-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దోమల నియంత్రణకు విస్తృతమైన చర్యలు చేపట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా విశాలాంధ్ర రోడ్డు, మధుర నగర్, రామకృష్ణాపురం, గులాబీ తోట ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు దోమల వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా దోమలను నియంత్రించే చర్యలు తీసుకోవాలని, కేవలం మలేరియా సిబ్బందినే కాకుండా పూర్తిగా ప్రజా ఆరోగ్య శానిటరీ ఇన్స్పెక్టర్లను కూడా భాగస్వామ్యం చేస్తూ నగర పరిధిలో యాంటీ లార్వా ఆపరేషన్లు విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. నగర పరిధిలో గల డ్రైన్ లలో పూడికలు తీయాలని, బందర్, రైవస్, ఏలూరు, బుడమేరు కాలువల్లో, నగర పరిధిలోగల కృష్ణానది లో పేరుకుపోయిన వ్యర్ధాలను తొలగించాలని, నగర శివారులలో కూడా వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేటట్టు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజలు సైడ్ కాలవలో, బందర్, రైవస్, ఏలూరు, కాలువల్లో, కృష్ణా నదిలో వ్యర్థాలను వేయకుండా, నగరపాలక సంస్థ వారు చేసే చర్యలకు సహకరించి, వ్యర్థాలను కేవలం పారిశుధ్య కార్మికుల వారికి మాత్రమే ఇవ్వాలని కోరాకు. ప్రజారోగ్య సిబ్బంది కూడా ప్రజలకు మైకు ద్వారా ప్రచారం చేసి అవగాహన కల్పించాలని అన్నారు. తదుపరి రాణి గారి తోట అన్న క్యాంటీన్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా త్రాగునీరు, వాడుక నీటి సరఫరా లో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలి అని క్యాంటీన్లో పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని ఎప్పటికప్పుడు ఏమైనా మరమ్మతులు ఉంటే వెంటనే చేయించాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, చీఫ్ ఇంజనీర్ ఇంచార్జ్ పి. సత్యకుమారి, జోనల్ కమిషనర్ ప్రభుదాస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎ శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ జగదీష్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ అన్నపూర్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News