– పరీక్షలను సజావు నిర్వహించేందుకు సౌకర్యాలు కల్పించండి
– జిల్లా పరీక్షల కమిటీ (డీఈసీ) సమావేశంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 21న ప్రారంభమయ్యే ఇంటర్మీడియెట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని.. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సమన్వయ శాఖల అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జిల్లా పరీక్షల కమిటీ (డీఈసీ) సమావేశం జరిగింది. మే 21 నుంచి జూన్ 4వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 57 కేంద్రాల్లో థియరీ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. మొదటి సంవత్సరానికి సంబంధించి 23,316 మంది, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 14,819 మంది మొత్తం 38,135 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నందున అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అదేవిధంగా విజయవాడలోని ఒక కేంద్రంలో రెండు సెషన్లలో జూన్ 7 నుంచి 11వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని.. వీటిని కూడా సజావుగా పూర్తిచేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని.. నో సెల్ ఫోన్ జోన్ మార్గదర్శకాలు పాటించాలన్నారు. కంట్రోల్ రూమ్, స్ట్రాంగ్ రూమ్‌లకు నిబంధనల మేరకు ఏర్పాట్లు చేయాలన్నారు. థియరీ పరీక్షలకు రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లు, మూడు సిటింగ్ స్క్వాడ్లను నియమించాలన్నారు. అవసరమైన ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందితో పాటు బందోబస్తు, పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, వైద్య శిబిరాలు, పారిశుద్ధ్యం, నిరంతర విద్యుత్ సరఫరా, విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లి వచ్చేందుకు బస్సు సౌకర్యం తదితరాలపై ఆయా శాఖల అధికారులు ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రణాళికాయుతంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి (డీఐఈవో) బి.ప్రభాకరరావు, డీఈసీ సభ్యులు జి.ఝాన్సి, ఎన్.వెంకటరావు, డిస్ట్రిక్ట్ బల్క్ ఇన్ఛార్జ్ డా. జీజేవీఎస్ఎన్డీ లక్ష్మి, డీఈవో ఎల్.చంద్రకళ, డీపీవో పి.లావణ్యకుమారి, సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News