– ప్రచార వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ.. విద్యా శాఖ, సమగ్రశిక్ష అధికారులతో కలిసి సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో బడి పిలుస్తోంది చైతన్య రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఈ చైతన్య రథం ద్వారా జిల్లాలో ఈ నెల 30వ తేదీ వరకు ఒక్కో మండలంలో ఒక్కో రోజు బడి పిలుస్తోంది కార్యక్రమంపై అవగాహన కల్పించడంతో పాటు బడి ఈడు పిల్లలు పాఠశాలలో చేరేలా ఉత్సాహపరచనున్నట్లు తెలిపారు. మండల విద్యాశాఖాధికారితో పాటు స్థానిక అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, పాఠశాలల్లో మౌలిక వసతులు, నాణ్యమైన బోధన అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇందుకు ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాలు నిదర్శనమని పేర్కొన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పకుండా పాఠశాలకు పంపించి, వారి భవిష్యత్తును బలంగా నిర్మించాలన్నారు. మన ప్రభుత్వ బడి ప్రత్యేకతలపై ర్యాలీలు వంటి కార్యక్రమాల ద్వారా కూడా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థులు ప్రభుత్వ కార్యక్రమాలను, కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి చేరాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. కార్యక్రమంలో డీఈవో ఎల్.చంద్రకళ, సమగ్ర శిక్ష ఏపీసీ ఆర్.రమేష్‌బాబు, సెక్టోరియల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News