– మోడీ, అమిత్ షా, జగన్ దుష్ట సాంప్రదాయాలు
– వామపక్ష సెక్యులర్ పార్టీల ఐక్యతతో ముందుకెళ్తాం
– సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ
– 9 మాసాలలో చేసిన అప్పులపై సిఎం శ్వేతపత్రం విడుదల చేయాలి
– రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా, తారతమ్యాలు లేకుండా అన్ని మతాలను గౌరవించుకుంటూ లౌకిక ప్రజాస్వామిక దేశాన్ని కాపాడుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు.
సోమవారం దాసరి భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నారాయణ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంచి స్నేహితుడని అంతర్జాతీయ మీడియాతో చెప్పటం, అమెరికాలో అత్యంత అవినీతిపరుడు, అనిశ్చిత వాతావరణానికి కారణజన్ముడైన ట్రంప్‌ని ‘అధ్యక్షునిగా అధికారాన్ని ఎలా సాధించారని’ విలేకరి అడగగా ‘చట్టాలను అనుకూలంగా మార్చుకున్నాను’ అని ట్రంప్ చెప్పటం, ఒకరినొకరు పోల్చుకోవడం గమనించానన్నారు. ఆధారిత ఆరోపణలు, ఉద్దేశంతో చేసే ఆరోపణల మధ్య తేడాలుంటాయని, గుజరాత్ అల్లర్లను ప్రచారం చేసినా.. అధికారంలోకి వచ్చామని, కోర్టులు నిరూపించబడలేదని నరేంద్ర మోడీ చెప్తున్నారని అన్నారు. గుజరాత్ గోద్రా ఘటనలో మైనార్టీల ఊచకోత, అల్లర్లు జరిగినా భయభ్రాంతులతో స్థానిక ప్రజలు ఓట్లు వేసి గెలిపించారనేది ప్రపంచమంతా గుర్తించిందన్నారు. టెక్నికల్‌గా తప్పించుకున్నప్పటికీ ఆచరణ రీత్యా ముద్దాయేనని, నేను పవిత్రుడనని మోడీ అంటే సాధ్యమా…? అని ప్రశ్నించారు. లెఫ్ట్నెంట్ హోం మినిస్టర్‌గా ఉండి న్యూయార్క్ చీఫ్ జస్టిస్ లోయాను హత్య చేయించాడని, కోర్టు, సిబిఐ కూడా నిర్ధారించిందని, అమిత్‌షాపైన పెట్టిన కేసులలో లాయర్, సాక్షులను 12 మందిని చంపేశారన్నారు. సాక్షులను మాయం చేసినంత మాత్రాన నేరస్తులు కాదా..? అని ప్రశ్నించారు. జగన్ కూడా ఇలాగే కాపీ కొట్టాడని, అమిత్ షాను కలిసి సలహా తీసుకొని ఉంటాడేమో అనిపిస్తుందని, బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులు చనిపోతున్నారని గుర్తు చేశారు. మోడీ, అమిత్ షా, జగన్ దుష్ట సాంప్రదాయానికి పాల్పడుతున్నారని విమర్శించారు.
భారతదేశంలో అనేక ప్రాంతాలలో అతి తక్కువ శాతంగా ఉన్న అన్ని భాషల వారందరూ కూడా స్వాతంత్య్ర ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. బౌద్ధులు, సిక్కులు, జైనులు తక్కువ శాతంగా ఉన్నా మైనార్టీ, మెజార్టీ అనే ప్రాతిపదికన కాకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనే రాజ్యాంగం రూపొందించారనే విషయం మనందరికీ తెలుసన్నారు. నేడు నరేంద్ర మోడీ ఫెడరల్ వ్యవస్థకు, రాజ్యాంగానికి ప్రమాదం కలిగేలా మెజారిటైజేషన్ నినాదాన్ని ముందుకు తెస్తున్నారని, ఇది దేశానికి ప్రమాదమని ఆవేదన వ్యక్తం చేశారు. అండమాన్‌లో లిపిలేని భాష ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర పునర్విభజన తర్వాత భాషాప్రయుక్త రాష్ట్రాలలో ఆయా భాషలకు ప్రాముఖ్యత ఉందని, మాజీ ప్రధాని పివీ నరసింహారావుకు 18 భాషలు వచ్చని, అలాగే వామపక్ష నేత సీతారాం ఏచూరికి 12 భాషలు వచ్చు అని గుర్తు చేస్తూ.. భాషల పట్ల ఆసక్తి ఉండవచ్చుగానీ, ప్రపంచంలోగానీ, దేశంలోగానీ, భాషల వల్ల రాష్ట్రాల అభివృద్ధి జరగదన్నారు. తమిళనాడులో ఇష్టం లేకుండా హిందీ భాష అమలు గురించి ఒత్తిడి చేయవద్దని హితవు పలికారు. జనాభా ప్రాతిపదికన నాలుగు రాష్ట్రాలలో 150 సీట్లు పెరుగుతాయన్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేసే రాష్ట్రాలలో సీట్లు తగ్గుతాయన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు కుటుంబంలో