సుదీర్ఘ కాలం నుండి పెండింగ్ లో ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 పనుల్లో ముందడుగు

-స్వర్ణభారతి నగర్ లో రోడ్ రోడ్ ప్రభావిత వాసులతో సమావేశమైన కమిషనర్, ఎంఎల్ఏ
-ప్రతి ఒక్కరికీ న్యాయం చేసే విధంగా చర్యలు
-ట్రాఫిక్ పరిష్కారానికి ఇన్నర్ రింగ్ రోడ్ కీలకం
-సహకరించాలని కోరిన కమిషనర్ కీర్తి చేకూరి, ఎంఎల్ఏ సుచరిత

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ఇన్నర్ రింగ్ రోడ్ చాలా కీలకమని, ఎంతో కాలం నుండి పెండింగ్ లో ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 పనులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి, ప్రత్తిపాడు ఎంఎల్ఏ మేకతోటి సుచరిత కోరారు. శనివారం కమిషనర్, ఎంఎల్ఏ, స్థానిక కార్పొరేటర్ స్మిత పద్మజ, పట్టణ ప్రణాలిక అధికారులు, రెవెన్యూ అధికారులతో కలిసి ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 వలన ప్రభావితం అయ్యే స్వర్ణ భారతి నగర్ లో పర్యటించి, అనంతరం స్థానిక కమ్యూనిటి హాల్లో స్థానికులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ పనులు సుదీర్ఘకాలం నుండి పెండింగ్ లో ఉన్నాయని, సదరు రోడ్ పూర్తీ అయితే గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్య తీరుతుందన్నారు. అటువంటి కీలకమైన రోడ్ పనులు చేపట్టడానికి నగరపాలక సంస్థ ప్రత్యెక చర్యలు తీసుకుంటుందని, రోడ్ పనులకు స్థానికులు కూడా పూర్తి సహకరించాలని కోరారు. 80 అడుగుల వెడల్పుతో 4.21 కిలోమీటర్ల మేర మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ ఏర్పాటు జరుగుతుందని, అందులో ఇప్పటికే 3.30 కిలోమీటర్ల రోడ్ పనులు పూర్తి అయి స్వనభారతి నగర్ వద్ద ఆగిపోయాయన్నారు. రోడ్ విస్తరణలో నష్ట పోతున్న వారికి అర్హత మేరకు జగనన్న కాలనీల్లో ప్రాధాన్యత మేరకు ఇంటి స్థలం పట్టా ఇచ్చి, ఇంటి నిర్మాణాలకు కూడా రుణాలు మంజూరు చేయిస్తామన్నారు. ప్రస్తుతం ఉంటున్న ప్రాంతంలో ఉన్న వారికి చట్ట ప్రకారం భూమి పై హక్కులు లేవని, అటువంటి వారికి జగనన్న కాలనీల్లో పక్కా రిజిస్ట్రేషన్ తో ఇంటి స్థలం ఇవ్వడం జరుగుతుందన్నారు. కాలనీల్లో మౌలిక వసతులు కూడా వేగంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. అలాగే ఇళ్లు నష్ట పోతున్న వారికి చట్ట ప్రకారం నష్ట పరిహారం ఇస్తామని, రోడ్ పనులకు అందరూ సహకరించాలని కోరారు.
ఎంఎల్ఏ సుచరిత మాట్లాడుతూ అనేక ఏళ్ల తరబడి కాల్వల వెంబడి, ప్రభుత్వ స్థలాల్లో ప్రమాదాలతో కూడిన అభద్రతా జీవనం గడిపిన వారికి ఇంటి పట్టాలు ఇవ్వడం ద్వారా వారికీ రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇచ్చిందన్నారు. స్వర్ణ భారతి నగర్ లో కూడా ఇన్నర్ రింగ్ రోడ్ ప్రతిపాదిత ప్రాంతాల్లో ఉన్న వారిలో కొందరు బి.ఫారం ఉన్న వారు, మరి కొందరు ప్రభుత్వ స్థలాలను, కాల్వ కట్టలను ఆక్రమించుకొని ఇల్లు నిర్మాణం చేసుకున్నారని, వారు రోడ్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. నష్ట పోతున్న వారికీ జగనన్న కాలనీల్లో ఇళ్ళ స్థలాలు ఇప్పించి, ఇళ్ళ నిర్మాణంకు కూడా ప్రభుత్వం వైపు నుండి సహకారం అందిస్తామని తెలిపారు. చట్ట ప్రకారం ఆక్రమణలను తొలగించి పనులు చేపట్టే వీలున్నా, నగరపాలక సంస్థ అధికారులు కూడా రోడ్ ఏర్పాటు వలన నష్ట పోయే ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన అనంతరమే పనులు ప్రారంభించాలన్నారు. నష్ట పోతున్న వారికి తగిన న్యాయం చేయడానికి నగరపాలక సంస్థ కౌన్సిల్ లో తీర్మానం ద్వారా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ని కోరామన్నారు. స్థానికులు వచ్చే వారం రోజుల్లో తిరిగి సమావేశం జరిగే నాటికి ఆలోచించి ఆమోద పత్రాలు ఇవ్వాలని, రోడ్ ఏర్పాటు పై ఎటువంటి అనుమానాలు ఉన్నా ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు.
సమావేశంలో కార్పోరేటర్లు బి.స్మిత పద్మజ, వై.సాంబిరెడ్డి, ఆర్&బి డైరెక్టర్ పి.మేరి, ఎన్.ఆర్.జి.ఎస్. డైరెక్టర్ మనోహర్ రెడ్డి, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, డిప్యూటీ సిటి ప్లానర్ మూర్తి, గుంటూరు పశ్చిమ తహసీల్దార్ సాంబశివరావు, ఎసిపి బాబురావు, టిపిఎస్ గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *