నిర్మాణ‌మే కాదు.. నిర్వ‌హ‌ణా ఆద‌ర్శంగా ఉండాలి

– డిసెంబ‌ర్ 10 వ‌ర‌కు హ‌మారా శౌచాల‌య్‌-హ‌మారా స‌మ్మాన్ ప్ర‌చార కార్య‌క్ర‌మం
– ప్ర‌త్యేక స‌ర్వే ఆధారంగా భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూప‌క‌ల్ప‌న‌
– అన్ని గ్రామాల‌నూ ఓడీఎఫ్ ప్ల‌స్ ఆద‌ర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి
– స్వ‌చ్ఛాంధ్ర కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బాపూజీ క‌ల‌లుగ‌న్న ప‌రిశుభ్ర భార‌తావ‌ని ల‌క్ష్యంగా కేంద్ర ప్ర‌భుత్వం స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్‌ను ప్రారంభించింద‌ని.. ఈ కార్య‌క్ర‌మంతో ప‌దేళ్ల కాలంలో స్వ‌చ్ఛ‌త‌, ప‌రిశుభ్ర‌త‌లో విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌చ్చాయ‌ని.. మ‌రుగుదొడ్లు, క‌మ్యూనిటీ శానిట‌రీ కాంప్లెక్స్‌ల (సీఎస్‌సీ) నిర్మాణంతో పాటు నిర్వ‌హ‌ణ‌లోనూ ఆద‌ర్శంగా నిల‌వాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని స్వ‌చ్ఛాంధ్ర కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్ప‌ష్టం చేశారు.
ప్ర‌పంచ మ‌రుగుదొడ్ల దినోత్స‌వం సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా, పారిశుద్ధ్య శాఖ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన జిల్లా నీటి, పారిశుద్ధ్య మిష‌న్ (డీడ‌బ్ల్యూఎస్ఎం) స‌మావేశంతో పాటు ప్ర‌త్యేక కార్యక్ర‌మంలో స్వ‌చ్ఛాంధ్ర కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఎండీ బి.అనిల్ కుమార్ రెడ్డి, ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ డా. నిధి మీనా త‌దిత‌రులు పాల్గొన్నారు. మ‌న మ‌రుగుదొడ్లు-మ‌న గౌర‌వం, మ‌రుగుదొడ్లు శుభ్రంగా ఉంచుకోండి-ఆనందంగా జీవించండి అంటూ రూపొందించిన పోస్ట‌ర్లను ఆవిష్క‌రించ‌డంతో పాటు ప్ర‌తిజ్ఞ చేయించారు. స‌మాజానికి విశేష సేవ‌లందిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల‌ను స‌త్క‌రించడంతో పాటు ల‌బ్ధిదారుల‌కు వ్య‌క్తిగ‌త మ‌రుగుదొడ్ల మంజూరు ప‌త్రాల‌ను అంద‌జేశారు.
ఈ సంద‌ర్భంగా స్వ‌చ్ఛాంధ్ర కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ పట్టాభిరామ్ మాట్లాడుతూ ఈ ఏడాది ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా హ‌మారా శౌచాల‌య్‌:హ‌మారా స‌మ్మాన్ ఇతివృత్తంతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 19 నుంచి డిసెంబ‌ర్ 10 వ‌ర‌కు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు వివ‌రించారు. వ్య‌క్తిగ‌త మ‌రుగుదొడ్లు, క‌మ్యూనిటీ శానిట‌రీ కాంప్లెక్స్‌లకు సంబంధించి ట్రిపుల్ ఆర్ (రిపైర్‌, రిస్టోర్‌, రిఫైన్‌)పై దృష్టిసారించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ప్ర‌చార కార్య‌క్ర‌మంలో మంచి ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన వారితో పాటు బెస్ట్ టాయిలెట్స్‌కు డిసెంబ‌ర్ 10న అవార్డుల‌ను అంద‌జేయ‌నున్న‌ట్లు వివ‌రించారు. ప్ర‌త్యేక ప్ర‌చార కార్య‌క్ర‌మంలో భాగంగా డిసెంబ‌ర్ 5 నుంచి 9 వ‌ర‌కు
నిర్వ‌హించే స‌ర్వే ఆధారంగా భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌లు రూపొందించనున్న‌ట్లు తెలిపారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు స్వ‌చ్ఛ భార‌త్ అభియాన్‌పై ప్ర‌త్యేకంగా దృష్టిసారించిన‌ట్లు పేర్కొన్నారు. గౌర‌వ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలో 2014-19లో 100 శాతం బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్‌) ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌డం జ‌రిగింద‌ని.. ఇప్పుడు గౌర‌వ ప్ర‌ధాని, ముఖ్య‌మంత్రి, ఉప ముఖ్య‌మంత్రి నేతృత్వంలో ఓడీఎఫ్ ప్ల‌స్ ఆద‌ర్శ గ్రామాలుగా తీర్చిదిద్ద‌డం ల‌క్ష్యంగా విశేష కృషి జ‌రుగుతోంద‌ని.. ఓడీఎఫ్ స్థాయిని నిల‌బెట్టుకోవ‌డంతో పాటు ఘ‌న‌, ద్ర‌వ వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ ల‌క్ష్యాల సాధ‌న‌తో ఓడీఎఫ్ ప్ల‌స్ ఆద‌ర్శ గ్రామాలుగా తీర్చిదిద్ద‌డంపై దృష్టిసారిస్తున్న‌ట్లు వివ‌రించారు. ఇందుకు స్వ‌చ్ఛాంధ్ర కార్పొరేష‌న్ భాగ‌స్వామ్య ప‌క్షాల‌తో క‌లిసి ప‌నిచేస్తున్న‌ట్లు తెలిపారు. స‌మ‌ష్టి కృషితో నిబ‌ద్ధ‌త‌తో ప‌నిచేయ‌డం ద్వారా క్షేత్ర‌స్థాయిలో మంచి ఫ‌లితాలుంటాయ‌ని ప‌ట్టాభిరామ్ పేర్కొన్నారు.

