– కచ్చితత్వంతో అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపండి..
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రజల నుంచి అందుతున్న అర్జీలను అధికారులు బాధ్యతాయుతంగా పరిశీలించి, సమస్యల స్వరూపాన్ని పూర్తిగా అర్థం చేసుకుని శాశ్వత పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అర్జీదారుని సంతృప్తే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ఆయన పేర్కొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పేజీఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులతో కలిసి అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. మొత్తం 160 అర్జీలు అందగా.. వీటిలో రెవెన్యూ 40, పోలీస్ 23, ఎంఏయూడీ 28, పంచాయతీరాజ్ 10, వైద్య ఆరోగ్యం 8, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు 6, విద్యుత్ 5, డీఆర్‌డీఏ 4, ఏపీఎస్ ఆర్‌టీసీ 4, విద్య 4, పౌర సరఫరాలు 3, రవాణా 2, ఎస్‌సి కార్పొరేషన్ 2, విభిన్న ప్రతిభావంతులు 2, మార్కెటింగ్ 2, డ్వామా 2, హౌసింగ్ 2, మత్స్య 2, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు, మైన్స్, ఉపాధి, సమాచార పౌర సంబంధాలు, ఇరిగేషన్, కార్మిక, దేవాదాయ, బ్యాంకింగ్‌కు సంబంధించి ఒక్కో ఆర్జీ స్వీకరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు పలుమార్లు తిరగాల్సిన పరిస్థితి రాకుండా ప్రతి అర్జీపై సమగ్రంగా విచారణ చేసి, స్పష్టతతో చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి అర్జీని కేవలం విధి నిర్వహణగా కాకుండా మానవతా దృక్పథంతో పరిశీలించాలని, సమస్య పరిష్కారానికి అవసరమైన శాఖల మధ్య సమన్వయం ఉండాలని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News