ఒక్కరు చాలు అనేవారని, ఇప్పుడు ఎక్కువ మందిని కనండి అంటున్నారని మహిళలను పిల్లలు పుట్టించే యంత్రాల్లా భావించొద్దని మండిపడ్డారు. నరేంద్ర మోడీ నిర్ణయాలను చంద్రబాబు నాయుడు అమలు చేయాల్సి ఉందని, రాజకీయంగా ఎదుర్కోవాలని, అసంబద్ధమైన వాదనకు తెరలేపొద్దని సూచించారు. తమిళనాడులో 28 మీటింగ్ జరగనున్నదని, రాజకీయ ప్రమాద పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మోడీని ఒప్పించేందుకు రాజ్యాంగాన్ని కాపాడేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. నక్సలిజం భావాలపట్ల ఉన్న విభేదాలను పరిష్కరించాలేగాని, చత్తీస్‌ఘడ్ కాల్పులతో శారీరకంగా అంతం చేయటం దారుణమన్నారు. అమిత్ షా తీరు ప్రమాదమన్నారు. చత్తీస్‌ఘడ్‌లో సోమవారం జాతీయ కార్యదర్శి డి రాజా పర్యటనలో ఉన్నారని తెలిపారు. నక్సలిజం సమస్యపై చర్చించి పరిష్కరించాలేగాని, అరాచక పద్ధతి వద్దని సూచించారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ మంచి మేధావి, ఆవిర్భావ సభలో స్క్రిప్ట్ చదవడం గమనిస్తే చేగువేరా నుండి సావర్కర్ దాకా వెళ్ళాడని, సనాతన ధర్మంలో భర్త చనిపోతే సతీసహగమనం పేరుతో భార్యను చంపాలని ఉందని, పవన్‌కున్న తెలివితేటలు రాష్ట్రానికి ఉపయోగపడట్లేదని బాధ కలిగిస్తుందన్నారు. చిత్ర విచిత్రంగా మాట్లాడిన వారికి విలువ ఉండదని సూచించారు. జాతీయస్థాయిలో ఎదగడానికి, పదవులు రావడానికి నరేంద్ర మోడీ కనుసన్నల్లో పవన్, చంద్రబాబు ఉన్నారని స్పష్టం అవుతుందన్నారు. ఈ నేపథ్యంలో దేశంలో, రాష్ట్రంలో సెక్యులర్ వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఏప్రిల్ నెలలో సిపిఐ జాతీయ సమితి సమావేశం, సెప్టెంబర్‌లో జాతీయ మహాసభలలో వీటిపై చర్చించి, వామపక్ష సెక్యులర్ పార్టీల ఐక్యతను బలోపేతం చేస్తామని తెలిపారు.
అనంతరం రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢల్లీి వెళ్లి నరేంద్ర మోడీని కలిసి ఆర్థిక సహాయం కోరటంలో తప్పు లేదని, సంతోషిస్తామన్నారు. పది సంవత్సరాల క్రితం ఆనాటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన రాజధాని పనులను పునః ప్రారంభించడానికి ఆహ్వానిస్తున్నానని చంద్రబాబు చెప్పారని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నుండి అమరావతి రాజధానికి సహకారం ఉందా? లేదా? రాజధానికి నిధులు గ్రాంటుగా ఇస్తున్నారా? అప్పుగా ఇస్తున్నారా? అనే విషయాలపై సూటిగా చంద్రబాబు నాయుడుని ప్రశ్నిస్తున్నానన్నారు. నిన్ననే హడ్కోలో రూ.11 వేల కోట్ల రుణానికి ముఖ్యమంత్రి అగ్రిమెంట్‌పై సంతకం చేశారని, ఏషియన్ డెవలప్‌మెంట్, వరల్డ్ బ్యాంక్‌ల నుండి అప్పులు చేస్తున్నారని, 9 నెలల కాలంలో రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారని ధ్వజమెత్తారు. గతంలో జగన్ రాష్ట్రాన్ని అప్పులుపాలు చేసారని, చంద్రబాబు రాష్ట్రాన్ని కాపాడుతానంటే ప్రజలు నమ్మారన్నారు. అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా 7 మాసాల కాలంలో రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్ల సహాయం అందించనట్లు చెప్పారని గుర్తుచేశారు. మరి ఆ నిధులు ఏమయ్యాయి? ఆర్థిక ఇబ్బందులు ఎందుకు ఉన్నాయి? గత ప్రభుత్వ అప్పులు? 9 మాసాలలో మీరు చేసిన అప్పులు ఎన్ని? స్పష్టమైన సమాచారం అసెంబ్లీకి, ప్రజలకు ఇవ్వాలని, శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై స్పష్టత రావట్లేదని, ప్రైవేటీకరణ వద్దని ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పి ఒప్పించాలని చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అక్కినేని వనజలు పాల్గొన్నారు.