వినూత్న ఆలోచ‌న‌ల‌తో స్వ‌చ్ఛ భార‌త్ అమ‌లు: స్వ‌చ్ఛాంధ్ర కార్పొరేష‌న్ ఎండీ బి.అనిల్ కుమార్ రెడ్డి
స్వ‌చ్ఛాంధ్ర కార్పొరేష‌న్ ఎండీ బి.అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వినూత్న ఆలోచ‌న‌ల‌తో స్వ‌చ్ఛ భార‌త్ అభియాన్ కార్య‌క్ర‌మం అమ‌లుకు కృషిచేస్తున్న‌ట్లు తెలిపారు. వ్య‌క్తిగ‌త మ‌రుగుదొడ్లు, క‌మ్యూనిటీ శానిట‌రీ కాంప్లెక్స్‌ల నిర్మాణాలు, నిర్వ‌హ‌ణ ల‌క్ష్యాల సాధ‌నకు స‌రైన‌కార్యాచ‌ర‌ణ‌తో ప‌నిచేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. అంగ‌న్వాడీలు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలతో పాటు విద్యా సంస్థ‌ల మ‌రుగుదొడ్ల‌పై దృష్టిసారిస్తున్న‌ట్లు తెలిపారు. డ్రాప్‌ట్‌తో ముడిప‌డియున్న అంశం కాబ‌ట్టి ఆ దిశ‌గా విద్యార్థినులకు పూర్తిస్థాయిలో మ‌రుగుదొడ్లు అందుబాటులో ఉండ‌టం ముఖ్య‌మ‌న్నారు. నిధుల‌కు కొర‌త లేద‌ని.. ఐసీడీఎస్‌, పాఠ‌శాల‌విద్య, గ్రామీణ నీటిస‌ర‌ఫ‌రా.. ఇలా వివిధ శాఖ‌ల స‌మ‌న్వ‌యంతో ల‌క్ష్యాల సాధ‌న‌కు కృషిచేస్తున్న‌ట్లు తెలిపారు.

మాన‌వ హ‌క్కుల‌తో ముడిప‌డిన అంశం: ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ డా. నిధి మీనా
మ‌రుగుదొడ్ల సౌక‌ర్యం అనేది మాన‌వ హ‌క్కుల‌తో ముడిప‌డిన అంశ‌మ‌ని.. మంగ‌ళ‌వారం ప్రారంభ‌మైన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు అంత‌ర్జాతీయ మాన‌వ హ‌క్కుల దినోత్స‌వ‌మైన డిసెంబ‌ర్ 10వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ డా. నిధి మీనా తెలిపారు. ల‌బ్ధిదారుల‌ను గుర్తించి వ్య‌క్తిగ‌త మ‌రుగుదొడ్లను మంజూరు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. మ‌రుగుదొడ్ల నిర్మాణం, నిర్వ‌హ‌ణ‌, ప‌రిశుభ్ర‌త‌కు అత్యంత ప్రాధాన్య‌మివ్వ‌నున్న‌ట్లు తెలిపారు.
కార్య‌క్ర‌మంలో స్వ‌చ్ఛాంధ్ర కార్పొరేష‌న్ ఈడీ బి.అర్జున్‌రావు, జిల్లా గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా ఎస్ఈ ఎస్‌.విద్యాసాగ‌ర్‌, డీపీవో పి.లావ‌ణ్య కుమారి, ఐసీడీఎస్ పీడీ జి.ఉమాదేవి, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, జిల్లా నీటి, పారిశుద్ధ్య మిష‌న్ స‌భ్యులు, పారిశుద్ధ్య కార్మికులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *