-కుందావారి కండ్రిక పాఠశాల కొత్త రూపు సంతరించుకోవడం సంతోషదాయకం..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని నమ్మి ముందుకు సాగుతున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. కుందావారి కండ్రికలోని మండల్ పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో నాడు-నేడు, జగనన్న విద్యాకానుక పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజ, స్థానిక కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మ శ్రీరాములుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి ప్రాధాన్యతగా ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి పరిచే బాధ్యత తీసుకుందన్నారు. గతంలో స్కూళ్లల్లోని దయనీయ పరిస్థితిని ఫొటోలు తీయించి అవే స్కూళ్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం మొదలుపెట్టిందన్నారు. అలా విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందించేందుకు వీలుగా.. రాష్ట్రంలోని 45 వేలకు పైగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లను ‘నాడు–నేడు’ జాబితాలో చేర్చడమైనదన్నారు. దాదాపు రూ.16 వేల కోట్లు ఖర్చయ్యే ఈ కార్యక్రమంలో తొలివిడతగా 15,715 ప్రభుత్వ పాఠశాలలను జాతికి అంకితం ఇస్తూనే.. రూ. 4,535 కోట్లతో రెండోదశలో 16,368 పాఠశాలల్లో పనులు ప్రారంభించుకోవడం సంతోషదాయకమన్నారు. విజయవాడ నగరంలో నాడు-నేడు రెండు దశల పనులకు సంబంధించి రూ. 6 కోట్ల నిధులను కేటాయించినట్లు తెలిపారు. పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దాలని నాడు – నేడు కార్యక్రమం చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తప్ప దేశంలోనే మరొకరు ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. విద్యారంగంలో జగనన్న ప్రభుత్వం ఇప్పటివరకు వివిధ దశలలో రూ. 30 వేల కోట్ల నిధులు వెచ్చించినా.. అవేమీ ప్రతిపక్షాల కళ్లకు కనిపించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రెండేళ్ల కిందటి వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నీ సమస్యలతో నిండి చిన్నారులు చదువుకునే వాతావరణం కనిపించేది కాదని మల్లాది విష్ణు అన్నారు. గత తెలుగుదేశం హయాంలో నిర్లక్ష్యానికి గురైన పాఠశాలల్లో కుందావారి కండ్రిక ప్రభుత్వ పాఠశాల కూడా ఒకటని పేర్కొన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ‘నాడు–నేడు’ పేరిట ప్రతి స్కూలునూ మార్చే బృహత్తర బాధ్యతను భుజానికెత్తుకున్న తర్వాత.. తొలిదశలోనే కండ్రిక పాఠశాల అద్భుతంగా రూపుదిద్దుకుందని వ్యాఖ్యానించారు. మరోవైపు పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదని.. పేదరికంతో ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనే సదుద్దేశంతో.. జగనన్న ప్రభుత్వం అనేక పథకాలను విద్యార్థులకు చేరూవ చేయడం జరిగిందన్నారు. ఇంగ్లిష్ మీడియాన్ని అందుబాటులోకి తేవటమే కాకుండా.. ‘అమ్మ ఒడి’ పేరిట చదువుకునే పిల్లలున్న తల్లులకూ ఆర్థిక ఆసరా కల్పించారన్నారు. పాఠశాలలు మొదలైన రోజే పుస్తకాలు, యూనిఫారాలతో సహా మొత్తం 7 రకాల వస్తువులతో కూడిన కిట్లను ‘జగనన్న విద్యాకానుక’గా అందజేస్తున్నారన్నారు. ఇవేగాక అమ్మఒడి, జగనన్న గోరుముద్ధ, వసతి దీవెన వంటి పథకాలను దిగ్విజయంగా అమలుచేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కేవలం 37 లక్షలు కాగా.. ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల కారణంగా వారి సంఖ్య గణనీయంగా పెరిగి 43 లక్షలకు పైగా చేరిందన్నారు. ఫలితంగా ప్రైవేట్ విద్యాసంస్థలకు ధీటుగా నేడు ప్రభుత్వ పాఠశాలలు రూపాంతరం చెందాయని వెల్లడించారు. కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సొసైటీ బ్యాంకు చైర్మన్ మూలగోళ్ల రవీంద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు యరగొర్ల శ్రీరాములు, గ్రామపెద్దలు దేవిరెడ్డి సాంబరెడ్డి, పిన్నిబోయిన కృష్ణ, వీరయ్య, ఎస్సై హైమావతి, పాఠశాల హెచ్.ఎం. పరమాత్ముని వరలక్ష్మి, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.