Breaking News

చేనేతల స్నేహహస్తం… వైఎస్సార్ నేతన్న నేస్తం…

-నేతన్నకు ఆపన్న హస్తం.. వైఎస్సార్ నేతన్న నేస్తం…
-ఈ నెల 10 వ తేదీన 69,225 మంది నేతన్నలకు మొత్తం రూ. 166.14 కోట్లను బటన్ నొక్కి పంపిణీ ప్రారంభించనున్న -సీఎం  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి …

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ప్రతి చేనేత కార్మికుడి అభ్యున్నతే లక్ష్యంగా ఈ ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్న ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్న మాటలకు అనుగుణంగా.. జగనన్న ప్రభుత్వం వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేసి ఇప్పటికే రెండు విడతల ఆర్ధికలబ్ధి పంపిణిని విజయవంతంగా పూర్తిచేసి, ఈ నెల 10 న మూడోవిడత వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ఆర్ధిక సాయం పంపిణీకి రంగం సిద్ధం చేసింది. కరోనా కష్ట కాలంలో సైతం పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి నేతన్నలు మార్కెట్ లో వచ్చే మార్పులకు అనుగుణంగా తమ మగ్గాలను ఆధునీకరించుకోవడంతో పాటు మర మగ్గాలతో పోటీ పడటానికి జగనన్న ప్రభుత్వం నేతన్నలకు ఇస్తున్న అపూర్వకానుక ‘వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం.’
రాతియుగంలో ఆకులను శరీరానికి చుట్టుకుని, జీవించే ఆదిమ మానవులకు తన వృత్తి నైపుణ్యంతో, బట్టలు నేసి ఇచ్చి దుస్తులు ధరించే అలవాటును అలవర్చిన నేతన్నల బతుకుల్లో వెలుగులు నింపి, చేనేత వృత్తికి గత వైభవం తీసుకొచ్చేందుకు చేపట్టిన వైఎస్సార్ నేతన్న నేస్తం.. నేతన్నల పాలిట ఆపన్నహస్తంగా.. స్నేహ హస్తంగా మారింది. గత ప్రభుత్వాలలో చేనేతలు పూటగడవక ఆకలితో అలమటించే పరిస్థితి.. అరకొర ఆదాయంతో, అర్ధాకలితో పేగులు తెగేలా పోగులు పట్టి మగ్గం నేసిన చేనేతలు నేడు మరో వృత్తిని చేపట్టేందుకు మనస్సు రాక, మరోవైపు ఆదాయం లేని ఇదే వృత్తిని నమ్ముకుంటే, కన్నబిడ్డల కడుపు కూడా నింపలేని నిస్సహాయ స్థితికి వెళ్లిపోతున్న తరుణంలో జగనన్న ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో చెప్పిన విధంగా చేపట్టిన ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ అమలు చేయడం వల్ల చేనేతల పాలిట వరంగా మారింది.
ప్రతిపక్ష నేతగా  వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు 3,648 కి.మీ.ల సుదీర్ఘ పాదయాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు, వారి కుటుంబాలు పడుతున్న కష్టాలు స్వయంగా చూసి చలించిపోయారు. నేతన్నల ఆకలి చావులు, కష్టనష్టాలు, ఆత్మాభిమానం.. చేనేత అక్కచెల్లెమ్మల గుండె చప్పుడు విన్న జగనన్న… చేనేత సోదరుల సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత.. తన స్వీయానుభవంతో నేతన్నల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని పాదయాత్రలోనే నిర్ణయించుకున్నారు. చేనేతలకు ఏడాదికి రూ.24 వేల ఆర్ధిక సాయం అందించడంతో ఆయా కుటుంబాల్లో గణనీయమైన మార్పు సాధించవచ్చని గుర్తించారు. దీనికి అనుగుణంగా, ఎన్నికల మానిఫెస్టోలో చేనేతలకు ఏడాదికి రూ.24 వేలు అందిస్తామంటూ, నేతన్న బతుకుల్లో వెలుగులు నింపే వైఎస్సార్ నేతన్న నేస్తాన్ని ప్రకటించారు.
పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ ఇచ్చిన హామీలను నమ్మి 151 సీట్లతో అపూర్వ విజయం కట్టబెట్టిన ప్రజల రుణం తీర్చుకునే విధంగా, నాడు ఇచ్చిన ప్రతీ హామీని నేడు మాటిచ్చిన దానికంటే ముందుగా, చెప్పిన దానికంటే మిన్నగా నేరవేరుస్తోంది జగనన్న ప్రభుత్వం.. ఇందులో భాగంగానే చేనేత కార్మికుల స్థితిగతులను కొంతవరకైనా మెరుగుపర్చి వారి జీవన ప్రమాణాల పెంపుదలే లక్ష్యంగా ఈ అపూర్వ పథకానికి జగనన్న ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వైఎస్సార్ నేతన్ననేస్తం పథకం ద్వారా నేడు స్వంత మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబం కూడా అర్హతల మేరకు ప్రతి ఏటా ప్రభుత్వం అందించే రూ. 24 వేల సాయం పొందుతోంది.
జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో నేతన్నలకు అందించిన ఆర్ధిక సాయం రూ. 383.99 కోట్లను అందించింది. ఈ ఏడాది 3వ విడత ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా, అవినీతి, ఆశ్రిత పక్షపాతం లేకుండా, అర్హతే కొలమానంగా ఎంపికను పూర్తి చేసి, ఈ పథకం కింద అర్హతగల చేనేత కుటుంబాలకు ఈ నెల 10 న ముఖ్యమంత్రి వైఎఎస్ జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి 69,225 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి, నేరుగా, రూ.166.14 కోట్ల మొత్తాన్ని జగనన్న ప్రభుత్వం జమ చేస్తోంది. మొత్తంగా ఈ రెండేళ్ల వ్యవధిలో 3 విడతలుగా చేనేతలకు రూ.550.13 కోట్ల ఆర్దిక సాయాన్ని జగనన్న ప్రభుత్వం నేతన్నలకు అందించింది. ఈ సొమ్మును లబ్ధిదారుల పాత అప్పుల కింద జమ చేయరాదని ఇప్పటికే బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇంకా ఎవరికైనా అర్హత ఉండి, పొరపాటున పేరు జాబితాలో లేకపోతే.. గ్రామ/వార్డు సచివాలయానికి వెళ్ళి మరోసారి దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కూడా ఈ ప్రభుత్వం కల్పిస్తోంది.
75 ఏళ్ల స్వాతంత్ర్య భారత చరిత్రలో చేనేత కుటుంబాలకు ఇంత భారీ మొత్తంలో లబ్ధి చేకూర్చే పథకం ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ లాంటి సంక్షేమ పథకాన్ని అమలు చేయడం రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశంలోనే తొలిసారని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.. ఈ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల కాలంలో, ప్రతి చేనేత కుటుంబానికి 1.20 లక్షల రూపాయులు ఆర్థిక సాయం చేయడం వెనుక చేనేతల పట్ల ప్రభుత్వానికి ఉన్న ధృడ సంకల్పం కనిపిస్తోంది. ఇలా మొత్తంగా, 5 ఏళ్లలో మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు దాదాపు రూ.1000 కోట్ల ఆర్ధిక లబ్ధిని చేకూర్చడం ద్వారా రెక్కాడితే గాని డొక్కాడని నేతన్నల జీవితాల్లో తిరిగి వెలుగులు నింపుతోంది జగనన్న ప్రభుత్వం.
గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాలు కలిపి చేనేతలకు కనీసం రూ.200 కోట్లు కూడా ఇవ్వని పరిస్థితి. అటువంటిది ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండేళ్లలో చేనేతలకు దాదాపుగా రూ.550 కోట్ల మేర ఆర్ధిక సాయం అందించింది (మూడవ విడత పంపిణీతో కలిపి). కరోనా కష్టకాలంలో చేనేత కార్మికుల కష్టాలను, ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం 6 నెలలు ముందుగానే రెండో విడత నేతన్న నేస్తం కింద ఆర్థిక సాయం అందించిందంటే నేతన్నల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.. గత ప్రభుత్వాల్లో చాలా మంది చేనేత కార్మికులు పూట గడవక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండేది.. నేడు ప్రభుత్వం అందిస్తున్న ఆర్ధిక చేయూతతో వారి కుటుంబ అవసరాలు తీరడమే కాక వారి పెట్టుబడి సామర్ధ్యం పెరిగి వృత్తి, ఆర్ధిక ఎదుగుదలకు ఉపయోగపడుతోంది. నేడు చేనేతలకు ప్రభుత్వం ఇస్తున్న ఈ ప్రోత్సాహంతో గతంలో సరైన ఆదరణ లేక చేనేతను వదిలేసిన వారు మళ్లీ తిరిగి వచ్చి మగ్గాన్ని చేపడుతున్నారంటే.. జగనన్న ప్రభుత్వం, రాజన్న స్పూర్తితో అందిస్తున్న ’వైఎస్సార్ నేతన్న నేస్తం ’ లక్ష్యం సంపూర్ణంగా సిద్ధించినట్లే.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *