
-బాలల బంగారు భవితకు బాటలు వేస్తున్న “జగనన్న విద్యా కానుక’’
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర చరిత్రలో ‘జగనన్న విద్యా కానుక’ పథకం చదువుల పండుగగా నిలిచిపోతుందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘జగనన్న విద్యా కానుక’ పథకాన్ని సెంట్రల్ నియోజకవర్గంలో సత్యనారాయణపురంలోని ఏ.కె.టి.పి.హెచ్. పాఠశాలలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజ, స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో పిల్లల నమోదును గణనీయంగా పెంచడంతో పాటుగా, మెరుగైన ఫలితాలు సాధించడమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ పథకం అమలు కోసం 2020–21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం రూ.648.10 కోట్లకు పైగా వెచ్చించగా.. ఈసారి రూ.731.30 కోట్లను ఖర్చు చేస్తోందన్నారు. ఒక్క విజయవాడ నగరంలోనే రూ. 8 కోట్ల నిధులను కేటాయించినట్లు వెల్లడించారు. జగనన్న విద్యా కానుక పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 47,32,064 మందికి లబ్ధి చేకూరుతున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రతిఒక్క విద్యార్థికి 3 జతల యూనిఫాం, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగు, బై లింగువల్ పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, వర్క్ బుక్స్ తో పాటు ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్-తెలుగు డిక్షనరీ కూడా అందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ విద్యా కానుక చిన్నారులకు మేనమామ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే చల్లని దీవెన అని మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో విద్యాసంవత్సరం ముగుస్తున్నప్పటికీ విద్యార్థులకు కనీసం టెక్స్ట్ బుక్స్ అందేవి కాదని.. కానీ నేడు బడులు తెరిచిన రోజే ప్రతి ఒక్కరికీ ఏడు రకాల వస్తువులతో కూడిన కిట్లను అందించడం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని మల్లాది విష్ణు గారు తెలిపారు. విద్యారంగంలో జగనన్న ప్రభుత్వం ఇప్పటివరకు వివిధ దశలలో రూ. 30 వేల కోట్ల నిధులు వెచ్చించడం జరిగిందన్నారు. ప్రతి విద్యార్థిని కూడా ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రాథమిక స్థాయి నుంచే సీబీఎస్ఈతో అనుసంధానం చేస్తూ ఆంగ్ల మాధ్యమంలో బోధన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. దీనికి తోడు పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి అమ్మఒడి పథకం ద్వారా రూ. 15,000 వేలు అందజేయడంతో.. బడికి వెళ్లే విద్యార్థుల సంఖ్య 2.63 లక్షలు పెరిగి.. 73.06 లక్షలకు చేరిందన్నారు. అంతేకాకుండా చిన్నారులకు బలవర్ధకమైన, రుచికరమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ప్రతిరోజూ అందించేందుకు ఏటా రూ. 1,600 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విద్యారంగం పట్ల, విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పన పట్ల అలసత్వం వహిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు సుందరంగా రూపుదిద్దుకుంటున్న తరుణంలో.. ఏ.కె.టి.పి.హెచ్. పాఠశాల పట్ల అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. భావి పౌరులకు చదువును ఓ ఆస్తి లాగా అందించేందుకు ప్రభుత్వం అహర్నిశలు తాపత్రయపడుతుంటే.. అధికారులు మాత్రం ఇంత అలసత్వంగా ఉండటం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయడంలో ఎవరి పాత్ర ఎంతెంత అనేదానిపై.. ప్రతిఒక్క అధికారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్పొరేటర్లు సైతం తమ తమ పరిధిలోని పాఠశాలల్లో నాడు-నేడు పనులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. తల్లిదండ్రులు సైతం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయసహకారాలను సద్వినియోగం చేసుకుంటూనే.. తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు బాలి గోవింద్, కుక్కల అనిత, పెనుమత్స శిరీష, అలంపూర్ విజయలక్ష్మీ, ఇసరపు దేవి, ఉమ్మడి రమాదేవి, కొండాయిగుంట మల్లేశ్వరి, జానా రెడ్డి, వీఎంసీ అధికారులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News