-భూ దందాల దోషులను కఠినంగా శిక్షించాలి
-భూ బాధితుల రాష్ట్ర సదస్సులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో భూ అక్రమాలు బాగా పెరిగిన నేపధ్యంలో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మరోమారు భూ పోరాటాలు ప్రారంభిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వెల్లడించారు. సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో భూ బాధితుల రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
స్థానిక తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో బుధవారం జరిగిన సదస్సుకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్.కోటేశ్వరరావులు అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ‘దున్నేవానికే భూమి’ నినాదం కమ్యూనిస్టు పార్టీదే అన్నారు. నేడు భూమి ధరలు భగ్గుమని మండుతున్నాయన్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత భూముల ధరలు పెరిగిన కారణంగా భూ అక్రమాలు పెరిగాయన్నారు. ఎక్కడికక్కడ అధికారంలో ఉన్నవారు, ఇతరత్రా పలుకుబడి ఉన్నవారు ఇదే పని మీద ఉండి అక్రమ లావాదేవీలు చేస్తున్నారని విమర్శించారు. 22ఏ పేరుతో కడప జిల్లాలో భూములు ఫ్రీ హోల్డ్‌లో పెట్టారని, అవన్నీ అగ్రకులం చేతిలోకి పోయాయన్నారు. మదనపల్లెలో సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని దహనం చేసే స్థాయికి భూ అక్రమాలు చేరాయన్నారు. ఒక మదనల్లెలోనే కాకుండా రాష్ట్రం వ్యాప్తంగా ఇలాంటి లావాదేవీలు జరిగాయన్నారు. పేదలు సాగు చేసుకునే భూములు ఒకే కులం చేతిలోకి వెళ్లాయని చెప్పారు. ఈ అక్రమాలకు ఎవరు పాల్పడ్డారో వారు ఐఏఎస్ అధికారులైనా, రెవెన్యూ అధికారులైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూ అక్రమాలపై కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి చెప్పుతున్నారేతప్ప ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఒంగోలు భూ అక్రమాలపై వేసిన సిట్ దర్యాప్తు ఏమైందని, మదనపల్లెలో జరిగిన ఘటనపై చర్యలు ఎంతవరకు వచ్చాయని సందేహం వ్యక్తంచేశారు. ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీ మేరకు పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం కేటాయించాలన్నారు. పేదల స్వాధీనంలో ఉన్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రతి పేదవానికి న్యాయం జరిగే వరకు కమ్యూనిస్టు పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఇప్పుడు జరుగుతున్న సదస్సు ప్రారంభం మాత్రమేనని ముందు ముందు మరిన్ని ఉద్యమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా 26 జిల్లాల నుంచి భూ బాధితులు తీసుకువచ్చిన అర్జీలను తీసుకున్నారు. రాష్ట్రం వ్యాప్తంగా పేదల భూములకు జరిగిన అన్యాయాలను రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్‌ని కలిసి అర్జీలు అందించి సమస్యలను వివరిస్తామని, తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించాలని కోరతామని వివరించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ గుంటూరు రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్రమాలు చేసి ఏర్పాటు చేసిన వెంచర్‌ను సీపీఐ ఆధ్వర్యంలో పేదలు ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్నారని, అలాగే మంగళగిరి రత్నాల చెరువును ఆక్రమించి పేదలు ఇళ్లు నిర్మించుకున్నారని చెప్పారు. ఈ పేదలకు ప్రభుత్వం పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకోవటానికి సీపీఐ ప్రణాళిక రూపొందిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్ (మాజీ ఎమ్మెల్సీ), జి.ఓబులేసు, పి.హరినాథరెడ్డి, డి.జగదీష్, డేగా ప్రభాకర్, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కి లెనిన్ బాబు, ఎపి చేతివృత్తిదారుల సమాఖ్య కన్వీనర్ కె.రామాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు పి.చంద్రనాయక్, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి బీవీ చంద్రశేఖర్లతో పాటు వివిధ జిల్లాలకు చెందిన సీపీఐ జిల్లా కార్యదర్శులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్దసంఖ్యలో భూ బాధితులు హాజరై తమకు జరిగిన అన్యాయాలను నాయకులకు వివరించి అర్జీలు అందించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ సదస్సుకు సాగ్వతం పలుకగా, ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు పి.చంద్రనాయక్, కోశాధికారి ఆర్.పిచ్చయ్య, నాయకులు ఎస్కే.నజీర్, నాగరాజు బృందం అభ్యుదయ గీతాలు ఆలపించారు.
ఎమ్మెలేలకు దోచిపెట్టటానికి జగనన్న కాలనీ పధకం – ముప్పాళ్ల
భూ బాధితుల రాష్ట్ర సదస్సు సందర్భంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో భూముల ధరలు పెరగటంతో పాటు గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న పెద్దలు పేదల భూముల్ని గద్దల్లా తన్నుకుపోయారని విమర్శించారు. ఒక్కో ప్రాంతంలో పేదలకు జరిగిన అన్యాయాలను తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం 50ఏళ్లకు పైగా అసైన్డ్ భూముల్లో సాగు చేసుకుంటున్న వాటిని కూడా ఎలా కొల్లగొట్టవచ్చో తెలియజెప్పిందన్నారు. జగనన్న కాలనీ పేరుతో పేదలకు ఇచ్చే సెంటు స్థలం కోసం పేదల అసైన్డ్ భూములే కావాల్సి వచ్చాయా? అని నిలదీశారు. అసైన్డ్ భూములను ఎమ్మెల్యే రూ.20 లక్షలకు కొని, దాన్ని ప్రభుత్వానికి రూ.80 లక్షలకు విక్రయించారని తెలిపారు. ఎమ్మెల్యేలకు దోచిపెట్టటానికి ‘జగనన్న కాలనీ’ పథకం ఒక సాధనంగా ఉపయోగపడిందని పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ సంస్థలకు చెందిన 3 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు ఇవ్వాల్సి ఉందన్నారు. అగ్రిగోల్డ్ భూమి రూ.10 లక్షలకో, రూ.12లక్షలకో కొనుగోలు చేసి బాధితులకు ఇస్తే వారి కన్నీళ్లు తుడిచినట్లు అయ్యేదన్నారు. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, విజయనగరం ఏ జిల్లా అయినా అసైన్డ్ భూముల్లో సాగు చేసుకుంటున్న పేదలకు వాటిని స్వాధీనం చేసి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Prajavartha Online Telugu News