-సమస్యల పరిష్కారానికి కృషి
-వేతన సవరణ కమిషన్ నియామకానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాం
-13 లక్షల మంది ఉద్యోగుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్నాం
-ఏపీ ఎన్జీజీవో అధ్యక్షులు ఎ.విద్యాసాగర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏపీ ఎన్జీజీవో సంఘం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎ. విద్యాసాగర్ పేర్కొన్నారు. ఉద్యోగుల హక్కుల సాధన, సంక్షేమ పరిరక్షణ కోసం ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లుతూ నిరంతరం కృషిచేస్తున్నామని తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం సాధించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
కమర్షియల్ టాక్సెస్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు భవనారి వెంకటేష్ బాబు అధ్యక్షతన ఆదివారం నగరంలోని గాంధీనగర్ ఏపీ ఎన్జీవో హోం లో జరిగింది. ఈ సమావేశంలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల వివిధ డిమాండ్లపై చర్చ జరిగింది.
రీజనల్ కార్యాలయాలు, ఇతర డివిజన్లలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్లను తిరిగి వారి సొంత డివిజన్లకు బదిలీ చేయడం, తాత్కాలికంగా ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించడం, పెండింగ్‌లో ఉన్న అన్ని పదోన్నతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయడం, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఖాళీలలో జూనియర్ అసిస్టెంట్‌గా ఆడ్-హాక్ పదోన్నతులు కల్పించడం, గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ఆఫీసర్లకు స్క్రూటినీ ఆఫ్ రిటర్న్స్ కేటాయించి, ప్రోపర్ ఆఫీసర్ గా గుర్తింపు ఇవ్వడం తదితర డిమాండ్లపై చర్చించారు.
ఇటీవల వాణిజ్య పన్నుల శాఖలో జూనియర్ అసిస్టెంట్ నుండి GSTO వరకు 100కి పైగా పదోన్నతులు కల్పించినందుకు చీఫ్ కమిషనర్ అహ్మద్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఆఫీస్ సబార్డినేట్స్‌కు జూనియర్ అసిస్టెంట్ పదోన్నతులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో ఇవ్వడానికి చీఫ్ కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి, అర్హుల వివరాలు పంపాలని జేసీలను కోరడాన్ని సంఘం స్వాగతించింది. పరిపాలనాపరమైన అనేక మార్పులు తీసుకువస్తూ, ఇంటెలి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ నుండి జాయింట్ కమిషనర్ల వరకు కూర్చున్న చోటుకే బదిలీ ఉత్తర్వులు అందజేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.
సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన విద్యాసాగర్ మాట్లాడుతూ..
వేతన సవరణ కమిషన్ (PRC) నియామకానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నామని, ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు ప్రయత్నం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని సుమారు 13 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం సంఘం అహర్నిశలు శ్రమిస్తోందన్నారు. జేఏసీతో సమన్వయంగా పనిచేస్తూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వడివడిగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ విషయంలో ఏపీ ఎన్జీవో సంఘం ఎప్పటికీ రాజీ పడదని ఆయన పేర్కొన్నారు. భవనారి వెంకటేశ్ బాబు, ప్రధాన కార్యదర్శి కొప్పోలు సుధాకర్ రావు సమర్థవంతంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని అభినందించారు. 26 జిల్లాలలో ఏపీ ఎన్జీజీవోస్ సంఘం, జేఏసీలలో వాణిజ్య శాఖ ఉద్యోగులకు సభ్యులకు వివిధ పదవులు కేటాయించినట్లు తెలిపారు.
ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రమణ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను సరైన రీతిలో, సరైన సమయంలో ఉన్నతాధికారులకు నివేదిస్తూ సంఘాన్ని ముందుకు నడిపిస్తున్నందుకు సంఘ నేతలను అభినందిస్తున్నట్లు తెలిపారు.
భవనారి వెంకటేష్ బాబు మాట్లాడుతూ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో సమస్య పరిష్కారమవుతూ వస్తోందని తెలిపారు.
సమావేశంలో కమర్షియల్ టాక్సెస్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పోలు సుధాకర్ రావు, 15 డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News