-సమన్వయం చేసుకుంటూ సహకారం అందించాలి
-కార్యాలయ ఉత్తర ప్రత్యుత్తరాలు “ఈ-ఆఫీసు” లోనే నిర్వర్తించాలి
-విధుల నిర్వహణలో అధికారులు జవాబుదారీ తనం కలిగి ఉండాలి
-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాను అభివృద్ది పథంలో నడిపేందుకు , ప్రజా సమస్యల పరిష్కారానికి , ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు అమలు చేయటం లో అధికారులు సమన్వయం చేసుకోవాలని, పూర్తి స్థాయిలో సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు.
శుక్రవారం కలెక్టరేట్ లో కలెక్టరు గా బాధ్యతలు చేపట్టిన అనంతరం అధికారులను ఉద్దేశించి కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు వ్యక్తిగత బాధ్యత తీసుకుని జవాబుదారీ తనం కలిగి ఉండాలన్నారు. ఆ దిశలో సమన్వయం చేసుకోవాలని, జిల్లా యంత్రాంగానికి అధికారులు సహకారం అందచేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఇకపై ప్రతి ప్రభుత్వ శాఖ నిర్వహించే ఉత్తర ప్రత్యుత్తరాలు “ఈ – ఆఫీసు ” ద్వారా నిర్వహించాలని ప్రశాంతి తెలియ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుని, నిజాయితీ కలిగి పరిష్కారం చూపే బాధ్యత సంబంధిత అధికారులు తీసుకోవలసి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు, ఉత్తర్వులు మేరకు అధికారులు వ్యక్తిగత బాధ్యత తీసుకుని విధులను నిర్వర్తించడం అత్యంత కీలకం అని తెలిపారు. ప్రతికూల వార్తల నేపథ్యంలో ఆయా అంశాలపై విశ్లేషణ చేసుకుని వాటి పరిష్కార మార్గాలు, సమస్య మూలలు తెలుసుకుని పరిష్కార దిశగా అడుగులు వేయాలని అధికారులకి సూచించారు.
ఈ సంధర్భంగా వివిధ శాఖల అధికారులను పరిచయం చేసుకుంటూ, ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాధాన్యత కార్యక్రమాల, వాటి అమలు తీరు పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు చేస్తూ, వాటినీ చివరి వ్యక్తి వరకూ చేరడం లో అధికారులు ఉద్యోగులు భాగస్వామ్యం కీలకం అన్నారు. ఈ సంధర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి ని పలువురు అధికారులు కలిసి శుభాకంక్షలు తెలియ చేశారు.
Prajavartha Online Telugu News