-వర్షాకాలంలోపే బుడమేరు గండ్లు పూడ్చి వేతపనులు చేస్తాం
-జిల్లాలో కొత్తగా 10 ఇసుక రీచ్‌లను గుర్తించాం
-ఆటోనగర్‌లో లక్ష మంది మెకానిక్‌ల అవసరముంది
-ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరువూరు నియోజకవర్గంలో కిడ్నీ వ్యాధులు ప్రబలడానికి గల కారణాలపై జోద్ పూర్‌లోని ఐసీఎంఆర్ నిపుణులతో అధ్యయనం చేయించాలని సంకల్పించామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో జిల్లా స్థాయిలో నిపుణులతో అధ్యయనం చేయించామని అయితే అక్కడ ఈ వ్యాధులకు కారణం నీటి సమస్య కాదని ఇంకేదో కారణాలున్నాయనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారని తెలిపారు. దీంతో ఐసీఎంఆర్ నిపుణులతో అధ్యయనం చేయించాలని సంకల్పించామన్నారు. సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన తమ జిల్లాకు సంబంధించిన ప్రగతిపై ప్రజంటేషన్ ఇచ్చారు. రాబోయే వర్షా కాలంలోపు బుడమేరు వరద మళ్లింపు కాలువలకు పడిన గండ్లు పూడ్చి వేత కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. మున్నేరు వాగు గండ్లు మరమ్మతులు చేస్తున్నామన్నారు. జిల్లాలో విజయవాడ ఆటోనగర్ ఆటోమొబైల్ రంగానికి అత్యంత కీలకమైందని, అక్కడ మెకానిక్‌ల కొరత ఎక్కువగా ఉందన్నారు. దాదాపు లక్ష మంది మెకానిక్‌లు ఆటోనగర్లో అవసరమని ఈ డిమాండుకు తగ్గ చర్యలు తీసుకోనున్నామని చెప్పారు. జిల్లా లో తలసరి ఆదాయం రూ.4.17 లక్షలు సాధన లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.