– 54 రోజుల్లో వేలాది మందికి సేవలు… యువత సేవా స్పూర్తికి నిదర్శనం
– యూత్ టైం బ్యాంకు వాలంటీర్లకు ప్రశంసా పత్రాలు అందించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యూత్ టైం బ్యాంక్ సేవలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయని, 54 రోజుల్లో వేలాది మందికి సేవలు అందించిన యువత సేవా స్పూర్తికి విశేష ప్రశంసలు లభిస్తున్నాయని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
సోమవారం కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమం సందర్భంగా ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టు విద్యార్థులు, కెరీర్ క్యాంపస్ వాలంటీర్లు మొత్తం 25 మంది ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సేవలందించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అర్జీలు ఇచ్చేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలకు అవసరమైన సహాయసహకారాలు అందించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ వాలంటీర్లకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ మార్చి 16న ప్రారంభమైన యూత్ టైం బ్యాంక్ సేవలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటివరకు 1,902 మంది వాలంటీర్లు టైం బ్యాంక్లో నమోదు కాగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 4,520 మందికి సేవలు అందించారని చెప్పారు. వాలంటీర్లు అందించిన మొత్తం పనిగంటలు 7,608గా టైం బ్యాంక్ యాప్లో నమోదైనట్లు వెల్లడించారు. కేవలం 54 రోజుల వ్యవధిలో ఇంత పెద్ద స్థాయిలో సేవలు అందించడం యువత సామాజిక బాధ్యతకు నిదర్శనమని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ప్రత్యేక దృష్టి, నిరంతర పర్యవేక్షణతో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని
జిల్లా యువజన సంక్షేమ ముఖ్య కార్యనిర్వాహణాధికారి డా. కొల్లేటి రమేష్ తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి సేవా కార్యక్రమాల్లో విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, యువత పెద్దఎత్తున భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యూత్ టైం బ్యాంక్లో చేరదలిచిన వారు యువజన సంక్షేమ శాఖ, ఎన్టీఆర్ జిల్లా కార్యాలయాన్ని లేదా మొబైల్ నంబర్ 9849909069ను సంప్రదించవచ్చని తెలిపారు.
కార్యక్రమంలో కెరీర్ క్యాంపస్ ఇన్ఛార్జ్ రవి, విద్యార్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News