Breaking News

సూర్యలంక బీచ్ కు మహర్దశ: మంత్రి కందుల దుర్గేష్

-ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా బాపట్ల సూర్యలంక బీచ్..బాపట్ల తీరానికి అంతర్జాతీయ మెరుగులు: మంత్రి కందుల దుర్గేష్
-స్వదేశీ దర్శన్ 2.0 కింద రూ.97.52 కోట్లతో సూర్యలంక సమగ్ర అభివృద్ధి..ప్రత్యేక కార్యాచరణతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడి..పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్,బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ, జిల్లా కలెక్టర్ వినోద్, ఎస్పీ ఉమామహేశ్వరరావు
-పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్‌ ఆధ్వర్యంలో పర్యాటక రంగ పురోగతిపై సమీక్ష..అనంతరం అడ్వెంచరస్ వాటర్ స్పోర్ట్స్ ను ప్రారంభించిన మంత్రి దుర్గేష్
-అడ్వెంచర్ ప్రియుల కోసం సూర్యలంక సాగర తీరంలో వాటర్ స్పోర్ట్స్ హంగామా .. పర్యాటకులు మైమరిచేలా అదిరిపోయే అడ్వెంచర్ రైడ్స్..అలలపై జెట్ స్కీ థ్రిల్..
-“సూర్యలంక సాగర తీరాన.. సాహసాల విహారాన!..పర్యాటకులకు భరోసానిస్తూ స్వయంగా రంగంలోకి దిగి జెట్ స్కీ రైడ్ చేసిన పర్యాటక మంత్రి కందుల దుర్గేష్”
-సూర్యలంక బీచ్ కు బే ఆప్ బాపట్ల పేరుతో బ్రాండింగ్ ప్రారంభించిన మంత్రులు..కుటుంబంతో సరదాగా బీచ్ లో గడిపేలా ఏర్పాట్లు చేస్తామని వెల్లడి..ఫెస్టివల్ కార్నివాల్ నిర్వహిస్తామని ప్రకటన
-సినీ షూటింగ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా సూర్యలంక బీచ్ ను మార్చేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి దుర్గేష్ వివరణ*
-గడిచిన 18 నెలల్లోనే రాష్ట్రానికి రూ.20 వేల కోట్ల పర్యాటక పెట్టుబడులు సాధించామని ప్రకటన..ఇన్వెస్టర్లకు రాయితీలు.. పర్యాటకులకు సరికొత్త అనుభూతులు – బాపట్లలో అభివృద్ధి పరుగులు పెడుతోందని స్పష్టం
-అంతర్జాతీయ గుర్తింపు దిశగా సూర్యలంక బీచ్ అడుగులు..బ్లూ ఫ్లాగ్ గుర్తింపుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్న మంత్రి దుర్గేష్
-నాడు పర్యాటక రంగం కుదేలు.. నేడు జోరుగా పర్యాటకాభివృద్ధి.. కేంద్ర సహకారం, సీఎం చంద్రబాబునాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలో పర్యాటక రంగంలో కూటమి ప్రభుత్వం మార్క్ అభివృద్ధి!

బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త :
బాపట్ల జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన సూర్యలంక బీచ్‌ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. మంగళవారం సూర్యలంక బీచ్ లో నిర్వహించిన అభివృద్ధి పనుల సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ, జిల్లా కలెక్టర్ వినోద్, ఎస్పీ ఉమామహేశ్వరరావు మరియు పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్య ప్రసాద్ లు భూమి పూజ చేశారు. సూర్యలంక బీచ్ కు బే ఆప్ బాపట్ల పేరుతో బ్రాండింగ్ ప్రారంభించారు.కుటుంబంతో సరదాగా బీచ్ లో గడిపేలా ఏర్పాట్లు చేస్తామని వెల్లడించడంతో పాటు ఫెస్టివల్ కార్నివాల్ నిర్వహిస్తామని ప్రకటించారు.

సమీక్ష అనంతరం బ్లూ వేవ్ అడ్వెంచరస్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెట్ స్కీ రైడ్స్ ను మంత్రి దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా “కేవలం సమీక్షలకే పరిమితం కాకుండా, పర్యాటకులకు కలిగే ‘థ్రిల్’ ఎలా ఉంటుందో స్వయంగా అనుభవించేందుకు మంత్రి కందుల దుర్గేష్ సాగర అలలపై జెట్ స్కీ రైడ్ చేశారు. సాహస క్రీడలకు సూర్యలంక కేరాఫ్ అడ్రస్‌గా మారుతోందని ఆయన ఈ సందర్భంగా నిరూపించారు.సూర్యలంక సముద్ర తీరం ఇప్పుడు కేవలం అందానికే కాదు.. అడ్వెంచర్ కు కూడా పెట్టింది పేరు అని అన్నారు..పర్యాటకులారా ఇంకెందుకు ఆలస్యం .. మీరు కూడా రండి.. అలలపై ఆడుకుందాం!అంటూ చమత్కరించారు.వాటర్ స్పోర్ట్స్ ద్వారా అలలపై ప్రయాణం అద్భుతమైన థ్రిల్ కు గురి చేస్తుందని మంత్రి దుర్గేష్ అన్నారు.

