-చిరునవ్వుతో నర్సులందించే సేవలతోనే రోగులకు సాంత్వన
-వృత్తి పట్ల నిబద్ధతపై ఆత్మ పరిశీలన చేసుకోవాలి
-వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు
– గుంటూరులో ఘనంగా ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుల ప్రదానం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రోగుల ఆరోగ్య సంరక్షణలో సిస్టర్స్ (నర్సులు) కీలకంగా వ్యవహరిస్తున్నారు. ‘సిస్టర్’ అనే పదంలో అప్యాయత, ప్రేమ, కరుణ, దయ వంటి లక్షణాలు దాగి ఉన్నాయి. ఇవి తల్లి తన పిల్లలకు అందించే ప్రేమ, అప్యాయతతో సమానం. అందుకే నర్సులను ప్రేమగా సిస్టర్స్ ‘గా పిలుస్తున్నాం. చిరునవ్వుతో నర్సులు ఆందోళనలో ఉండే రోగులను ఓదారుస్తూ అప్యాయంగా మాట్లాడుతూ సేవలు అందిస్తే అనారోగ్యం 50% వరకు పోతుందని రోగులు భావిస్తారు’ అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. గుంటూరులోని ప్రభుత్వ వైద్య కళాశాల జింఘానా ఆడిటోరియంలో మంగళవారం సాయంత్రం జరిగిన ‘అంతర్జాతీయ నర్సుల దినోత్సవ’ వేడుకల్లో ఐదుగురికి మంత్రి సత్యకుమార్ ‘ఫ్లోరెన్స్ నైటింగేల్’ అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రులకు రోగులు వచ్చినప్పటి నుంచి ఆరోగ్యం కుదటపడి ఇళ్లకు వెళ్లేంత వరకూ అడుగడుగునా నర్సులు సేవలు అందిస్తుంటారు. అమెరికాలో జరిగిన ఓ అధ్యయనం ప్రకారం నర్సింగ్ అత్యంత పవిత్రమైన వృత్తిగా తేలింది. రోగులకు అందే సేవల్లో 86% నర్సుల వైపు నుంచే ఉంటున్నాయని గుర్తించారు. నర్సులు తమ విధుల నిర్వహణ తీరును ఎప్పటికప్పుడు బేరీజువేసుకుంటూ నైపుణ్యాలు పెంచుకుంటూ ఉండాలి. ఇంటికి వెళ్లినప్పుడు సోదరి ఏ విధంగా తమ అప్తులపట్ల చిరునవ్వుతో కనబరిచే ప్రేమనే రోగులపట్ల కనబరచాలి. ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి(206) ఇప్పటికీ జరుపుకుంటున్నామంటే గాయపడిన సైనికులకు ఆమె అందించిన సేవలు ఎవరూ ఎప్పటికీ మరచిపోలేనివి కావడమే.
700 నర్సింగ్ కళాశాలల ద్వారా 38 వేల మందికి డిగ్రీ పట్టాలు
కేరళలోని నర్సులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇందుకు ఆ రాష్ట్రంలో ప్రత్యేక కారణాలు లేకపోలేదు. అయితే. మన రాష్ట్రంలో ఉన్న 700 నర్సింగ్ కళాశాలల ద్వారా ఏటా 38,000 మంది డిగ్రీ పట్టాలతో బయటకొస్తున్నారు. మన రాష్ట్రానికి చెందిన నర్సులు రోగులకు అందించే సేవలపరంగా వస్తున్న గుర్తింపు మరింత పెరగాలి. కేరళలోని బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి కూడా పరిశీలించాలి. రోగులకు అందించే సేవల్లో ఎంతవరకు మానవీయతను జోడిస్తున్నారో ఆత్మప రిశీలన చేసుకుంటూ పవిత్రమైన వృత్తిపట్ల పునరంకితులు కావాలి.
విదేశాల్లో ఉద్యోగాల కోసం నర్సులకు సదరు భాషల్లో శిక్షణ
నర్సులు ఉద్యోగావకాశాలను విదేశాల్లో అందిపుచ్చుకునేందుకు వీలుగా జర్మనీ, ఇతర విదేశీ భాషల్లో విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సీఎం శ్రీ చంద్రబాబు దార్శనికతలో కూటమి ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రులను బలోపేతం చేస్తోంది. ఓపీ, ఐపీ కేసులు ప్రభుత్వాసుపత్రుల్లో భారీగా పెరుగుతున్నాయి. 104 సంచార వాహనాల ద్వారా ఉచితంగా ప్రతి ఒక్కరికి 47 రకాల పరీ క్షలను ఉచితంగా చేయబోతున్నాం. వ్యాధులు రావడానికి ముందుగానే ప్రివెంటివ్ విధానాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది’ అని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వివరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (ఎఫ్ఎసీ) డాక్టర్ రాధికారెడ్డి నర్సింగ్ వృత్తి ప్రాధాన్యాన్ని వివరించారు.
ఐదుగురికి ఫోరెన్స్ నైటింగేల్ అవార్డులు ప్రదానం
డాక్టర్ బి.వనజ కుమారి (ప్రిన్సిపాల్, నారాయణ నర్సింగ్ కాలేజీ, నెల్లూరు) బెస్ట్ నర్స్ రీసెర్చర్, డాక్టర్ సి.ఆర్.సంషేర్ బేగం (ప్రిన్సిపాల్, మిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, విజయనగరం) బెస్ట్ నర్స్ అడ్మినిస్ట్రేటర్, డాక్టర్ కె.సుగంతి(లెక్చరర్, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, మచిలీపట్నం) బెస్ట్ నర్స్ ఎడ్యుకేటర్,
ఎస్. చిన్నమ్మి(హెడ్ నర్స్, సిహెచ్‌సి, బుడితి, శ్రీకాకుళం జిల్లా) బెస్ట్ నర్సింగ్ సర్వీసెస్, కె.సావిత్రి(ఎన్ఎన్ఎం, పిహెచ్‌సి, చుక్కలూరు, అనంతపురం జిల్లా)కు ఎఎన్ఎం కేటగిరీలో అవార్డులు ప్రదానం చేశారు.
చిన్నమ్మి, సావిత్రి ఎవరు-నర్సింగ్ విద్యార్థుల్ని ప్రశ్నించిన మంత్రి
మంత్రి శ్రీ సత్యకువ ర్ యాదవ్ తన ప్రసంగ ఆరంభంలో ‘చిన్నమ్మి, సావిత్రి’ (పురస్కార గ్రహీతలు) ఎవరు అడిగితే నర్సింగ్ విద్యార్థుల నుంచి స్పందన రాలేదు. అవార్డుల ప్రదాన కార్యక్రమానికి వచ్చినప్పుడు ఉత్తమ ప్రతిభ కనబరిచి, పురస్కారాలు అందుకునే వారి గురించి తెలుసుకోకపోతే ఎలా అని విద్యార్థులను ప్రశ్నించారు. సినిమాల్లోని డైలాగుల గురించి అడిగినప్పుడు మాత్రం విద్యార్థులు వెంటనే స్పందించారు. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్, ఏపీ నర్సస్ అండ్ మిడ్ వైవ్స్ కౌన్సెల్ రిజిస్ట్రార్ డాక్టర్ సుశీల,
గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్‌వి రమణ, డాక్టర్ ఎస్ఎస్‌సి చక్రరావు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News