తవ్యమని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల అమలు శాచ్యురేషన్ పద్ధతిలో జరగాలని సూచించారు. ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా సచివాలయ సిబ్బంది కారణంగా ఇబ్బందులకు గురికాకూడదన్నారు. ముఖ్యంగా శానిటరీ సెక్రటరీలు క్షేత్రస్థాయి పరిశీలనలకు సంబంధించిన వివరాలతో పాటుగా.. ప్రజాభిప్రాయాలను కూడా డైరీలో పొందుపరచాలని ఆదేశించారు. ప్రజల వద్దకే సంక్షేమ పథకాలను అందించాలనే గొప్ప లక్ష్యంతో ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ప్రతిష్టను ఇనుమడింపజేసేలా పనిచేయాలని సిబ్బందికి సూచించారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. పేదరిక నిర్మూలనే ప్రధాన అజెండాగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. గత తెలుగుదేశం హయాంలో సెంట్రల్ లో 16 వేలు మాత్రమే ఉన్న పింఛన్లను.. శాచ్యురేషన్ పద్ధతిలో 25 వేల మందికి పెంచిన ఘనత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గతంలో సంక్షేమ పథకాలు అందాలంటే అప్లికేషన్లు పట్టుకుని కాళ్లరిగేలా కార్యాలయాలు, నాయకుల చుట్టూ తిరిగే దుస్థితి ఉండేదని.. కానీ గడప దాటకుండా పథకాలు ఇంటింటికి అందిస్తున్న ఘనత వాలంటీర్ల వ్యవస్థదని పేర్కొన్నారు. ఒక్క రోజులోనే నూటికి నూరు శాతం పింఛన్ల పంపిణీ జరుగుతుందంటే.. అది కేవలం వాలంటీర్ల వ్యవస్థతోనే సాధ్యమైందన్నారు. ముఖ్యమంత్రి మార్గదర్శకంలో వాలంటీర్ వ్యవస్థ దేశంలోనే గొప్ప వ్యవస్థగా రూపుదిద్దుకుందన్నారు. గుడ్ గవర్నెన్స్ కు కేంద్ర బిందువుగా మారిందన్నారు. కనుకనే దేశంలోని అనేక రాష్ట్రాల అధికారులు మన రాష్ట్రంలో పర్యటించి.. వాలంటీర్ల వ్యవస్థపై అధ్యయనం చేస్తున్నారన్నారు. కరోనా సమయంలో వాలంటీర్ల వ్యవస్థ అందించిన సేవలను సాక్షాత్తూ ప్రధానమంత్రి కొనియాడారని గుర్తుచేశారు. కానీ రాష్ట్రంలోని ప్రతిపక్షాలు మాత్రం బురదజల్లే కార్యక్రమాలు చేస్తుండటం బాధాకరమన్నారు. మరోవైపు గడప గడపకు కార్యక్రమంలో ప్రభుత్వం దృష్టికి వచ్చే పలు సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రతి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ. 2 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమంపై సోషల్ మీడియాలో ప్రతిపక్ష నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలను ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. వ్యక్తులను, వ్యవస్థలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని.. చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రాజు, ఏఈ రామకృష్ణ, నాయకులు కుక్కల రమేష్, బొంగరాల భాస్కర్, బద్దేటి ఇస్సాక్, కొమ్ము చంటి, రామిరెడ్డి, ఐ.టి.ప్రసాద్, కె.సతీష్, క్రాంతి, సులోచనరావు, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News