విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉపాధి హామీ పథకంలో పండ్ల తోటల అభివృధి పనులను సద్వినియోగం చేసుకుని రైతులు లాభాలు పొందాలని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు అన్నారు.
మైలవరం మండలం చంద్రాల గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పండ్ల తోటల పెంపకంలో భాగంగా గురువారం గుణదల పరిశుద్దం రైతు పొలంలో జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు మామిడి మొక్కలను నాటే ( ప్లాంటేషన్) పనులను ప్రారంభించి అక్కడి రైతులతో నేరుగా మాట్లాడి, వారి సందేహాలను నివృత్తి చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ పండ్లతోటల సాగుతో తక్కువ పెట్టుబడితో రైతులు అధిక లాభాలు పొందవచ్చునన్నారు. పండ్ల తోటల సాగుతో పాటు వేరుశనగ, కూరగాయలు, మినుము, పెసర వంటి అంతర్ పంటలను కూడా వేసుకుని అదనపు ఆదాయాన్ని పొందవచ్చునన్నారు. ఉపాధి హామీ పథకంలో పండ్ల తోటల పెంపకపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పండ్ల రకాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే రైతులకు మేలు కలుగుతుందన్నారు. వాతావరణం సమతుల్యత, ఆహ్లాదకర పరిసరాలను నెలకొల్పడంలో మొక్కల పెంపకం ప్రధాన భూమిక వహిస్తుందని, ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్ చట్ట ప్రకారం చిన్న, సన్నకారు, బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులకు జీవనోపాధిని పెంచడానికి పండ్లతోటల పెంపకం చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనిలో భాగంగా నూరు శాతం సబ్సిడీతో భూమి అభివృద్ధి పనులను చేపట్టి, వ్యవసాయానికి అనుకూలంగా మార్చి, పండ్లతోటలను అభివృద్ధి పరిచే పనులను ఉపాధి హామీలో చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలో రైతులు ఎక్కువ పెట్టుబడితో తక్కువ ఆదాయాన్ని ఇచ్చె పంటల నుండి ప్రత్యామ్నాయంగా తక్కువ పెట్టుబడి తో అధిక లాభాలను ఆర్జించే పండ్లతోటల వైపు రైతులు ముగ్గు చూపుతున్నారన్నారు. రైతుల ఆదాయం పెంచేందుకు పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహించాలని కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ జె. సునీత మాట్లాడుతూ, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకొని ఈ సీజన్లో చేయడానికి అనువైన పనుల ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని కూలీలందరికీ పని కల్పన ద్వేయంగా పనులను గుర్తించామని, ఈ పథకాన్ని ప్రతీ రైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా 15 రకాల ఉద్యాన పండ్ల రకాలను రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. మామిడి, నిమ్మ, జామ, డ్రాగన్ తదితర పండ్లతోటల పట్ల రైతులు ఆసక్తి చూపుతున్నారన్నారు. ఉపాధి హామిలో అన్ని కుటుంబాలు 100 రోజులు పని చేసుకుని ఆర్థికంగా లబ్ధి పొందాలని, అదేవిధంగా ఉద్యానం, ప్లాంటేషన్ కార్యక్రమాలను విరివిగా వినియోగించుకోవాలని డ్వామా పిడి సునీత కోరారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జొన్నలగడ్డ జ్యోతి, ఎంపీడీవో బి ఎం లక్ష్మి కుమారి, తహసీల్దారు శ్రీనివాసరావు,జిల్లా రైతు సంఘం అధ్యక్షులు శ్రీ జొన్నలగడ్డ గంగాధర రావు, ఏపీడి .శ్రీ వి..వెంకటేశ్వరరావు, వ్యవసాయ, ఉపాధి హామీ, పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
Prajavartha Online Telugu News