-స్పందనకు ప్రజలనుంచి విశేష స్పందన
-ఈరోజు స్పందనలో 890 ఫిర్యాదులు అందాయి..
-ప్రతి ఫిర్యాదు పై తీసుకున్న చర్య పై సమీక్ష నిర్వహిస్తాం..
– కలెక్టర్ డా. కే.మాధవీలత
రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
పరిపాలన వికేంద్రీకరణ లో భాగంగా ఏర్పాటైన నూతన జిల్లాల యంత్రాంగం ప్రజలతో మమేకమైయ్యే దిశలో ఈరోజు రాజానగరం నియోజకవర్గ స్థాయి లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం రాజానగరంలో మాధవి ప్రైవేటు ఫంక్షన్ హాల్లో శాసన సభ్యులు జక్కంపూడి రాజా , జాయింట్ కలెక్టర్ సిహెచ్ . శ్రీధర్,జిల్లా అధికారులతో కలిసి స్పందన అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ డా. కె. మాధవీలత మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి (సచివాలయం) వరకు స్పందన కార్యక్రమం ద్వారా ఫిర్యాదులను స్వీకరించడం జరుగుతోందన్నారు. నూతన జిల్లాలు ఏర్పడడంతో జిల్లా యంత్రాంగం ప్రజలకు మరింత చేరువ కావడానికి నియోజకవర్గాల వారి స్పందన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం కోసం మండల, సచివాలయ పరిధిలోనే అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటున్నా రన్నారు. సమస్య పరిష్కారం కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా ఒక వారం జిల్లా కలెక్టరేట్ నందు, తదుపరి వారం నియోజకవర్గ పరిధిలో ప్రజల నుంచి అభ్యర్థనలు స్వీకరిస్తున్నా మన్నారు. ఫిర్యాదుల స్థాయిపై నిరంతర పర్యవేక్షణ వలన వెంటనే పరిష్కారం చూపడానికి క్షేత్ర స్థాయిలో స్పందన ద్వారా మంచి ఫలితాలు వస్తాయని మాధవీలత తెలిపారు. ఈ రోజు ప్రజల నుంచి 890 అర్జీలను స్వీకరించామని కలెక్టర్ పేర్కొన్నారు.
శాసనసభ్యులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి , అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సమస్య ఎక్కడ ఉంటే అక్కడ కి వెళ్లి పరిష్కారం చూపాలని గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ లు తీసుకుని వచ్చారన్నారు. ప్రజా సమస్య పరిష్కార వేదికగా ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో స్పందన ను ఏర్పాటు చేసి , ఆయా సమస్యల పరిష్కారం కోసం కాల పరిమితిని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
జిల్లా యంత్రాంగం వివిధ శాఖల అధికారులు ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం నియోజకవర్గస్థాయిలో సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం అనేది గొప్ప విజయానికి సంకేతమని జక్కంపూడిరాజా అన్నారు. క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకుని వాటి పరిష్కారానికి అర్హతే ప్రామాణికంగా కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమపథకాలు అందించాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన లక్ష్యమని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ మాధవీలత అప్పటినుండి ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు నియోజకవర్గాల్లో స్పందన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ప్రజలకు జిల్లా యంత్రాంగాన్ని అందుబాటులో ఉంచుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గడపగడపకు వెళ్ళి వాలంటీర్లు అందిస్తున్నారన్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల అర్హులైన వారు ఎవరైనా మిగిలి ఉంటే వారికి కూడా స్పందన కార్యక్రమం ద్వారా సమస్యను పరిష్కరించి పథకాలను అందిస్తామన్నారు. నూతన జిల్లాలో కలెక్టర్ గా వచ్చిన డా. మాధవీలత ఒక అడుగు ముందుకు వేసి మన నియోజకవర్గం లో తొలిసారిగా స్పందన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రజలు తరపున కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. స్పందన పిర్యాదు ల పరిష్కారాన్ని తదుపరి స్పందన లో తీసుకున్న చర్యలపై సమీక్షించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను అర్హులకు సంక్షేమ పథకాలు రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతంగా అమలు చేస్తున్నామన్నారు.