*రూ. 97.52 కోట్లతో సూర్యలంక రూపురేఖల మార్పు*

సమీక్ష అనంతరం కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద మంజూరైన రూ. 97.52 కోట్ల నిధులతో సూర్యలంక బీచ్ లో చేపడుతున్న వివిధ పనులను మంత్రి దుర్గేష్ క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా పర్యాటకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులను ఉద్దేశించి మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. ఈ నిధులతో ఆకర్షణీయమైన వెల్‌కమ్ ఆర్చ్, పర్యాటకులు సేద తీరేలా స్ట్రెస్ క్యాంపింగ్ వంటి ప్రత్యేక ఏర్పాట్లు సైకిల్ ట్రాక్‌తో కూడిన అప్రోచ్ రోడ్డు, రాత్రి వేళల్లో కూడా పర్యాటకులు ఇబ్బంది పడకుండా ఉండేలా స్ట్రీట్ లైటింగ్, కబుల్ స్టోన్ పేవింగ్‌తో కూడిన పాదచారుల దారి, పర్యాటకులకు మార్గనిర్దేశం చేసేందుకు టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, 11 కేవీ సోలార్ పవర్ సిస్టమ్, బీచ్‌ను పరిశుభ్రంగా ఉంచేందుకు అధునాతన వ్యర్థాల నిర్వహణ, ల్యాండ్ స్కేపింగ్, సీటింగ్ మరియు సాహసోపేతమైన వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పనులన్నింటినీ నాణ్యతతో, యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తేవాలని మంత్రి దుర్గేష్ కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు.నాణ్యత విషయంలో రాజీ పడవద్దని కాంట్రాక్టర్లకు సూచించడంతో పాటు, ఈడీలు, ఆర్డీలు, డీవీఎంలు, మరియు డీటీవోలు జిల్లా కలెక్టర్‌తో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పనుల పురోగతిని పర్యవేక్షించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా అధికారుల కృషిని అభినందించారు. సూర్యలంక బీచ్ ను కాంప్రహెన్సివ్ ప్రాజెక్టుగా చేసి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. దీనికోసం ప్రత్యేక బ్లూ ప్రింట్ తయారు చేసి అభివృద్ది చేసి చూపిస్తామన్నారు. భవిష్యత్ లో అద్భుత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు గొప్ప ప్రయత్నాన్ని ప్రారంభించామని, అందుకు ప్రజల ఆశీస్సులు ఉండాలని కోరారు.

2019-24 లో గత ప్రభుత్వం అనేక రంగాలతో పాటు పర్యాటక రంగాన్ని పూర్తిగా కుదేలు చేసిందని మంత్రి దుర్గేష్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఇన్వెస్టర్లలో నమ్మకం పెరిగి పెట్టుబడులు వెల్లువలా వచ్చాయని, అదే స్థాయిలో పర్యాటకాభివృద్ధి జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారని ఈ క్రమంలో అకుంఠిత దీక్షతో వారు పనిచేస్తున్నట్లు మంత్రి దుర్గేష్ వివరించారు.

*బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ దిశగా అడుగులు*

సూర్యలంకలో కేవలం ప్రభుత్వ నిధులే కాకుండా, ప్రైవేట్ భాగస్వామ్యం తో స్టార్ హోటల్స్ మరియు రిసార్ట్స్ నిర్మించడానికి మంత్రి అనగాని సత్యప్రసాద్ గారితో కలిసి ఇప్పటికే భూములను గుర్తించి, ఇన్వెస్టర్లకు బదలాయించడం జరిగిందన్నారు. ఇప్పటికే సంబంధిత జీవో కూడా విడుదల చేశామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు అత్యంత సమీపంలో ఉన్న బీచ్‌లుగా బాపట్ల, చీరాలకు భౌగోళికంగా ప్రత్యేక విశిష్టత ఉందని వెల్లడించారు. సూర్యలంక బీచ్‌కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేలా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కోసం ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇటీవల పెరిగిన సముద్రతీరం 1053 కి.మీలు ఉన్నప్పటికీ బాపట్ల సూర్యలంకలో కేవలం ఒక కిలోమీటర్ మాత్రమే ఉందని అధికారులు తెలిపారని, అయినప్పటికీ ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా ఇతోధికంగా సహకారం అందిస్తున్న గొప్ప ప్రాంతం బాపట్ల సూర్యలంక బీచ్ అని మంత్రి దుర్గేష్ కొనియాడారు. బాపట్లకు తెలంగాణతో సహా ఇతర ప్రాంతాలనుండి వచ్చే పర్యాటకుల సంఖ్య రోజురోజుకు క్రమంగా పెరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఒకరోజు పర్యటనకు వచ్చే పర్యాటకుడిని రెండు మూడు రోజులు ఇక్కడే ఉంచేలా, సమీప ప్రాంతాలు చూసేలా అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. పర్యాటకుల సందడి పెరిగితే పర్యాటకం అభివృద్ధి చెందుతుందన్నారు.తద్వారా పర్యాటకాభివృద్ధితో పాటు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందన్నారు. సూర్యలంక బీచ్ ను అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తుందన్నారు. ఈ ప్రాంతంలో పీపీపీ భాగస్వామ్యంతో కొన్ని కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ సాయంతో మరికొన్ని కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇటీవల కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను రెండు మూడు పర్యాయాలు న్యూఢిల్లీలో కలిసిన సందర్భంలో సూర్యలంక బీచ్ అభివృద్ధిపై మాట్లాడినప్పుడు మంచి డీపీఆర్ తో రావాలని ఆయన కోరగా తాము అద్భుతమైన డీపీఆర్ ఇచ్చామని, ఈ నేపథ్యంలోనే ఆయన సానుకూలంగా స్పందించి కేంద్రం ద్వారా రూ.98 కోట్ల నిధులు మంజూరు చేసి సహకారం అందించినట్లు గుర్తుచేసుకున్నారు.

