గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోని జంక్షన్లు, ఐలాండ్ లు, పార్కులు, పివికె నాయుడు మార్కెట్లను ఆధునిక వసతులతో ఆకర్షణీయంగా అభివృద్ది చేయడానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఏపియుఐఎయంయల్, శ్రీవత్స ఆర్కిటెక్ ప్రతినిధులను ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఏపియుఐఎయంయల్), శ్రీవత్స ఆర్కిటెక్ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం జరిగింది.
ఈ సంధర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరం రాష్ట్ర రాజధానిలో భాగంగా ఉందని, కావున నగరంలో అధునాతన హంగులతో జంక్షన్లు, పార్కులు, సెంట్రల్ డివైడర్లు మరియు అవేన్యు ప్లాంటేషన్ అభివృద్ది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నగరంలో అవసరమైన ప్రాంతాలలోని జంక్షన్లు, పార్కులు, సెంట్రల్ డివైడర్లు, ఐలాండ్లు, రోడ్ మార్జిన్లలో ప్లాంటేషన్ అభివృద్ది చేయుటకు ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. అలాగే నగరంలో పివికె నాయుడు కూరగాయల మార్కెట్ కూడా నూతనంగా నిర్మించుటకు నగర పాలక సంస్థ నిర్ణయించిందని, అందుకు తగిన విధంగా ప్రతిపాదనలు సిద్దం ఛేయాలని ఏ.పి.యు.ఐ.యం.యల్ మరియు శ్రీ వాత్స ఆర్కిటెక్ ప్రతినిధులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం త్రాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యతనిస్తుందని, అందువలన నగర పాలక సంస్థ కూడా త్రాగునీరు కలుషితం కాకుండా నగర ప్రజలకు త్రాగునీటి సరఫరా మెరుగు పరచుటకు స్కాడా విధానాన్నిప్రవేశపెట్టుటకు డిపిఆర్ సిద్దం చేయాలని ప్రతినిధులను ఆదేశించారు. దీని ద్వారా పైప్ లైన్లలో వాటర్ ప్రెజర్ గుర్తించుటకు, లీకులను గుర్తించుటకు మరియు త్రాగునీటిలో క్లోరిన్ పర్సెంటేజ్ లను తెలుసుకొనుటకు స్కాడా విధానం ఉపయోగపడుతుందని, అందువలన నగరంలో స్కాడా విధానాన్ని ప్రవేశపెట్టాలని, అంతేకాక త్రాగునీటి పైప్ లను జోనల్ మ్యాపింగ్ చేయాలని ఏ.పి.యు.ఐ.యం.యల్ ప్రతినిధులను ఆదేశించారు.
సమావేశంలో ఏపియుఐఎయంయల్, శ్రీవత్స ఆర్కిటెక్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News