జిల్లా అభివృద్దే ప్రధాన లక్ష్యం..

-రాబోయే రోజుల్లో నీటి సమస్య లేకుండా చేస్తాం
-శరవేగంగా మచిలీపట్నం పోర్టు నిర్మాణం
-జిల్లా కలెక్టర్ తో కలసి జిల్లా అభివృద్ధి పనులు, సమస్యలపై సమీక్షించిన ఎంపీ వల్లభనేని బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా అభివృద్దే ప్రధాన లక్ష్యంగా అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని, అందుకు అవసరమైన సహాయ సహకారాలను అన్ని విధాలుగా అందిస్తామని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి అన్నారు. గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆధ్వర్యంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి జిల్లాలోని పలు అభివృద్ధి పనులు, పెండింగ్ సమస్యలపై సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రధానంగా మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనుల పురోగతి, జల జీవన్ మిషన్ పథకం, ప్రకాశం బ్యారేజ్ దిగువన నిర్మించ తలపెట్టిన మరో రెండు బ్యారేజీల నిర్మాణం, ఎదురుమొండి బ్రిడ్జి నిర్మాణం, సిఎస్ఆర్, ఎంపీ లాడ్స్ నిధులు, మచిలీపట్నం పట్టణ అభివృద్ధి తదితర అంశాలపై విభాగాల వారీగా ఆయన సమీక్షించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి సమస్యలు అధికంగా ఉన్నాయని, ముఖ్యంగా తీర ప్రాంతాలైన అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో తాగునీటి సమస్య తీర్చేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. జల జీవన్ మిషన్ పథకం ద్వారా ప్రతి గ్రామానికి మంచినీటిని అందించేందుకు అవసరమైన నిధులను సమకూరుస్తామని, అందుకు సంబంధించిన పనులను సమర్థవంతంగా నిర్వహించగలిగే ఏజెన్సీకి పనులను అప్పజెప్పే విధంగా చూడాలన్నారు. మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న మచిలీపట్నం పోర్టు పనులు దాదాపుగా సంవత్సరం నుండి నిరాటంకంగా కొనసాగుతూ ప్రస్తుతం 20 శాతం మేర పనులు పూర్తయ్యాయని అధికారుల ద్వారా తెలుసుకున్న ఆయన, ప్రణాళిక ప్రకారం 16 బెర్తుల నిర్మాణానికి గాను మొదటి దశలో నాలుగు బెర్తుల నిర్మాణాన్ని నిర్దేశిత సమయానికి పూర్తిచేయాలని పోర్టు అధికారులకు సూచించారు. రూ.250 కోట్లతో భారతమాల ప్రోగ్రాం ద్వారా పోర్టు కనెక్టివిటీ రోడ్డు నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారని, కేంద్ర ప్రభుత్వం నుంచి సంబంధిత నిధుల మంజూరుకు కృషి చేస్తామన్నారు.

ప్రకాశం బ్యారేజ్ దిగువన ప్రతిపాదించిన రెండు బ్యారేజ్ ల నిర్మాణాల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెనమలూరు మండలం చోడవరం, అదే విధంగా మోపిదేవి మండలం బండికొల్లంక వద్ద నాలుగు టిఎంసిల చొప్పున నీటి నిలువ సామర్థ్యంతో నిర్మిస్తామన్నారు. వీటి ద్వారా పరిసర ప్రాంతాలకు రానున్న కాలంలో సాగు, తాగునీటి కష్టాలు తీరుతాయని, బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అదేవిధంగా అవనిగడ్డ నియోజకవర్గంలో ఎదురుమొండి వద్ద నాబార్డు నిధులతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నామని, ప్రభుత్వం ద్వారా పునఃప్రతిపాదనలు పంపి త్వరలోనే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి అధిక మొత్తంలో నిధులను తీసుకురావడం జరిగిందని, అందుకు సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

కేంద్ర ప్రభుత్వ సహకారంతో కృష్ణా జిల్లా నుండి అమరావతి రాజధానికి తూర్పు బైపాస్ నిర్మాణం చేపడతామని, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో చర్చించినట్లు ఎంపీ తెలిపారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో డ్రైనేజీ, తాగునీటి సమస్య ప్రధానంగా నెలకొందని, రాబోయే రోజుల్లో ఈ సమస్యలను అధిగమించేందుకు అమృత్ స్కీమ్ ద్వారా ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. మచిలీపట్నం నగరంలో డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఎంపీ సూచించారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, బందరు ఆర్డిఓ ఎం వాణి, మచిలీపట్నం నగర కమిషనర్ బాపిరాజు, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి టి శివప్రసాద్, మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ తులసీదాస్, రైట్స్ టీం లీడర్ విశ్వనాథం, ఆర్ అండ్ బి ఈఈ శ్రీనివాసరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *