అద్భుతమైన ఈసీబీసీ డిజైన్లకు ‘నిర్మాణ్’ అవార్డులు…

-భవన నిర్మాణ రంగంలోనూ తొలిసారిగా ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం
-ఈసీబీసీ నిబంధనలకు అనుగుణంగా నిర్మించిన భవనాలకు జాతీయ స్థాయి గుర్తింపు ఇవ్వడమే లక్ష్యం
-పురపాలక శాఖతో కలిసి ఎక్కువ మంది భాగస్వాములయ్యేలా చూడాలి
-రాష్ట్ర ప్రభుత్వ ఇంధన సంస్థలకు బీఈఈ సూచన
-నిర్మాణ్ అవార్డులకు విరివిగా దరఖాస్తులు వచ్చేలా చూడాలన్న బీఈఈ డైరెక్టర్ సౌరభ్
-దరఖాస్తులకు ఈ నెల 31 వరకు గడువు
-వాణిజ్య భవనాల్లో ఈసీబీసీ-2017 అమలుతో 2030కల్లా దేశంలో 300 బిలియన్ యూనిట్ల పొదుపు
-దేశ వ్యాప్తంగా రూ.35 వేల కోట్ల ఆదా, బీఈఈ అంచనా
-అవార్డుల కార్యక్రమంలో పాల్గొనేందుకు సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేయండి
-పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శికి ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ లేఖ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వం తొట్ట తొలిసారిగా భవన నిర్మాణ రంగంలోనూ ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించేందుకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. నేషనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ రోడ్ మ్యాప్ ఫర్ మూమెంట్ టువార్డ్స్ అఫర్డబుల్ అండ్ నేచురల్ హేబిటేట్ (నిర్మాణ్) పేరిట పురస్కారాలు అందజేయనుంది. బీఈఈ రూపొందించిన ఇంధన సంరక్షణ బిల్డింగ్ కోడ్స్ (ఈసీబీసీ) నిబంధనలకు అనుగుణంగా డిజైన్ చేసి, ఇంధన సామర్థ్యంలో అద్భుత పనితీరు కనబర్చేలా ప్రోత్సహించేందుకు ఈ అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది.. ఈ మేరకు బీఈఈ అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఇంధన సంస్థలతో వెబినార్ నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) సహా క్రియాశీలకంగా పనిచేసే అన్ని రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు పురపాలక, పట్టణాభివృద్ధి సంస్థలతో సంప్రదింపులు జరిపి నిర్మాణ్ అవార్డులకు వీలైనంత ఎక్కువ మంది దరఖాస్తులు చేసుకునేలా చూడాలని కోరింది. దరఖాస్తులకు ఈ నెల 31 తుది గడువు అని, ఆ లోగా అత్యధిక దరఖాస్తులు వచ్చేలా చూడాలని సూచించింది.
బీఈఈ సూచనల నేపథ్యంలో రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మికి లేఖ రాశారు. నిర్మాణ్ అవార్డుల కోసం భవన యజమానులు, డెవలపర్లు, ప్రాజెక్టు డిజైనర్లు, ఫెసిలిటీ మేనేజర్లు వంటి వారు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు చేసుకునేలా చూడాలని.. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ), సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
ఈసీబీసీ నిబంధనలకు అనుగుణంగా వాణిజ్య, నివాస భవనాలను డిజైన్ చేయడాన్ని ప్రోత్సహించడం, జాతీయ స్థాయిలో గుర్తింపు ఇవ్వడమే లక్ష్యంగా ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు. అర్హత, మదింపు సమాచారం, రిజిస్ట్రేషన్ ప్రక్రియ వంటి పూర్తి వివరాలు https://bee-neerman.com వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయన్నారు.