స్పందనలో ఉద్యోగ, ఉపాధి, ఫించన్లు, గృహం మంజూరు, రెవెన్యూ, దివ్యంగుల కు ఉపకరణాలు, భూ వివాదాలు తదితర సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తం 890 మంది అర్జీదారుల నుంచి వినతులు అందాయన్నారు.
పలు స్పందన అర్జీలు…
రాజనగరం గ్రామానికి చెందిన మునసా పైడయ్య తన అర్జీలో దివ్యంగుడైన అయిన తనకు కొంతకాలం వికలాంగుల పెన్షన్ నిలుపుదల చేశారని, ఎందుకని అడిగితే రేషన్ కార్డ్ లేదు . మీ తండ్రిగారు ఇన్కమ్ టాక్స్ కడుతున్నారని అందువల్ల నిలుపుదల చేసినట్లు అర్జీలో పేర్కొన్నారు.
దీనిపై కలెక్టర్ వెంటనే స్పందిస్తూ సమస్యను పరిష్కరించి వారికి దివ్యాంగుల కోటాలో వచ్చే పెన్షన్ అందించాలని తహసీల్దార్ కు ఆదేశాలు జారీ చేశారు.
రాజానగరం మండలం తోకాడ గ్రామస్తులు సంగీత శ్రీనివాస్ వేగిశెట్టి లక్ష్మి జలకల పథకంలో బోరు మంజూరు చేయాలని తమ అర్జీలో కోరారు. దీనిపై జిల్లా కలెక్టర్ మాధవి లత, స్థానిక శాసనసభ్యులు జక్కంపూడి రాజా స్పందిస్తూ పథకం ద్వారా వారికి బోరు మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లాలో 13 శాఖల కు చెందిన పెండింగ్ లో ఉన్న స్పందన ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యత ను ఇచ్చి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కే. మాధవీలత స్పష్టం చేశారు. విద్యుత్తు, హౌసింగ్, నైపుణ్యాభివృద్ధి సంస్థ, పౌర సరఫరాల, వైద్య ఆరోగ్య, గ్రామ వార్డు సచివాలయ , పురపాలక, పంచాయతీ రాజ్, పోలీస్, రెవెన్యూ, డి ఆర్ డి ఎ, సర్వే, స్త్రీ శిశు సంక్షేమ శాఖ లకు చెందిన ప్రతి ఒక్క స్పందన ఫిర్యాదులను వెంటనే పరిష్కారం చూపి సంబందించిన వ్యక్తులకు సమాచారం తెలియ చేసి ఎక్నాలేడ్జెమెంట్ తీసుకోవాలని పేర్కొన్నారు. సంబందించిన సమగ్రమైన వివరాలు ఆన్లైన్ లో కూడా డేటా ఎంట్రీ చేయాలన్నారు.
ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు, డిఆర్వో బి.సుబ్బారావు, మహిళా శిశు సంక్షేమ అధికారి కె. విజయ కుమారి, ఆర్డబ్ల్యూ ఎస్ ఇంజినీరింగ్ అధికారి డి.బాలశంకర రావు, డిప్యూటీ డైరెక్టర్ గ్రౌండ్ వాటర్ పీఎస్ విజయకుమార్, జెడి మత్స్యాశాఖ ఈ.కృష్ణారావు, డీఎస్ఓ పి.ప్రసాదరావు, డీసీఎస్ఎం కె.తులసి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎస్.మాధవరావు, జిల్లా హౌసింగ్ అధికారి తారచంద్, జీఎం పరిశ్రమలు బి.వెంకటేశ్వర రావు, సివిల్ సప్లై డిఎం టి.తులసి, డిఎస్ఓ ప్రసాదరావు, డిఎహెచ్ఓ స్వర్ణలత, ఆర్డీఓ డీఈవో అబ్రహం,డిటీసీ, ఏ.చైతన్యవర్శిని, రాజానగరం, కోరుకొండ, సీతానగరం మండలాలకు చెందిన తాహసిల్దార్లు, ఎంపిడీవోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News