-పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపిన మహా ప్రదర్శన
-మూడు సార్లు ఆతిథ్యమిచ్చి చరిత్ర సృష్టించిన విజయవాడ
-ఈ స్ఫూర్తితో సిపిఐ మరింత బలోపేతం
-ఆహ్వాన సంఘ ముగింపు సమావేశంలో రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కారం కోసం, పేదల సంక్షేమం కోసం, రాష్ట్ర సమగ్రాభివృద్ధికై అలుపెరగని పోరాటాలు చేస్తున్న సీపీఐకి జనాదరణ మెండుగా ఉందని గత నెల 14నుండి 18వ తేదీ వరకు విజయవాడలో జరిగిన సీపీఐ జాతీయ మహాసభల సందర్భంగా జరిగిన భారీ ప్రదర్శన, బహిరంగసభలు నిరూపించాయని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. స్థానిక దాసరి భవన్‌లో శుక్రవారం సీపీఐ జాతీయ మహాసభల ఆహ్వాన సంఘ ముగింపు సమావేశం నిర్వహించారు. ఆహ్వాన సంఘ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తొలుత సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ అజీజ్ పాషా మాట్లాడుతూ విజయవాడలో జరిగిన జాతీయ మహాసభలు చరిత్రలో నిల్చిపోతాయన్నారు. మహాసభల ఏర్పాట్లు అద్భుతంగా చేశారని, ఇందుకోసం ఏర్పాటైన కమిటీలన్నీ అత్యంత సమర్థవంతంగా తమ విధులు నిర్వహించారని కొనియాడారు. ప్రతినిధులకు వసతి, భోజన సౌకర్యాలు, మహాసభల ప్రాంగణంలో ఏర్పాట్లు, వేదిక నిర్మాణం వంటివి అంతర్జాతీయ మహాసభలకు మించి ఉన్నాయని ప్రశంసించారు. ముఖ్యంగా మహాసభల సందర్భంగా నిర్వహించిన మహాప్రదర్శన, బహిరంగ సభకు పార్టీ శ్రేణులను భారీస్థాయిలో కదిలించడంలో ఏపీ, తెలంగాణా పార్టీలు చేసిన కృషి అభినందనీయమన్నారు. అలాగే పార్టీ చరిత్రలో జాతీయ మహాసభల నిర్వహణకు మూడు సార్లు ఆతిథ్యమిచ్చిన ఘనత విజయవాడ నగరానికే దక్కిందన్నారు. ఈ స్ఫూర్తితో రాబోవు రోజుల్లో మరింత బలోపేతమైన ఉద్యమాలను నిర్మించి, పార్టీ పటిష్టతకు శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ మహాసభల విజయవంతానికి ప్రజల నుంచి వచ్చిన స్పందన, వారందించిన సహకారం మరువలేనిదన్నారు. ధన, వస్తు రూపేణా అనేకమంది స్వచ్ఛందంగా విరాళాలు అందజేశారని, వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. మహాసభల సందర్భంగా అక్టోబరు 14వ తేదీ నిర్వహించిన మహా ప్రదర్శనకు ప్రత్యేక రైళ్ళు, బస్సులు, ఇతర వాహనాల ద్వారా జనం ఉప్పెనలా తరలిరావడం పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపిందన్నారు. ఈ ప్రదర్శన ద్వారా పేద ప్రజలు సీపీఐ వెనుకే ఉన్నారని మరోసారి నిరూపితమైందన్నారు. ఏపీలోని 26 జిల్లాల నుంచి దాదాపు 48వేల మంది పార్టీ, అనుబంధ సంఘాల కార్యకర్తలు, 2వేల మంది రెడ్ షర్ట్ వాలంటీర్లు ప్రదర్శనకు తరలిరాగా, తెలంగాణా నుంచి సుమారు 25వేల మంది తరలివచ్చినట్లు తెలిపారు. అలాగే అంతర్జాతీయంగా దాదాపు 17 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరుకావడం మరో విశేషంగా పేర్కొన్నారు. మహాసభల విజయవంతం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీలు, ఆహ్వాన సంఘ సభ్యులంతా వారికి అప్పగించిన బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వర్తించారని, వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణాకు చెందిన మరో ఆహ్వాన సంఘం ప్రధానకార్యదర్శి చాడా వెంకట రెడ్డి మాట్లాడుతూ విజయవాడలో జరిగిన సీపీఐ జాతీయ మహాసభలు చరిత్రాత్మకమైనవిగా అభివర్ణించారు. ఈ మహాసభల స్ఫూర్తితో మొదటి నుండి కమ్యూనిస్టు గడ్డగా పేరొందిన విజయవాడ నగరపాలకసంస్థపై సీపీఐ జెండా ఎగురవేయాలని ఆకాంక్షించారు. తెలంగాణా రాష్ట్ర సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కమ్యూనిస్టు ఉద్యమంలో విజయవాడ నగరానికి ప్రత్యేక చరిత్ర ఉందని, తనకు ఈ నగరంలో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మహాసభల విజయవంతానికి తెలంగాణా నుంచి జన, ధన సమీకరణలో తమ వంతు సహకారం అందించామని తెలిపారు. ఏర్పాట్లలో ఏ లోటూ లేకుండా ఆయా కమిటీలు ఒక టీమ్ స్పిరిట్‌తో సమర్థవంతంగా నిర్వహించి, మహాసభలను జయప్రదం చేశారని అభినందించారు. ఆహ్వాన సంఘం కోశాధికారి, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మహాసభల నిర్వహణకు ప్రజలందించిన విరాళాలు, ఖర్చుల వివరాలను సభకు సమర్పించారు. అనంతరం మహాసభల విజయవంతానికి కృషి చేసిన కమిటీ సభ్యులందరికీ ఈ సమావేశంలో జ్ఞాపికలు అందజేసి ప్రత్యేకంగా సత్కరించారు.
ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణ మూర్తి, ఆహ్వాన సంఘం ప్యాట్రన్స్, మాజీ శాసనసభ్యులు మానం ఆంజనేయులు, ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య, జి.ఓబులేసు, పి.హరినాథరెడ్డి, కార్యదర్శులు పల్లా వెంకటరెడ్డి, అక్కినేని వనజ, ఆర్గనైజింగ్ కార్యదర్శులు పి.దుర్గాభవాని, జంగాల అజయ్‌కుమార్, విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు దోనేపూడి శంకర్ ఆహ్వానసంఘ సభ్యులను వేదికపైకి ఆహ్వానించారు.
Prajavartha Online Telugu News