-24వ డివిజన్ 88 వ వార్డు సచివాలయం పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి లబ్ధిదారుడి కళ్లలో నిజమైన ఆనందం కనబడుతోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 24 వ డివిజన్ – 88 వ వార్డు సచివాలయం పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మంగళవారం సందడిగా సాగింది. స్థానిక వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ కుక్కల అనిత, పార్టీ శ్రేణులతో కలిసి ఇస్రాయిల్ వీధి, గంగవరపు ఆదాం వీధి, పంది యోసేబు వీధి, దుర్గం సత్యం వీధి, దొండపాడు యల్లయ్య వీధి, బొప్పూరి పురుషోత్తం వీధులలో ఎమ్మెల్యే పర్యటించారు. దాదాపు 406 గడపలను సందర్శించి.. లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖను వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న సాయంతో జగనన్న కాలనీలలో ఇళ్లు నిర్మించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పలువురు లబ్ధిదారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వీరందరికీ సచివాలయ సిబ్బంది, డ్వాక్రా ఆర్.పి.లు సమావేశాలు నిర్వహించి హౌసింగ్ పై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. తన పాలనలో ఏ ఒక్క పేదవాడు అద్దెలతో ఇబ్బందులు పడకూడదని.. కుల, మత, ప్రాంతాలకతీతంగా అర్హులందరకీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇళ్లను మంజూరు చేయడం జరిగిందని మల్లాది విష్ణు అన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత ఇళ్ల నిర్మాణాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేశారని, నివాస యోగ్యం లేని ఇళ్లను నిర్మించి బాబు చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. కానీ సీఎం వైఎస్ జగన్ ఒక యజ్ఞంలా ఇళ్ల నిర్మాణాలను చేపట్టారని తెలిపారు. ఒక్క సెంట్రల్ నియోజకవర్గంలోనే రూ. 300 కోట్ల నిధులతో 28 వేల మందికి ఒక్కొక్కరికి దాదాపు రూ. 6 లక్షల విలువ చేసే పట్టాను మంజూరు చేసినట్లు తెలిపారు. మరోవైపు గిరిపురం వాసులు దశాబ్ధాలుగా ఎదుర్కొంటున్న ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరించి.. త్వరలోనే రెగ్యులరైజ్డ్ పట్టాలు అందజేస్తామని స్పష్టం చేశారు.
88 వ వార్డు సచివాలయ పరిధిలో 2,828 మంది జనాభాకు గానూ 2,792 మంది లబ్ధిదారులకు ఇప్పటివరకు రూ. 4.70 కోట్ల సంక్షేమాన్ని అందించినట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు వివరించారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా 302 మందికి మూడేళ్లలో రూ. 1.80 కోట్లు అందించినట్లు తెలిపారు. చేయూత ద్వారా 188 మందికి రూ. 70.50 లక్షలు., కాపు నేస్తం ద్వారా నలుగురికి రూ. 60 వేలు., అమ్మఒడి ద్వారా 598 మందికి రూ. 83.72 లక్షలు., విద్యాదీవెన ద్వారా 107 మందికి రూ. 10.70 లక్షలు., వాహనమిత్ర ద్వారా 20 మందికి రూ. 2 లక్షలు, వైఎస్సార్ ఆసరా ద్వారా 570 మందికి రూ. 57 లక్షలు., సున్నా వడ్డీ ద్వారా 570 మందికి 57 లక్షలు, వైఎస్సార్ బీమా ద్వారా 4 కుటుంబాలకు రూ. 4 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు వివరించారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. విద్యా, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న అమ్మఒడి, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని మల్లాది విష్ణు అన్నారు. ఇటువంటి పథకాలను ఐదేళ్ల తమ పాలనలో అమలు చేయలేకపోయింనందుకు గత పాలకులు సిగ్గుపడాలన్నారు. ప్రజలకు అందించిన సంక్షేమాన్ని అంకెలతో సహా బుక్ లెట్ల ద్వారా లబ్ధిదారులకు వివరిస్తున్న ప్రభుత్వం స్వతంత్ర భారతదేశంలో వైఎస్సార్ సీపీ తప్ప మరొకటి లేదన్నారు. కనుకనే ఈర్ష్య, ద్వేషాలతో ప్రతిపక్షాలు సీఎం జగన్మోహన్ రెడ్డిపై నిత్యం విషంకక్కుతూ దుష్ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. అలాంటి విష పత్రికలను ప్రజలెవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. తెలుగుదేశం నాయకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో ఎన్ని హామీలను నెరవేర్చారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. అంతేగానీ పేదల జీవితాలలో వెలుగులు నింపుతున్న నవరత్నాల పథకాలపై విమర్శలు గుప్పిస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో పనిచేయాలని మల్లాది విష్ణు అన్నారు. ఎవరైనా అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. మరోవైపు అమ్మఒడి పథకం దరఖాస్తు గడువు తేదీని జూలై 15 వరకు పెంచడం జరిగిందని.. అర్హులైన ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్వో(సెంట్రల్) శ్రీనివాస్ వెన్నెల, నార్త్ ఎమ్మార్వో దుర్గాప్రసాద్, జోనల్ కమిషనర్ రాజు, ఏఈలు వెంకటేష్, రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, నాయకులు కుక్కల రమేష్, గుండె సుందర్ పాల్, బొంగరాల భాస్కర్, బద్దేటి ఇస్సాక్, కొమ్ము చంటి, రామిరెడ్డి, కె.సతీష్, క్రాంతి, సులోచనరావు, కోటేశ్వరమ్మ, విజయ్, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News