-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కష్టపడే వారికి పార్టీలో ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల పదవులు పొందిన వారి పరిచయ కార్యక్రమం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో ఆదివారం జరిగింది. మల్లాది విష్ణు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజా రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. కూటమి ప్రభుత్వం 9 నెలల కాలంలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకుందని, మనమందరం ప్రజల తరపున నిలబడాల్సిన సమయం వచ్చిందని అన్నారు. అందరూ ఐక్యంగా ఉంటూ ప్రభుత్వ తప్పులను ఎండగట్టాలన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడే ఏ పథకం ఏ నెలలో ఇస్తామో ముందుగానే బడ్జెట్ తో పాటు సంక్షేమ కేలండర్ ను విడుదల చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానిదని మల్లాది విష్ణు అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం బడ్జెట్ ను అంకెల గారడీగా మార్చేసిందన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. మన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మహిళల భద్రతను ఈ ప్రభుత్వం గాలికొదిలేసిందని.. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు. మరోవైపు వ్యవస్ధలన్నీ పూర్తిగా నీరుగారిపోతున్నాయని.. వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలైందన్నారు. వైద్యరంగం పరిస్థితి కూడా దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రియింబర్స్ మెంట్ విడుదల చేయకపోవటంతో సర్టిఫికెట్స్ రాక ఎందరో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని.. వారి తరపున పోరాటం చేయవలసిన బాధ్యత మనపై ఉందన్నారు. అలాగే రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ప్రతీ డివిజన్ లోనూ పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్ట పరచాలని.. ఇందుకోసం 24 గంటలు అందుబాటులో ఉంటానని చెప్పారు. డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజా రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని, ఇటువంటి తరుణంలో ప్రజల తరపున గళం వినిపించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అనంతరం పదవులు పొందిన నేతలు మాట్లాడుతూ..తమపై నమ్మకంతో వివిధ విభాగాలలో పదవీ బాధ్యతలు అప్పగించినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మల్లాది విష్ణు గారికి కృతజ్ఞతలు తెలిపారు. తమకు అప్పజెప్పిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తామని రాబోయే రోజులలో పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. తదననంతరం మల్లాది విష్ణుని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో 33 వ డివిజన్ కార్పొరేటర్ శర్వాణి మూర్తి, నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News