-త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాలను ప్రకటించాలి: *భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
వచ్చే నెల జూన్ 4 వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేసుకోవాలని నిర్వాచన్ సదన్, న్యూ ఢిల్లీ నుండి భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల ఫలితాల ప్రకటన విషయంలో ఏమాత్రం జాప్యం చేయకుండా భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాలను ప్రకటించాలన్నారు. ఐదు దశల్లో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల సీఈవో లు, ఆయా నియోజకవర్గాల ఆర్వోలు, జిల్లాల ఎన్నికల అధికారులతో ఎలక్షన్ కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సందు తో కలసి సోమవారం ఆయన వీడియో కాన్పరెన్సు నిర్వహించగా తిరుపతి జిల్లా కల్లెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్, డి.ఆర్.ఓ పెంచల్ కిషోర్ లతో కలిసి హాజరయ్యారు.
ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాట్లాడుతూ దశల వారీగా దేశవ్యాప్తంగా జరుగుచున్న సార్వత్రిక ఎన్నికలను అందరి సమిష్టి కృషితో ఎంతో విజయవంతంగా జరుగుచున్నదని, అదే స్పూర్తితో వచ్చే నెల 4 వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలన్నారు. ఓట్ల లెక్కింపు రోజు ఈవీఎం లను భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద క్రౌడ్ మేనేజ్మంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, నిర్ణీత పాస్ లేకుండా ఎవరినీ అనుమతించవద్దన్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పవర్ బ్యాక్అప్, ఫైర్ సేప్టీ పరికరాలను సిద్దంగా ఉంచుకోవాలని, అత్యవసర ఆరోగ్య సేవలు అందజేసేందుకు అంబులెన్సులను కూడా సిద్దంగా ఉంచుకోవాలన్నారు. ఈవీఎంలలో పోల్ అయిన ఓట్ల లెక్కింపుకు సంబందించి ఎన్నికల అధికారులు, సిబ్బందికి ముందస్తుగానే సరైన శిక్షణ నివ్వాలన్నారు. సుశిక్షితులైన ఎన్నికల సిబ్బందితో పాటు కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్ వంటి ఐ.టి. పరికాలను ముందస్తుగా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద సిద్దంగా ఉంచుకోవాలన్నారు. కౌంటింగ్ రోజు లెక్కించే ఈవీఎం లను ఒక క్రమ పద్దతిలో తీసుకురావడం, ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తదుపరి “లెక్కింపు పూర్తి అయినట్లుగా” ఆయా ఈవీఎం లపై మార్కుచేస్తూ వెంటనే వాటిని సీల్ చేసి ఒక క్రమపద్దతిలో సురక్షితంగా భద్రపర్చాలన్నారు. అనవసరంగా ఈవీఎం లను అటూ ఇటూ మువ్ చేయవద్దని సూచించారు. ఎలక్ట్రానిక్ ట్రాన్స్పర్ పోస్టల్ బ్యాలెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ETPBMS) ను చక్కగా నిర్వహించాలని, వాటి లెక్కింపుకు సంబందించి ప్రత్యేకంగా టేబుళ్లను, స్కానర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎన్నికల ఫలితాలను ప్రకటించే విషయంలో ఏమాత్రము ఆలశ్యం చేయవద్దని, డిస్ప్లే బోర్డుల ద్వారా ఎప్పటి కప్పుడు ఖచ్చితమైన ఎన్నికల ఫలితాలను ప్రకటించాలన్నారు.
Prajavartha Online Telugu News