కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులకు మద్దతు ధర కల్పించే విధంగా పూర్తి స్థాయి లో ఆర్భికెల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని సిఆర్డిఏ కమిషనర్, తూర్పు గోదావరి జిల్లా ప్రత్యేక అధికారి వివేక్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం కొవ్వూరు మండలం దొమ్మెరు గ్రామంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తో కలిసి ఆయన అర్భికే లను సందర్శించి, తదుపరి క్షేత్ర స్థాయి లో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రత్యేక అధికారి వివేక్ యాదవ్ మాట్లాడుతూ, మే ఒకటి నుంచి కురిసిన అకాల వర్షాలు కారణంగా కోతలు కోసిన పంట తడవడం 1జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో తడిసిన, మొలకెత్తిన ధాన్యం ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర కు కొనుగోలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారన్నారు. ఈ విషయంలో ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని అన్నారు. దొమ్మెరు అర్భికే పరిధిలో తేమ శాతం వివరాలను ఆయన పరిశీలించారు. అనంతరం రహదారి వెంట ధాన్యం ఆరబెట్టిన రైతులతో మాట్లాడారు. గన్ని బ్యాగులు సరఫరా, విరిగిన ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్ల నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందులను రైతులు ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, రైతుల నుంచి పూర్తి స్థాయి లో ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున కొనుగోలు చెయ్యడం జరుగుతోందని, ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా ఆఫ్ లైన్ ద్వారా కూడా కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్క ధాన్యం గింజ కొనుగోలు చెయ్యడం జరుగుతుంది అని పేర్కొన్నారు. ఈ పర్యటన లో స్పెషల్ ఆఫీసర్ వెంట జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, ఆర్డీవోలు ఎస్. మల్లిబాబు, ఏ. చైత్ర వర్షిణి, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, డి ఎస్ వో పి. ప్రసాదరావు, డి ఎం (సి ఎస్) వి. నాగార్జున రెడ్డి, ఇతర అధికారులు, రైతులు ఉన్నారు.
Prajavartha Online Telugu News