*సినీ షూటింగ్‌లకు ప్రోత్సాహం – మౌలిక వసతుల కల్పన*

సినిమా షూటింగ్‌ల ద్వారా పర్యాటకానికి ఎంతో ప్రచారం లభిస్తుందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. గతంలో ‘పుష్ప’ సినిమా ద్వారా మారేడుమిల్లిలోని గుడిసె ప్రాంతానికి వచ్చిన గుర్తింపును ఉదాహరణగా చూపుతూ.. సూర్యలంకలో షూటింగ్స్ పెంచాలని చిత్ర పరిశ్రమను కోరామన్నారు. ఇకపై షూటింగ్ జరిగిన ప్రాంతాల పేర్లను సినిమాలో ప్రదర్శించాలని వారికి సూచించినట్లు తెలిపారు. రాష్ట్రంలో డబ్బింగ్, రికార్డింగ్, రీ-రికార్డింగ్ థియేటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి సంపూర్ణ సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.

*పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా – ఇన్వెస్టర్లకు రాయితీలు*

విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యాటకరంగాన్ని వృద్ధి చేయాలన్న సత్సంకల్పంతో పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించారని మంత్రి దుర్గేష్ తెలిపారు. నూతన పర్యాటక పాలసీ 2024-29 ద్వారా మంచి ప్రపోజల్స్ తో, బ్రాండింగ్ తో వచ్చిన వారికి ఇన్వెస్టర్లకు ల్యాండ్ అలాట్ మెంట్ తో పాటు ఎస్జీఎస్టీ రీయింబర్స్‌మెంట్, పరిశ్రమ రంగానికి ఇచ్చే విద్యుత్ టారిఫ్ రాయితీలు అందిస్తున్నామన్నారు. తద్వారా పర్యాటక రంగానికి ఊతం వచ్చిందని, ఈ నేపథ్యంలో కేవలం 18 నెలల్లోనే రాష్ట్రానికి రూ.20 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వివరించారు.

*పర్యాటక రంగానికి విస్తృత ప్రచారం*

పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేసేందుకు ఆధునిక పద్ధతులను అనుసరిస్తున్నామని, ఇందులో భాగంగా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లను వినియోగిస్తున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. వివిధ మాధ్యమాల ద్వారా సూర్యలంక విశిష్టతను ప్రపంచానికి చాటుతామని చెప్పారు. ఏపీని ప్రపంచపర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్న సీఎం చంద్రబాబునాయుడు, వారికి సహకరిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల మార్గనిర్దేశకత్వంలో అందరం కలిసి సమిష్టిగా కృషి చేస్తున్నామన్నారు.కమ్యూనిజం, క్యాపిటలిజం చూశాం..భవిష్యత్ లో టూరిజంను చూస్తామని సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యలను నిజం చేస్తామన్నారు.

రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ భూ సమస్యల పరిష్కారంపై, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ జిల్లా పర్యాటక అభివృద్ధిపై చేస్తున్న కృషిని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ కొనియాడారు.ఏపీటీడీసీ ఛైర్మన్ నూకసాని బాలాజీ పర్యాటక రంగ అభివృద్ధే లక్ష్యంగా ఫ్యాషన్ తో పని చేస్తున్నారని కొనియాడారు. పర్యాటక రంగంలో బాపట్లను అగ్రశ్రేణి జిల్లాగా మార్చాలన్న సంకల్పంతో జిల్లా కలెక్టర్ వినోద్ కృషి చేస్తున్నారన్నారు. 2029 నాటికి ఏపీని ప్రపంచ పర్యాటక హబ్‌గా మార్చాలన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల ఆశయాలకు అనుగుణంగా ప్రతి అధికారి, కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు.

*జారీ చేసిన వారు:పీఆర్ఓ, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు*

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *