మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు చరిత్ర భావి తరాలతో పాటు ప్రపంచానికి తెలిసేలా 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం యావత్ తెలుగు ప్రజలందరికి ఎంతో గర్వకారణమని యువత ఆ వీరుడిని స్ఫూర్తిగా తీసుకోవాలని కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా పేర్కొన్నారు.
గురువారం ఉదయం స్థానిక కోనేరు సెంటర్ లో అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి వేడుకలలో భాగంగా యువజన సంక్షేమ, గిరిజన సంక్షేమ, విద్యా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో వివిధ కళాశాల విద్యార్థిని విద్యార్థులు 100 అడుగుల జాతీయ పతాకాన్ని ఐక్యంగా చేతబూని కోనేరు సెంటర్ నుండి బస్టాండ్ వరకు జోహార్ అల్లూరి సీతారామరాజు అంటూ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ ఎంతో క్రమశిక్షణతో కొనసాగింది . ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. తొలుత అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి పచ్చ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4 – 1924 మే 7 మధ్య కాలంలో ఒక మహోజ్వల శక్తిగా వెలుగొందరని అన్నారు. ఆ మహనీయడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం అని అన్నారు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన 27 ఏళ్ల వయస్సులోనే ప్రాణత్యాగం చేసిన విప్లవజ్యోతి అల్లూరి అని తెలిపారు.ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జూన్ 27 నుంచి జూలై 4వ తేదీ వరకు స్వాతంత్య్ర సమర యోధుడు అల్లూరి త్యాగాన్ని చాటి చెప్పేలా వేడుకలు ఉంటాయని చెబుతూ, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి సాయుధ విప్లవాన్ని ఉధృతం చేసిన గొప్ప దేశభక్తుడు అల్లూరి సీతారామరాజు అని అభివర్ణించారు. బ్రిటీష్ పాలకులను, సైన్యాన్ని తన కార్యకలాపాలతో భయభ్రాంతులకు గురిచేసిన తీరు బ్రిటిష్ ప్రభుత్వంలో భయాందోళనకు గురి చేసిందని చెప్పారు.
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు దేశభక్తి స్ఫూర్తి భారతీయ జాతీయవాదం జ్వాలలను రేకెత్తించిందని, దేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేపట్టేందుకు అనేకమందిని ప్రేరేపించిందని కలెక్టర్ గుర్తుచేశారు. భారతీయుల గుండెల్లో ఇప్పటికీ మరువలేని వీరుడుగా నిలిచిపోయారని ఆయన శ్లాఘించారు.
ఈ కార్యక్రమంలో మచిలీపట్నం రెవిన్యూ డివిజనల్ అధికారి ఐ. కిషొర్, మచిలీపట్నం తహశీల్ధార్ సునీల్ బాబు, యూత్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సిఇఓ శ్రీనివాస్, జిల్లా విద్యా శాఖాధికారిణి తాహెరా సుల్తానా, గిరిజన సంక్షేమ శాఖాధికారి ఫణి ధూర్జటి , జిల్లా క్రీడాభివృద్ధి అధికారిణి కె. ఝాన్సీ లక్ష్మి, ఎస్ ఎస్ ఆర్ కె శాస్త్రి, ఎస్.గంగాధర్ , మోహనరావు , బి.రమేష్ కుమార్, టి. వాణి, వి.నాంచారయ్య తదితర వ్యాయమ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News