విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
న్యూఢిల్లీలో జరిగిన యూరప్ డే (ఐరోపా దినోత్సవం) వేడుకల్లో విజయవాడ పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులు పాల్గొని సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చినట్లు ప్రిన్సిపాల్ డా. మేకా రమేశ్ తెలిపారు. కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథిగా పాల్గొన్న షూమాన్ డిక్లరేషన్ 76వ వార్షికోత్సవంలో పి.బి. సిద్ధార్థ విద్యార్థులు జిజ్ఞాస ఆర్ట్‌వర్స్ సహకారంతో జానపద నృత్యం (గరగలు) ప్రదర్శించడంతోపాటు జానపద ఆర్కెస్ట్రా కూడా నిర్వహించారు. ఈ సాంస్కృతిక బృందానికి డా.పి.టి.ఎస్.ఆర్.కె. ప్రసాదరావు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపల్ డా. రమేష్ తో పాటు డైరెక్టర్ వేమూరి బాబూరావు, డీన్ రాజేశ్ సి. జంపాల, సిద్ధార్థ అకాడమి అధ్యక్ష కార్యదర్శులు మలినేని రాజయ్య, పాలడుగు లక్ష్మణరావు, కళాశాల కన్వీనర్ నిమ్మగడ్డ లలితప్రసాద్ అభినందించారు. రాష్ట్ర పరిధిలో మరెవరికీ దక్కని అవకాశాన్ని తమ విద్యార్థులు సద్వినియోగం చేసుకుని, తమ ప్రతిభతో కేంద్ర ఆర్థికమంత్రితోపాటు యూరప్ రాయబారి ప్రశంసలు అందుకోవడం అభినందనీయమన్నారు. దేశం నలుమూలల నుండి వచ్చిన వృత్తిపరమైన కళాకారులతో వేదికను పంచుకోవడం తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని విద్యార్థులు హర్షం వ్యర్థం చేశారు. భారత్-ఈయూ సత్సంబంధాలను, భాగస్వామ్యాన్ని ఈ తరహా వేడుకలు బలోపేతం చేస్తాయని యాజమాన్యం పేర్కొంది.
Prajavartha Online Telugu News