దేశంలో ముందుగా ఈసీబీసీ-2017 కోడ్ ను అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని ఆయన తెలిపారు. ఇంధన సామర్థ్య భవనాల డిజైన్లను ప్రోత్సహించడం ద్వారా కరెంటు డిమాండ్ తగ్గడంతో పాటు గ్రీన్ హౌస్ ఉద్గారాలూ తగ్గిపోతాయని చెప్పారు.
రాష్ట్రంలో ఇంధన సామర్ధ్య పెంపు కార్యక్రమాల్లో మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ చాలా చురుకుగా పనిచేస్తోందని , ఈసిబీసి సక్సెస్ కావటానికి ఎంఏ & యూడీ శాఖ చాల చర్యలు చేపట్టిందని, నిర్మాణ్ అవార్డులలోను అదే విధమైన స్ఫూర్తి తో ఎక్కువ శాతం దరఖాస్తులు చేసుకునేలా చూడాలని కోరారు . బీఈఈ కి, ఎంఏ & యూడీ డిపార్ట్మెంట్ కు మధ్య లింక్ గా ఉండి సమన్వయము చేసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్(ఎస్ఈసిఎం)కు సూచించారు
నిర్మాణ్ అవార్డుల కార్యక్రమాన్ని జులై 16న ప్రారంభించినట్లు బీఈఈ డైరెక్టర్ , సౌరభ్ దిద్ది తెలిపారు. ఈ నెల 31లోగా అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఉత్తమ డిజైన్లను గుర్తించే ప్రక్రియ అక్టోబరు, నవంబరులో ఉంటుందని, అవార్డుల అందజేత కార్యక్రమంలో డిసెంబరులో ఉంటుందని వివరించారు.
నిర్మాణ్ అవార్డులకు వాణిజ్య, నివాస భవనాల కేటగిరీల నుంచి ఎంపిక చేస్తారని తెలిపారు. వాణిజ్య విభాగంలో అసెంబ్లీ, హెల్త్ కేర్, హాస్పిటాలిటీ, షాపింగ్ కాంప్లెక్స్, బిజినెస్, ఎడ్యుకేషనల్, మిక్స్డ్ యూజ్, సహజ వెలుతురు వచ్చే భవనాలు.. ఇలా 8 విభాగాల్లో అవార్డులు ఇస్తారని వివరించారు.
అంతేకాకుండా వాణిజ్య భవనాలకు. బెస్ట్ బిల్డింగ్ ఎన్వలప్, లైటింగ్ అండ్ కంట్రోల్స్, కంఫర్ట్ సిస్టమ్స్ అండ్ కంట్రోల్స్/ నేచురల్ వెంటిలేషన్, ఎలక్ట్రికల్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్స్ విభాగాల్లో ఆదర్శనీయ పనితీరు కనబర్చిన వాటికి కూడా అవార్డులు అందజేస్తామని చెప్పారు. అలాగే నివాస భవనాల విభాగం లో అందుబాటు ధరల్లోని ఇళ్లు, మార్కెట్ రేట్ హౌసింగ్ అనే రెండు విభాగాల్లోనూ అవార్డులు అందించనున్నట్లు వివరించారు.
ఈసీబీసీ-2017ను వాణిజ్య భవనాల్లో అమలు చేయడం ద్వారా 2030 నాటికి దేశంలో 300 బిలియన్ యూనిట్ల విద్యుత్తును ఆదా చేయొచ్చని సౌరభ్ తెలిపారు. అలాగే ఏడాదిలో పీక్ డిమాండును 15 గిగావాట్లకుపైగా తగ్గించవచ్చన్నారు. దీంతో రూ.35 వేల కోట్లు ఆదా అవుతాయని, 250 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ తగ్గుతుందని ఒక అంచనా అని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో వాణిజ్య భవనాలకు 5130 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉందని, ఇది మొత్తం విద్యుత్తు డిమాండులో 8.3 శాతమని ఏపీఎస్ఈసీఎం అధికారులు తెలిపారు. ఈ భవనాల్లో ఈసీబీసీని అమలు చేస్తే 1542 మిలియన్ యూనిట్లు (25%) విద్యుత్తు పొదుపు అవుతుందని, రూ.881 కోట్లు ఆదా అవుతాయని వివరించారు. అదేవిధంగా గృహ వినియోగ రంగంలోనూ కనీసం 15-20 శాతం అంటే 3410 మిలియన్ యూనిట్లు ఆదా చేయొచ్చని తెలిపారు.

Check Also

జాబ్ మేళా

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి లోని గవర్నమెంట్ ఐటిఐ కళాశాల, పద్మావతి పురం నందు జాబ్ మేళా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *